Wednesday, 07 Mar, 5.26 am ఈనాడు

కృష్ణ
తాకే తెర... తస్మాత్‌..!


న్యూస్‌టుడే, పటమట (విజయవాడ)
మనిషి జీవితంలో సెల్‌ఫోన్‌ ఒక భాగంగా మారింది. అది అనేక వ్యాధుల వ్యాప్తికి నిలయంగా మారిందని పరిశోధనల్లో వెల్లడవుతోంది. అరచేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటే 25 వేల క్రిములు గుప్పెట్లో ఉన్నట్లేనని పరిశోధకులు చెబుతున్నారు.
విజయవాడ, గుంటూరులో లక్షల మంది స్మార్ట్‌ ఫోన్లు వినియోగిస్తున్నారు. మరుగుదొడ్డిలో ఫ్లష్‌ బటన్‌, కమోడ్‌పై మూతను పట్టుకోవడానికి ఒక్కోసారిసందేహిస్తుంటాం. వాటిపై చాలా బ్యాక్టీరియా ఉంటుందని ఆలోచిస్తాం. వాటిపై కన్నా ఎక్కువ బ్యాక్టీరియా స్మార్ట్‌ఫో్లపై ఉందని పరిశోధకులు తేల్చారు. ఈ-కోలి, క్లెబ్‌సిల్లాన్యుమోనియా, స్ట్రెప్టోకోకస్‌, ఎంఆర్‌ఎస్‌ఏ, స్టెఫైలోకాకస్‌ ఆరియస్‌, హిమోఫిలెస్‌ ఇన్‌ఫ్లూయెంజీ వంటి అనేక రకాల బ్యాక్టీరియాను గుర్తించారు. ఇండియన్‌ కౌన్సెల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) అధ్యయనం ఈ వివరాలను వెల్లడించింది.

చేతి స్పర్శతోనే.. ఒక అధ్యయనం ప్రకారం సెల్‌ఫోన్‌ను రోజులో 50 నుంచి 100 సార్లు చేతితో పట్టుకుంటాం. తాకే తెరపై చేతి స్పర్శతో సందేశాలు పంపించడం, వచ్చిన వాటిని చూడటం, ఫోన్‌ మాట్లాడతాం. ఇలా వివిధ రకాలుగా చేతి స్పర్శ సెల్‌ఫోన్‌పై ఎక్కువ సార్లు ఉంటుంది. కొందరు శౌచాలయానికి వెళ్లినా చేతులు శుభ్రం చేసుకోరు. అలాంటి వారి వేళ్ల నుంచి సెల్‌ఫోన్‌ పైకి సూక్ష్మజీవులు చేరేందుకు ఎక్కువ అవకాశం ఉంది. సెల్‌ఫోన్‌ను చెవికి, ముఖానికి, నోటికి దగ్గరగా పెట్టుకుని మాట్లాడుతుంటాం. దీని వల్ల చర్మంపై బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంది. సెల్‌ఫోన్‌ ద్వారా వైరస్‌లు వ్యాపిస్తాయని వైద్యులు చెబుతున్నారు.
ఎప్పుడైనా శుభ్రం చేశారా? బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్లు, చేతులు శుభ్రం చేసుకుంటాం. మరి సెల్‌ఫోన్‌ను శుభ్రం చేయాలనే ఆలోచన వచ్చిందా? శుభ్రం చేయడమంటే నీటితో కడగడం కాదు.. మెత్తటి క్లాత్‌తో ఎప్పుడైనా శుభ్రంగా తుడిచారా. చరవాణికి కవర్‌ తొడిగి ఉంటే దాన్ని కూడా శుభ్రం చేయాలి. ఎందుకంటే చరవాణి తెరపై కన్నా ఎక్కువ క్రిములు కవర్‌లో ఉంటాయి.
చేతి వేళ్లపై ప్రభావం.. స్మార్ట్‌ ఫోన్లు, టచ్‌ స్క్రీన్‌ ఫోన్లు వినియోగించేవారిలో ఎక్కువగా చేతి వేళ్ల నొప్పులు, ఎముకలపై ప్రభావం వంటి సమస్యలు కూడా వస్తున్నట్లు అధ్యయనంలో గుర్తించారు. ఆటలు ఆడుతూ, సందేశాలు పంపుతూ ఎక్కువ సమయం స్మార్ట్‌ ఫోన్లతో గడపడం, చూపుడు వేలును ఎక్కువగా వినియోగించడం, మణికట్టును వంచి ఉండడం వల్ల ఎముకలు నొప్పి చేస్తాయి. చేతి వేలును ఎక్కువ సేపు తెరపై కదిలించడం వల్ల చూపుడు వేలు తిమ్మిరి ఎక్కడం, సున్నితమైన చర్మ కణజాలాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. స్పర్శ లేకపోవడం, మంట, తిమ్మిరి వంటి లక్షణాలు పెరుగుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. చేతి వేళ్లను తెరపై ఎక్కువ సేపు కదిలించడం వల్ల చర్మం గరుకుగా మారుతుందన్నారు. మితిమీరిన వినియోగంతో చిన్న పిల్లలు సైతం పెన్నును కూడా పట్టుకోలేకపోతున్నారని బ్రిటన్‌ వైద్యులు ఇటీవల తేల్చారు.

