Friday, 09 Jun, 5.24 am ఈనాడు

పశ్చిమ గోదావరి
తమ్మిలేరు... సమస్యల 'ఏరు'


ఆయకట్టు రైతుల పరిస్థితి అగమ్యగోచరం
తెలంగాణాలో అడ్డుకట్టలు
చింతలపూడి గ్రామీణ, న్యూస్‌టుడే
తమ్మిలేరుకు జలగండం పొంచి ఉంది. తెలంగాణా రాష్ట్రంలో తమ్మిలేరుకు ఆనకట్టలు నిర్మిస్తుండడంతో ఈ ఏడాది జలాశయం నిండే పరిస్థితులు కనిపించడం లేదు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోని 30 వేల ఎకరాలకు సాగునీరందించే తమ్మిలేరు జలాశయం ఈ ప్రాంత రైతులకు వరప్రదాయనిగా మారింది. రాష్ట్ర విభజనకు ముందు ఖరీఫ్‌, రబీలలో రైతులకు జీవధారలా ఉన్న ఈ జలాశయం పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

తమ్మిలేరు జలాశయానికి వరద నీరందించే ఖమ్మం జిల్లాలోని బేతుపల్లి చెరువుపై తాగునీటి ప్రాజెక్టులకు అక్కడి ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఆనకట్టలు కట్టేస్తుండడంతో వరద నీరు కిందికి రావడం అసాధ్యంలా కనిపిస్తుంది. గత ఏడాది కూడా బేతుపల్లి చెరువు ఎగువ ప్రాంతంలోని అటవీ ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసినా వరద నీరు ఈ ప్రాజెక్టులోకి చేరలేదు. దీంతో రాబోయే రోజుల్లో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

పొంచి ఉన్న ప్రమాదం.. బేతుపల్లి చెరువు పరిధిలో ఆయకట్టుకు నీరందిస్తూ తాగునీటి పథకాలను సమృద్ధిగా నడపాలంటే అలుగు ఎత్తు పెంచాలన్న ప్రతిపాదన ఉంది. దీని వలన చెరువు వెనుక ఉన్న నాచారం, రామవరం గ్రామాలకు ముంపు సమస్య ఉత్పన్నం అవుతుంది. 12ఏళ్ల కిందట అలుగుపై తాత్కాలికంగా ఇసుక బస్తాలు వేసి నీటి మట్టం పెంచినపుడు రెండు ప్రాంతాల మధ్య వివాదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. తెలంగాణాలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయలో బేతుపల్లి చెరువు పూడిక తీత పనులను చేర్చాలనే ఆలోచనలో అక్కడి ప్రభుత్వం ఉంది. 100 ఎకరాల విస్తీర్ణంలో 4 అడుగుల మేర పూడికతీత పనులను చేపడితే బేతుపల్లి చెరువులో సాగు, తాగు నీటి అవసరాలకు ఏ ఇబ్బందులు ఉండవనేది వారి ఉద్దేశం. ఈ పనులు కూడా ప్రారంభం అయితే తమ్మిలేరుకు నీరు లేక బోసిబోయే పరిస్థితి ఉంది.

