Thursday, 05 Aug, 6.16 am ఈనాడు

చిత్తూరు
..తర్వాత ఎవరో?

రుయాలో ఉద్యోగుల తొలగింపుపై గందరగోళం


ఆందోళన చేస్తున్న ఉద్యోగ, వైద్య సిబ్బంది (పాత చిత్రం)

పద్దెనిమిదేళ్లు పనిచేసిన 19 మంది పొరుగు సేవల ఉద్యోగుల తొలగింపు మొన్న.. 14 మంది ఆరోగ్యశ్రీ డేటా ఆపరేటర్ల తొలగింపు నిన్న.. ఆపై ఒత్తిళ్లతో కొనసాగింపు.. 46 మంది పారా మెడికల్‌ సిబ్బందిని తొలగించడంతో ఆందోళన.. నేడు 68 మంది నర్సులు మాతృశాఖలకు బదిలీ.. రేపు ఎవరిని తీసేస్తారోననే అనుమానం అక్కడి ఉద్యోగుల్లో నెలకొంది. ప్రశాంత వాతావరణంలో రోగులకు సేవలందించాల్సిన వైద్య బృందం గందరగోళానికి లోనవుతోంది. దానికితోడు భద్రతా.. పారిశుద్ధ్య సిబ్బంది జీతాల కోసం చేపట్టిన ఆందోళన వైద్య ప్రాంగణంలో ప్రశాంతత కరవైంది.

- న్యూస్‌టుడే, తిరుపతి(వైద్యం)

తిరుపతి రుయా ఆస్పత్రి పడకల సామర్థ్యం 1050 ఉన్నా.. ప్రభుత్వం దృష్టిలో 750 పడకల ఆస్పత్రిగానే ఉంది. ఆ మేరకు వైద్యులు, వైద్య సిబ్బందిని నియమించారు. కొవిడ్‌ కారణంగా పెరిగే రోగుల సేవల నిమిత్తం.. కొవిడ్‌ బారినపడే వైద్య సిబ్బందికి ప్రత్యామ్నాయంగా అదనపు సిబ్బంది అవసరమని భావించి ఆరు నెలలు, ఏడాది ఒప్పందం ప్రకారం కొవిడ్‌ సిబ్బందిని నియమించారు. కరోనా అనంతరం తమను కొనసాగిస్తారని ఎక్కడెక్కడో పనిచేసే పారా మెడికల్‌ సిబ్బంది ప్రభుత్వ ఆస్పత్రి గొడుగు కిందకు చేరారు. వారి సమయకాలం పూర్తికాగానే తొలగించడంతో ఆందోళనకు దిగారు. ఆ తర్వాత కొన్ని ఏజెన్సీల ద్వారా కొన్నేళ్లుగా పనిచేస్తున్న వారిని తొలగించడంతో నిరసన బాట పట్టారు. ఇంకా ఉన్న కొన్ని ఏజెన్సీలను కొనసాగిస్తారా.. లేదా బయటకు పంపేస్తారానే అనుమానం సిబ్బందిలో నెలకొంది.

ఆప్కాస్‌లో చేర్చుకోలేదు

ముఖ్యమంత్రి జగన్‌ 2018 నాటికి ముందున్న పొరుగు, ఒప్పంద ఉద్యోగులందరినీ ఆప్కాస్‌ సంస్థ పరిధిలోకి తీసుకొచ్చి ప్రతినెల జీతాలు, సదుపాయాలు కల్పిస్తామని ప్రకటించారు. ఆ సమయానికి రుయాలో దాదాపు వంద మంది వరకు సిబ్బంది ఉన్నా అతి తక్కువ మందినే ఆప్కాస్‌ పరిధిలోకి చేర్చారు.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు

కలెక్టరు, డీఎంఈ ఆదేశాల మేరకు విధులు నిర్వహిస్తున్నా. ఏజెన్సీ గడువు తీరిపోగానే సంబంధిత నిర్వాహకులకు సమాచారం ఇస్తున్నా. ఏజెన్సీ గడువు పొడిగించుకోవడమా.. లేక రద్దు చేసుకోవడమో చేయాలని గుర్తు చేస్తున్నా. అనుమతులు లేకుండా విధులు చేయించుకుని జీతాలు ఇవ్వలేం కదా. అప్పుడు పనిచేయించుకుని జీతాలు ఇవ్వలేదని ఆందోళన చేస్తారు. ఆప్కాస్‌ సంస్థ నిబంధనల మేరకు అర్హత, పోస్టులు ఉన్నవారిని చేర్చాం. - డాక్టర్‌ భారతి, రుయా సూపరింటెండెంట్‌

రుయాలో రోగులు, పడకల వివరాలు

ఓపీ 1400 - 1800

ఇన్‌ పేషంట్లు 750- 1000

పడకలు 1350

ఓపీలు (అత్యవసర విభాగం) 200- 250

ఇన్‌ పేషంట్లు(అ.విభాగం) 150- 200

యాత్రికులు (అ.విభాగం) 30 - 50

వైద్యులు 349

విభాగాలు 22

రెగ్యులర్‌, కాంట్రాక్టు నర్సులు 411

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top