ఎలా శుభ్రం చేసుకోవాలంటే..
* ఒక మైక్రో ఫైబర్‌ క్లాత్‌ను సెల్‌ఫోన్‌ తెరపై అద్దుతూ అన్ని వైపులా తుడవాలి.
* 60 శాతం నీరు, 40 శాతం రబ్బింగ్‌ ఆల్కహాల్‌ను కలిపి, ఒక గుడ్డ ముక్కను ఆ మిశ్రమంలో ముంచి, దానితో అన్ని వైపులా తుడుస్తూ శుభ్రం చేయాలి.
* ఆల్కహాల్‌ స్వాబ్‌లు మార్కెట్‌లో లభ్యం అవుతాయి. కవర్‌లో నుంచి చరవాణిని బయటకు తీసి, ఆల్కహాల్‌ స్వాబ్‌ను చరవాణికి అన్ని వైపులా రుద్దుతూ శుభ్రం చేయాలి. అనంతరం శుభ్రమైన మెత్తని గుడ్డతో తుడవాలి. ఇలా చేయడం వల్ల 98 శాతం బ్యాక్టీరియా పోతుందని పరిశోధకులు చెబుతున్నారు.
* హ్యాండ్‌ శానిటైజర్‌ లిక్విడ్‌ను కొద్దిగా టిష్యూ పేపర్‌పై వేసి, ఆ కాగితాన్ని చరవాణిపై రుద్దాలి. అనంతరం మైక్రోఫైబర్‌ క్లాత్‌తో అన్ని వైపులా రుద్దుతో శుభ్రం చేయాలి.
* మెత్తటి చేతి రుమాలు ఉంటే తొలుత దానితో ఫోన్‌ను శుభ్రం చేసి, ఆ తరువాత హ్యాండ్‌ శానిటైజర్‌ కొద్దిగా చేతి రుమాలుకు రాసి, చరవాణిపై రుద్దుతూ శుభ్రం చేయాలి.
* చేతి రుమాలులో రెండు చుక్కల నీరు, డెటాల్‌ చుక్కలు వేసి, ఆ రుమాలుతో కూడా శుభ్రం చేయవచ్చు.
* సెల్‌ఫోన్‌ను శుభ్రం చేసేటప్పుడు తొలుత స్విచ్ఛాఫ్‌ చేయాలి. దానికి కవర్‌ ఉంటే, బయటకు తీసేయాలి. చరవాణి, కవర్‌ రెండీటిని శుభ్రం చేయాలి.
* చరవాణి తెరపై ట్యాంపర్డ్‌, గొరిల్లా గ్లాస్‌, స్క్రీన్‌ గార్డు ఉంటే హ్యాండ్‌శానిటైజర్‌, ఆల్కహాల్‌తో శుభ్రం చేయవచ్చు. ఏమైనా దెబ్బతింటుందోమోనని సందేహం ఉంటే మొబైల్‌ కంపెనీ సూచనలు చూసి, దాని ప్రకారం చేయడం మంచిది.
* రోజుకు ఒకసారి లేదా వారంలో మూడు సార్లు చరవాణిని శుభ్రం చేసుకుంటే క్రిములు ఉండవు, ఇన్‌ఫెక్షన్లు వ్యాపించడానికి అవకాశం ఉండదని వైద్యులు సూచిస్తున్నారు.

జాగ్రత్తలు పాటించాలి: డాక్టర్‌ కొల్లి శ్రీకరుణామూర్తి, రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ ప్రజారోగ్య సంఘం
చేతులు శుభ్రంగా లేకపోతే వాటికి ఉన్న బ్యాక్టీరియా సెల్‌ఫోన్‌ను పట్టుకున్నప్పుడు దానిపై చేరుతుంది. మన నోటిలో చాలా రకాల బ్యాక్టీరియా ఉంటుంది. అది మనకు ఏమీ చేయకపోవచ్చు. కొందరికి మాట్లాడేటప్పుడు తుంపర్లు పడుతుంటాయి. గొంతు నొప్పి, జలుబు, దగ్గు ఉన్నవాళ్లు మొబైల్‌ వాడేటప్పుడు బ్యాక్టీరియా దానిపై చేరుతుంది, ఆ ఫోన్‌ వేరేవాళ్లు వినియోగిస్తే వారికి వ్యాప్తి చెందుతుంది. ఫోన్‌ను ఎక్కువగా చెవి దగ్గర పెట్టుకుంటుంటాం. చెవికి ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ కూడా వచ్చే అవకాశం ఉంది. ఫోన్‌ వినియోగించిన తరువాత చేతులు శుభ్రంగా కడుక్కోకుండా ఆహారపదార్థాలు తీసుకుంటే, కొన్ని రకాల బ్యాక్టీరియా మన శరీరంలోకి వెళ్లి ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. చిన్న పిల్లలు ఏడుస్తున్నారని వారి చేతికి ఫోన్లు ఇచ్చేస్తుంటారు. అలా ఇవ్వడం మంచిది కాదు. ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top