Thursday, 05 Aug, 4.30 am ఈనాడు

మెదక్
తెరాస పాలనలో దళితులకు ఒరిగిందేమీ లేదు..

కొండపాక గ్రామీణం, న్యూస్‌టుడే: దళిత సమాజాన్ని నమ్మించి వంచించిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. బుధవారం సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడలోని వైష్ణవి వేడుక మందిరంలో నిర్వహించిన ఉమ్మడి మెదక్‌ జిల్లా షెడ్యూల్డు కులాల సమగ్ర అభివృద్ధి సాధన సదస్సులో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్‌తో కలిసి మాట్లాడారు. అంతకుముందు ఆయన దుద్దెడలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి ప్రదర్శనగా సమావేశానికి వచ్చారు. సమావేశంలో మందకృష్ణ మాట్లాడుతూ.. తెరాస (సీఎం కేసీఆర్‌) పాలనలో దళితులకు ఒరిగిందేమీ లేదని అన్నారు. ఏడేళ్లలో అన్ని రంగాల్లో వెనక్కి నెట్టబడ్డారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఆరంభంలో దళిత ముఖ్యమంత్రి పేరిట కేసీఆర్‌ దళితులను మోసం చేశారని అన్నారు. మూడెకరాల భూమి పంపిణీ చేస్తానని చెప్పి కేవలం 6 వేల మందికి భూమి పంచి రాష్ట్రంలో 60 వేల మంది దళితుల భూమిని లాక్కున్నారని అన్నారు. దళితబంధు పేరిట మరోసారి తమను మోసం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. మరోసారి కేసీఆర్‌ మాటలు నమ్మి మోసపోవద్దని దళిత సమాజానికి హితవు పలికారు.

దళితబంధు పథకాన్ని హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రకటన రాకముందే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతుబంధు లాగే దళితుల్లో ధనిక, బీద తేడా లేకుండా అన్ని నియోజకవర్గాల్లో అన్ని దళిత కుటుంబాలకు ఇంటికి రూ.పది లక్షల చొప్పున ఇవ్వాలని అన్నారు. దళితబంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలనే డిమాండ్‌తో ఈనెల 9న అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేపట్టాలని సూచించారు. అనంతరం 10వ తేదీ నుంచి వచ్చే నెల 17వ తేదీ వరకు అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో దీక్షలు చేపట్టాలని సూచించారు.

ఆ తర్వాత 18 నుంచి పాదయాత్ర చేపట్టి పథకం అమలుకు ఉద్యమిస్తామని అన్నారు. దళితుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలో దళితుల అభివృద్ధి సాధ్యమని, అంతా ఐక్యంగా ఉండి రాజ్యాధికారానికి కృషి చేయాలని అన్నారు. భవిష్యత్తులో మనం అధికారంలోకి రాగానే మూడెకరాల భూ పంపిణీ లేదా ప్రతి కుటుంబానికి రూ.30 లక్షలు ఇస్తామని అన్నారు. తెరాస పాలనలో తీసుకున్న దళితుల భూమిని తిరిగి వారికే ఇచ్చేలా చొరవ తీసుకుంటామని అన్నారు.

ప్రాజెక్టుల పేరిట దళితుల భూమి లాక్కున్న సీఎం కేసీఆర్‌ దళితుల పట్ల రాబందు అని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు, కాంగ్రెస్‌ నాయకులు అద్దంకి దయాకర్‌ అన్నారు. గత ప్రభుత్వాలు దళితుల అభివృద్ధికి భూమి ఇస్తే కేసీఆర్‌ బలవంతంగా లాక్కున్నారని అన్నారు. దళితబంధును రాష్ట్రంలోని దళితులందరికీ అమలు చేయకపోతే ఆయన దళితద్రోహిగా మిగిలి పోతారని అన్నారు. సీఎం కాళ్లు మొక్కిన పాలనాధికారి వెంకటరామరెడ్డి ఒక్కరోజు కూడా కొనసాగడానికి వీల్లేదని అన్నారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్‌ జిల్లా ఇన్‌ఛార్జి యాదగిరి, డీబీఎస్‌ జాతీయ కార్యదర్శి శంకర్‌, రాష్ట్ర నాయకులు శ్రీనివాస్‌, భాస్కర్‌, ఎంఈఎఫ్‌ జిల్లా అధ్యక్షులు బాకి ప్రభాకర్‌, పలువురు దళిత సంఘాల నాయకులు ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top