Friday, 24 Sep, 4.41 am ఈనాడు

Breaking Anantapur
సీమ ప్రాజెక్టులకు కృష్ణా నికరజలాలు కేటాయించాలి

చర్చావేదికలో పాల్గొన్న వివిధ సంఘాల ప్రతినిధులు

హిందూపురంఅర్బన్‌, న్యూస్‌టుడే: రాయలసీమ ప్రాజెక్టులకు కృష్ణానది నుంచి నికర జలాలు కేటాయించి, పట్టిసీమతో ఆదా అయిన 45 టీఎంసీల నీటిని హంద్రీ-నీవా ప్రాజెక్టుకు కేటాయించాలని వివిధ సంఘాల ప్రతినిధులు డిమాండు చేశారు. గురువారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో జలసాధన సమితి ఆధ్వర్యంలో 'హంద్రీనీవా ప్రాజెక్టు - జిల్లా భవిష్యత్తు' అంశంపై చర్చావేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, నీటిపారుదల రంగ నిపుణులు ఎస్‌ఎం బాషా, జిల్లా జల సాధన సమితి అధ్యక్షులు రామ్‌కుమార్‌, తెదేపా నాయకులు అంబికా లక్ష్మీనారాయణ, ఓపీడీఆర్‌ రాష్ట్రాధ్యక్షులు శ్రీనివాసులు, స్థానిక జలసాధన సమితి అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి, సంఘం ప్రతినిధులు రామచంద్రారెడ్డి, గంగిరెడ్డి, శివశంకర్‌, ఇంత్యాజ్‌, జమీల్‌, రవికుమార్‌, దాదాపీర్‌, ఉమర్‌ఫరూక్‌, సోమశేఖర్‌రెడ్డి, నవీన్‌, జయరామిరెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు. విభజన చట్టంలో పేర్కొన్న రాయలసీమ ప్రాజెక్టులను గుర్తింపు లేని ప్రాజెక్టులుగా చూపించారని, కేంద్ర ప్రభుత్వం హంద్రీనీవా, గాలేరు-నగరి, వెలిగొండ, తెలుగుగంగ ప్రాజెక్టులను గుర్తింపు పొందిన ప్రాజెక్టులుగా మార్చాలని డిమాండు చేశారు. గత ప్రభుత్వ పాలనలో పట్టిసీమ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి ఆ నీటిని హంద్రీనీవా ప్రాజెక్టుకు తరలించారన్నారు.

చిలమత్తూరు, గోరంట్ల మండలాలకు హంద్రీనీవా ప్రాజెక్టును విస్తరించటానికి రూ.400 కోట్లు డీపీఆర్‌ తయారైందని, పందిపర్తి వద్ద రిజర్వాయర్‌ ఏర్పాటుకు సర్వే పూర్తి చేశారన్నారు. ఈ రెండు పథకాలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చొరవ తీసుకొని పూర్తి చేయాలన్నారు. పార్టీలకు అతీతంగా అన్నిపార్టీల వారు ఏకమై జిల్లాను కరవు బారి నుంచి రక్షించుకోవాలని చర్చావేదికలో వక్తలు పిలుపునిచ్చారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top