Wednesday, 27 Jan, 7.25 am ఈనాడు

ఖమ్మం
సంకల్పం.. సమష్టి కృషి

జిల్లాలోనే సర్వాంగ సుందరంగా మొండికుంట వైకుంఠధామం

అశ్వాపురం, న్యూస్‌టుడే: సంకల్పానికి సమష్టి కృషి తోడైతే సాధించలేనిది ఏదీలేదనేందుకు అశ్వాపురం మండలంలోని మొండికుంట వైకుంఠధామం నిదర్శనం. భద్రాద్రి జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఈ ధామం నిర్మాణం పూర్తి చేసుకుని ఓ ఉద్యాన వనంలా ముస్తాబైంది. సర్పంచి మర్రి మల్లారెడ్డి, ఉప సర్పంచి మేడవరపు సుధీర్‌ సహా పంచాయతీ పాలకవర్గ సభ్యులు సమష్టిగా దీన్ని తీర్చిదిద్దారు. మణుగూరు ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఈ వైకుంఠధామం చూసినవారు తప్పకుండా ఆగి వెళ్తున్నారు. ఉపాధి పథకం కింద మంజూరైన రూ.12.6 లక్షలకు తోడు గ్రామ పంచాయతీ సుమారు రూ.2.50 లక్షల వ్యయం చేశారు. స్త్రీలు, పురుషులకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు, స్నానాల గదులు నిర్మించారు. స్నానాల గదుల్లో సాధారణ పంపులతో పాటు ఖరీదైన షవర్లను ఏర్పాటుచేశారు. స్నానాల గదులు, మరుగుదొడ్లను అందమైన టైల్స్‌తో పరిచారు. విశ్రాంతి గృహాన్ని కూడా స్లాబ్‌తో నిర్మించారు. గదులను టైల్స్‌తో అలంకరించారు.

వైకుంఠ ధామానికి కేటాయించిన స్థలం కన్నా అదనంగా మరో అరెకరం స్థలాన్ని సమకూర్చుకుని అ ప్రదేశంలో హరితానికి పెద్దపీట వేశారు. రకరకాల మొక్కలతో పార్కులా తీర్చిదిద్దారు. బోరు వేసి ఆవరణలో అన్నిచోట్ల తాగునీటి పంపులను ఏర్పాటుచేశారు. ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఏర్పాటుచేసిన శివుడు, సత్యహరిశ్చంద్రుల విగ్రహాలు చూడముచ్చటగా ఉన్నాయి. ప్రవాస భారతీయులు కందిమళ్ల సత్యనారాయణరెడ్డి, అంజిరెడ్డి వారి తండ్రి రాఘవరెడ్డి స్మారకార్థం రూ.2.5 లక్షలతో వీటిని నెలకొల్పారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top