Wednesday, 22 May, 7.15 am ఈనాడు

తాజా వార్తలు
తెలుగువారికి ఏసీ పర్యాటక రైలు

జనవరి నుంచి యాత్రలు షురూ
వివిధ యాత్రలతో సిద్ధమౌతున్న ఐఆర్‌సీటీసీ

హైదరాబాద్‌: నగరం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లలోనే టిక్కెట్లు బుక్‌ చేయడం.. అందరి ప్రయాణికులతో పాటే పర్యాటకులను ప్రత్యేకంగా తీసుకెళ్లడం.. ఆయా స్టేషన్లలో దిగిన తర్వాత పర్యాటకులందరినీ ఒక దగ్గర చేర్చి.. తర్వాత యాత్రలు ప్రారంభించడం ఐఆర్‌సీటీసీ (ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌) ఇప్పటి వరకూ చేస్తోంది. ఇంకా మించిపోతే.. ప్రత్యేకంగా ఒక బోగీని ముందుగానే ఐఆర్‌సీటీసీ బుక్‌ చేసుకోవడం.. ఇలా తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశంలోని వివిధ ప్రాంతాలకు పర్యాటకులను తీసుకెళ్తోంది. ఇలా అయితే ఆయా మార్గాల్లోని పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలకే పరిమితమౌతున్నట్టు ఐఆర్‌సీటీసీ భావించింది. జంట నగరాల నుంచి వివిధ ప్రాంతాల సందర్శనకు వెళ్లే పర్యాటకులు ఏటా పెరుగుతుండడంతో.. ప్రత్యేక రైలుంటే బాగుంటుందని భావించింది. ఈ మేరకు ప్రత్యేక యాత్రా రైలును సాధించుకుంది. 'భారత్‌ దర్శన్‌' రైలు మాదిరే.. ఈ రైలు పూర్తిగా పర్యాటక యాత్రలకే పరిమితమౌతుంది.

అన్నీ ఏసీ కోచ్‌లే..
అన్నీ ఏసీ కోచ్‌లతో ప్రత్యేక యాత్రా రైలు సిద్ధమౌతోంది. 11 కోచ్‌లతో ఉండే ఈ ఏసీ రైలులో ఒక వంటశాల(ప్యాంట్రీకార్‌) కాగా మరొకటి గార్డు రూం, ఇంజిన్‌.. ఇలా మొత్తం 8 ఏసీ బోగీలుంటాయి. ఇందులో మొదటి, రెండవ తరగతి ఏసీలతో పాటు.. 3టైర్‌ ఏసీ బోగీలు మాత్రమే ఉంటాయి. యావత్‌ భారతదేశంలోని పర్యాటక, ఆధ్యాత్మిక యాత్రలకు ఉద్దేశించిన 'భారత్‌ దర్శన్‌' ప్రత్యేక రైలులో 12 స్లీపర్‌కోచ్‌లు, 3 ఏసీ త్రీటైర్‌ కోచ్‌లుండేవి. ఏసీ ప్రయాణాలు పెరుగుతుండడంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సమకూరుతున్న ఈ ప్రత్యేక రైలు మొత్తం ఏసీది కావడం విశేషం.

జనవరి నుంచి యాత్రలు..
తెలుగు రాష్ట్రాలతో పాటు.. యావత్‌ భారత దేశ యాత్రలూ ఈ ప్రత్యేక రైలు ద్వారా సమకూరనున్నాయి. ఉత్తరభారత దేశ యాత్రలతో పాటు.. దక్షిణభారత యాత్రలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాలానుగుణంగా యాత్రా స్థలాలకున్న డిమాండ్‌ మేరకు ఐఆర్‌సీటీసీ ప్రణాళికలు రచిస్తోంది. విద్యార్థుల కోసం విజ్ఞాన, వికాస యాత్రలు కూడా సమకూరనున్నాయి. తెలుగురాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాల నుంచి ఈ యాత్రలు ప్రారంభమౌతాయి. ఏ యాత్ర నిర్వహించినా.. హైదరాబాద్‌ నగర పర్యాటకులకు ఈ ప్రత్యేక రైలు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఐఆర్‌సీటీసీ స్థానిక అధికారులు చెబుతున్నారు. గతంలో భారత్‌దర్శన్‌ పేరిట ఉన్న రైలు కొన్ని నెలలు మాత్రమే తమకు కేటాయించడమైందని.. ఇప్పుడు సమకూరుతున్న ఈ ప్రత్యేక ఏసీ యాత్రా రైలు మన ఆధీనంలోనే ఉంటుందని ఐఆర్‌సీటీసీ పేర్కొంది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top