Friday, 02 Oct, 4.07 am ఈనాడు

జాతీయ- అంతర్జాతీయ వార్తలు
శుద్ధ ఇంధన రంగంలో భారత్‌కు అమెరికా సహకారం అందించాలి

సెనేట్‌లో బిల్లును ప్రవేశపెట్టిన సభ్యుడు

వాషింగ్టన్‌: శుద్ధ ఇంధన రంగంలో అభివృద్ధి కోసం భారత్‌తో సమన్వయంగా ముందుకు నడవాలని అమెరికాకు చెందిన ఓ చట్ట సభ్యుడు సెనేట్‌లో బిల్లును ప్రతిపాదించారు. డెమొక్రటిక్‌ సెనేటర్‌, విదేశీ సంబంధాల కమిటీ సభ్యుడు అయిన రాబర్ట్‌ మెనెండెజ్‌ 'శుద్ధ ఇంధనం, పర్యావరణ రంగాల్లో భారత్‌తో సహకార చట్టం' పేరుతో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఇరు దేశాలు శుద్ధ ఇంధన రంగంలో పరస్పర సహకారం అందించుకోవడానికి వీలుగా 'శుద్ధ ఇంధన సాంకేతికత, విద్యుచ్ఛక్తి సరఫరా భాగస్వామ్యం(సీఈపీటీపీ)' ఫోరంను ఏర్పాటు చేయాలని అందులో ప్రతిపాదించారు. శుద్ధ ఇంధన రంగంలో ఇరు దేశాలు సమష్టిగా పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని, ఈ రంగంలో భారత్‌లో అమెరికా ప్రైవేటు సంస్థల పెట్టుబడులను ప్రోత్సహించడంతో పాటు కొత్త, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తుల సామర్థ్యాన్ని పెంచడానికి జరిగే కార్యక్రమాలకు చేయూతనందించాలని బిల్లులో సూచించారు. పర్యావరణ సమస్యల నిర్మూలనపైనా భారత్‌తో సమన్వయంగా కృషి చేయాలని పేర్కొన్నారు. భారత్‌ నేతృత్వం వహిస్తున్న అంతర్జాతీయ సౌర విద్యుదుత్పత్తి కూటమికి గణనీయమైన స్థాయిలో విదేశీ సహకారం లభిస్తోందని, అమెరికా కూడా ఈ క్రతువులో పాలుపంచుకోవాలని బిల్లులో కోరారు. ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తిలో సహకారం అందించాలని సూచించారు. అందరికీ విద్యుత్తు(పవర్‌ ఫర్‌ ఆల్‌) అనే లక్ష్యంతో ముందుకెళ్తున్న భారత్‌కు సాంతికేతతో పాటు ఇతరత్రా సహకారాన్ని అందించాలని పేర్కొన్నారు. తద్వారా భారత్‌, అమెరికా సంబంధాలు మరింత బలపడతాయని అభిప్రాయపడ్డారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top