Saturday, 28 Mar, 4.20 pm ఈనాడు

తాజా వార్తలు
SENA దేశాల్లో రాణిస్తేనే భారత్‌ నం 1

కివీస్‌లో అలా ఓడిపోవడం బాధించింది: జాఫర్‌

ముంబయి: న్యూజిలాండ్‌ పర్యటనలో తొలుత టీ20 సిరీస్‌లో సత్తా చాటిన టీమ్‌ఇండియా తర్వాత వన్డే, టెస్టు సిరీసుల్లో ఘోర పరాభవం ఎదుర్కోవడం తనను బాధించిందని మాజీ బ్యాట్స్‌మన్‌ వసీం జాఫర్‌ అన్నాడు. తాజాగా ఓ జాతీయ మీడియాతో ముచ్చటించిన రంజీ క్రికెటర్‌.. ప్రపంచ నంబర్‌ వన్‌ జట్టుకు ఇలాంటి ఫలితాలు రావడం సరికాదన్నాడు. ఈ ఫలితాల వల్ల వ్యక్తిగతంగా నిరాశచెందానని చెప్పాడు. 'టీమ్‌ఇండియా టీ20 సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేశాక వన్డే, టెస్టు సిరీస్‌లు ఏకపక్షంగా కోల్పోయింది. ప్రపంచ నంబర్‌ 1 జట్టు ఇలా ఓడిపోకూడదు' అని జాఫర్‌ అభిప్రాయపడ్డాడు.

'టీమ్‌ఇండియా విదేశాల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసి ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ జట్లలా ఆధిపత్యం చెలాయించాలి. ఆ రెండు జట్లూ ఇతర దేశాల్లో విజయాలు సాధించే మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. భారత జట్టుకు ఆ సత్తా ఉన్నా ఆడాల్సిన తీరులో ఆడలేకపోతోంది. గతేడాది ఆస్ట్రేలియాలో చారిత్రక విజయం సాధించినా.. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ దేశాల్లో ఇంకా రాణించలేదు. అక్కడా రాణిస్తేనే ఎవర్నైనా బలమైన జట్టుగా గుర్తిస్తారు. టీమ్‌ఇండియాను స్వదేశంలో ఓడించడం ప్రపంచంలో ఏ జట్టుకైనా కష్టమే. కానీ, అదే భారత జట్టు SENA దేశాల్లో రాణిస్తేనే అసలైన ప్రపంచ నంబర్‌ 1 జట్టు అనే గుర్తింపు లభిస్తుంది' అని జాఫర్‌ పేర్కొన్నాడు. ఇక ఇటీవలే అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఈ ముంబయి బ్యాట్స్‌మన్‌ రంజీ ట్రోఫీ లెజెండ్‌గా గుర్తింపు పొందాడు. ఈ ఫార్మాట్‌లో అత్యధిక మ్యాచ్‌లు(156) ఆడిన ఆటగాడిగా, అత్యధిక పరుగులు(12,038) చేసిన బ్యాట్స్‌మన్‌గా, అత్యధిక సెంచరీలు(40) బాదిన క్రికెటర్‌గా, అత్యధిక క్యాచ్‌లు(200) అందుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.


Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu

related stories

Top