Saturday, 25 Sep, 7.20 am ఈనాడు

తూర్పు గోదావరి
సీఎంఆర్‌ఎఫ్‌లో అక్రమాలపై అనిశా విచారణ దొడ్డిగుంటలో వివరాలు నమోదు చేస్తున్న అధికారులు

రంగంపేట, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి సహాయ నిధి పంపిణీలో జరిగిన అక్రమాలపై అనిశా విచారణ ముమ్మరం చేసింది. ఈ కేసులో నిందితుడు కొండేపూడి జగదీష్‌ ధనరాజు(నాని)కి సంబంధించి రంగంపేట మండలం దొడ్డిగుంట, కాకినాడలో ఇళ్లను... కాకినాడ, రాజమహేంద్రవరానికి చెందిన అనిశా అధికారుల బృందం శుక్రవారం తనిఖీ చేసింది. దొడ్డిగుంట ఇంట్లో గ్రామస్థులకు సంబంధించిన రేషనుకార్డులు, ఇంటి స్థలాల దరఖాస్తులు, ఆధార్‌ కార్డులు లభ్యమయ్యాయి. వాటిని అనిశా సీఐ వి.పుల్లారావు, ఎస్సై విల్సన్‌ స్వాధీనం చేసుకొని విజయవాడలోని కార్యాలయానికి పంపారు. నాని కుటుంబ సభ్యులు, సన్నిహితులతోనూ అనిశా అధికారులు మాట్లాడి వివరాలు రాబట్టారు.

కాకినాడలో నాని ఇంట్లోనూ స్థానిక అనిశా సీఐ పి.వి.జి.తిలక్‌ తనిఖీలు చేశారు. విజయవాడకు చెందిన అనిశా అధికారుల ఆదేశాల మేరకు జిల్లా అనిశా డీఎస్పీ రామచంద్రరావు ఈ విచారణ నిర్వహిస్తున్నారు. గతంలో రంగంపేట మండలానికి సంబంధించి సీఎంఆర్‌ఎఫ్‌ పథకం లబ్ధిదారులతో చర్చించి పలు వివరాలు సేకరించామని అధికారులు 'న్యూస్‌టుడే'కు తెలిపారు. ఈ కేసులో నానితోపాటు సంబంధం ఉందని అనుమానిస్తున్న కొందరు పరారీలో ఉన్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ కేసు విచారణ నేపథ్యంలో కొందరు అధికారుల్లోనూ ఆందోళన మొదలైంది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top