ఎత్తిపోతలే శరణ్యం
తమ్మిలేరు జలాశయానికి సాగర్‌ జలాలను మళ్లించే పథకానికి గతంలో శంకుస్థాపన చేస్తే వేంపాడు మేజరు ఆయకట్టు రైతులు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. ఫలితంగా తమ్మిలేరు జలాశయానికి ఖమ్మం జిలా బేతుపల్లి చెరువు నుంచి వరద నీరు ప్రధాన వనరుగా మారింది. ఇప్పుడు ఈ చెరువు పరిధిలో తాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తుండడంతో అక్కడి నీరు సాగునీటి అవసరాలకు సరిపడని స్థితి తలెత్తింది. తమ్మిలేరు జలాశయానికి పుష్కలంగా నీరందించాలంటే ప్రత్యామ్నాయంగా సాగునీటి వనరులు కల్పించే పథకాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. చింతలపూడి ఎత్తిపోతల పథకం, ఎర్రకాలువ జలాశయం ద్వారా తమ్మిలేరుకు నీరందించే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు ద్వారా తమ్మిలేరును బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌గా మార్చవచ్చనే అంచనాలు ఉన్నాయి. రెండు వేల ఎకరాల్లో విస్తరించి మూడు వేల ఘనపుటడుగుల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న జలాశయాన్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఉభయ జిల్లాల్లో భూగర్భ జలాల మట్టాలపై ప్రభావం చూపుతుంది. ఇప్పటికే చింతలపూడి తాగునీటి పథకానికి తమ్మిలేరు ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. కృష్ణా జిల్లాలో సైతం ఫ్లోరైడ్‌ రహిత నీటి పథకాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఉభయ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు తమ్మిలేరు భవిష్యత్తుపై చర్చించుకుని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వంతో చర్యలు జరపకపోతే తమ్మిలేరు మీద ఆధారపడ్డ రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారే పరిస్థితి తలెత్తుతుంది.

తమ్మిలేరు స్వరూపం...
చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం సమీపంలో తమ్మిలేరు జలాశయం
జలాశయం నీటి నిల్వ సామర్థ్యాన్ని 3 టీఎంసీలు
ఆయకట్టు 30 వేల ఎకరాలు.
రిజర్వాయర్‌ కుడికాలువ పొడవు: 6.5 కి.మీ.,
ఎడమ కాలువ 10.18 కి.మీ.,
మంకొల్లు కాలువ 3.38 కి.మీ.
ఈ మూడు కాలువలు దాదాపు ధ్వంసమయ్యాయి.

అత్యవసర మరమ్మతులు అవసరం...
జలాశయం కాలువల రివిట్‌మెంట్‌లు పూర్తిగా దెబ్బతిన్నాయి. గట్లు బలహీనంగా తయారయ్యాయి. జలాశయం మెట్లు పూర్తిగా శిథిలమయ్యాయి. షట్టర్లు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మధ్య తరహా ప్రాజెక్టుగా రాష్ట్ర స్థాయిలో పేరొందిన తమ్మిలేరు జలాశయం అభివృద్ధికి రూ.23కోట్ల నిధులు అవసరం అవుతాయని 2006లో అంచానా వేసి నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. నిధులందించేందుకు జపాన్‌లోని ఇంటర్నేషనల్‌ కో-ఆపరేటివ్‌ ఎయిడ్‌(జేఐసీఏ) సంస్థ ముందుకొచ్చింది. పనులు చేసేందుకు అనుమతులు వచ్చేసరికి నిధుల విడుదలకు నిర్దేశించిన గడువు ముగిసిపోవడంతో మరమ్మతులు నిలిచిపోయాయి. తిరిగి ఈ నిధులను మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రం ప్రభుత్వం కోరింది. అంతర్‌ రాష్ట్ర కోటాలో తమ్మిలేరుకు రూ.24 కోట్లు నిధులు మంజూరు కావడంతో త్వరలోనే పనులు చేపట్టేందుకు అధికారులు సన్నద్ధమౌతున్నారు. లాకుల మరమ్మతులు, ఆనకట్టల అభివృద్ధి నుంచి కాలువలు దిగువ ఆయకట్టు గ్రామాల్లో చెరువులలో పనులు సైతం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

త్వరలోనే పనులు ప్రారంభం...
జపాన్‌ వారి ఆర్థిక సహాయంతో తమ్మిలేరును పూర్తిస్థాయి అభివృధ్ధి చేసేందుకు సిద్ధమౌతున్నాం. కాలువ గట్టు, షట్టర్లు, రెయిలింగ్‌ల నిర్మాణాలను చేపడతాం. తమ్మిలేరు ఆయకట్టు రైతులకు రబీ, ఖరీఫ్‌లలో నీటి కొరత లేకుండా చేస్తాం.

- అప్పారావు, తమ్మిలేరు జలాశయం డీఈ

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top