Thursday, 29 Jul, 8.20 am ఈనాడు

తూర్పు గోదావరి
శిరస్త్రాణం.. శిరసావహిద్దాం

ఆరు నెలల్లో 209 రోడ్డు ప్రమాదాలు..

65 మంది మృతి

న్యూస్‌టుడే, కంబాలచెరువు, దానవాయిపేట (రాజమహేంద్రవరం) : శిరస్త్రాణం.. ద్విచక్ర వాహన చోదకులకు రక్షణ కవచం. అందరికీ తెలిసినా.. కళ్లముందు ప్రమాదాలు చూస్తున్నా... ఇంకా ఏదో తెలియని అశ్రద్ధ. రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు 209 రోడ్డు ప్రమాదాలు జరగ్గా అందులో 65 మంది మృత్యువాత పడగా.. 250 మంది క్షతగాత్రులయ్యారు. ఇందులో 80 శాతానికి పైగా 40 ఏళ్లలోపు వారు మృతిచెందడంతో వారి కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి.

తలకు తగిలే గాయాల వల్లే..

ద్విచక్ర వాహన ప్రమాదాల్లో అధికంగా తల నేలకు తగిలి.. బలమైన గాయాలై ప్రాణాలు కోల్పోతున్నారని నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రతిఒక్కరూ తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలని సూచిస్తున్నారు. అర్బన్‌ జిల్లాలో లక్షల సంఖ్యలో ద్విచక్రవాహనాలు ఉండగా ఇందులో అధిక సీసీ ఉన్న వాహనాలను నడిపేవారు 60 శాతానికి పైగా యువతే ఉన్నారు. ఎక్కువ మందికి నిర్ణీత వయసు, డ్రైవింగ్‌ లైసెన్సులు కూడా ఉండడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలువురు 350 సీసీ వాహనాలు నడుపుతూ అత్యుత్సాహం చూపుతూ ప్రమాదాలకు కారణంగా నిలుస్తున్నారు. వీటిపై రాజమహేంద్రవరం నగరంతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ పెద్ద సంఖ్యలో ఫిర్యాదులొస్తున్నాయి.

పట్టని నిబంధనలు

రెండేళ్ల కిందట శిరస్త్రాణం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిబంధన తీసుకురావడంతో పోలీసు, రవాణాశాఖల ఆధ్వర్యంలో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించారు. శిరస్త్రాణం ధరించని వారి లైసెన్సులు సైతం రద్దు చేస్తామని ప్రకటించి అప్పట్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం ఈ నిబంధన సక్రమంగా అమలు కావడం లేదు.

పదేళ్ల వ్యవధిలో రాజమహేంద్రవరం నగరంలో వాహనాలు రెట్టింపయ్యాయి. అదే స్థాయిలో నగరంలోని రోడ్లు, కూడళ్ల విస్తరణ లేకపోవడంతో అధిక ప్రమాదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

రాజమహేంద్రవరం నగరంలో 20 శాతం వరకు మాత్రమే శిరస్త్రాణం ధరిస్తుండగా శివారు, గ్రామీణ ప్రాంతాల్లో ఇది కేవలం 10 శాతం లోపుగానే ఉంటోంది.

హెల్మెట్‌ ధరించని వారికి నగర ట్రాఫిక్‌ పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చేవారు. ప్రస్తుతం అది సక్రమంగా సాగడం లేదు. ప్రస్తుతం కొవిడ్‌ తగ్గిన నేపథ్యంలో మళ్లీ కౌన్సెలింగ్‌, వాహన తనిఖీలు ప్రారంభిస్తే కొంత మేర ప్రయోజనం ఉండే అవకాశం ఉంటుంది.

రాజమహేంద్రవరం నగరంలోని వీరభద్రపురం ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల యువకుడు కొంతమూరులోని స్నేహితుడి ఇంటికి వెళ్లి వస్తుండగా క్వారీమార్కెట్‌ కూడలి వద్ద లారీ ఢీకొంది. శిరస్త్రాణం ధరించకపోవడంతో తలకు బలమైన గాయమై మృత్యువాత పడ్డాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు దూరమవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

కోరుకొండ మండలంలోని బుచ్చింపేటకు చెందిన ఓ 25 ఏళ్ల యువకుడు రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తాడు. జులైలో రోజూ మాదిరి రాజమహేంద్రవరం వస్తుండగా గాడాల వద్ద పంది అడ్డురావడంతో సడన్‌ బ్రేకు వేయగా అదుపుతప్పి ప్రమాదం బారిన పడ్డారు. వెనుక వస్తున్న ఓ వాహనం అతని తలను తాకుకుంటూ వెళ్లింది. శిరస్త్రాణం ధరించడం వల్ల చేయి, కాలు, తదితర అవయవాలకు స్వల్ప గాయాలై ప్రాణాలతో బయటపడ్డాడు.

ఇలా అయితే కష్టమే...

రోడ్డు ప్రమాదాల్లో కిందపడినప్పుడు తలకు గాయాలై ముక్కు, చెవి నుంచి రక్త స్రావమైతే ప్రమాదంలో ఉన్నట్లే. శిరస్త్రాణం ఉంటే తలలోని పుర్రెకు గాయం కాకుండా ఉండొచ్ఛు హెల్మెట్‌ పెట్టుకోవడం వల్ల బ్రెయిన్‌, స్కల్‌ గాయాల నుంచి బయటపడొచ్ఛు -డాక్టర్‌ చంద్రశేఖర్‌, రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి

ప్రత్యేక కార్యాచరణతో మార్ఫు..

ఇకపై శిరస్త్రాణం ధరించని వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. హెల్మెట్‌పై ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టేందుకు కార్యాచరణ చేశాం. -ఐశ్వర్య రస్తోగి, రాజమహేంద్రవరం అర్బన్‌ ఎస్పీ

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top