Saturday, 25 Sep, 4.21 am ఈనాడు

కరీంనగర్
టీకా.. వడివడిగా

జిల్లాలో వ్యాక్సినేషన్‌ ప్రత్యేక కార్యాచరణకు స్పందన

జగిత్యాల పట్టణం, న్యూస్‌టుడే

జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ఊపందుకుంది. మొన్నటి వరకు వ్యాక్సిన్ల కొరతతో జిల్లాలో మందకొడిగా సాగిన టీకాల పంపిణీని జిల్లా అధికారయంత్రాంగం వేగవంతం చేసింది. మూడోదశ ముప్పును ముందస్తుగా ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషన్‌తోనే సాధ్యమని భావించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వందశాతం వ్యాక్సినేషన్‌ కోసం ఆరోగ్యశాఖ ద్వారా ఏర్పాట్లు విస్తరింపజేశారు. వ్యాక్సిన్‌ కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. గ్రామాలు, పట్టణాల్లో వార్డులవారీగా ప్రత్యేక కేంద్రాల ద్వారా టీకాలిస్తున్నారు. ఇందుకోసం కలెక్టర్‌ రవి ఆధ్వర్యంలో వైద్యశాఖ క్షేత్రస్థాయిలో వ్యాక్సిన్‌ ఇంటింటి సర్వే నిర్వహించడంతోపాటు ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు. స్పెషల్‌డ్రైవ్‌లో 78,296 మందికి మొదటిడోసు టీకాలివ్వగా 14,696 మందికి రెండో డోసు టీకాలివ్వడం విశేషం. గత జులై వరకు ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్లకోసం బారులు తీరాల్సిన పరిస్థితి కనిపించేది. కానీ జిల్లాలో ఎక్కడికక్కడ కేంద్రాలను కేటాయించడంతో ప్రజలకు టీకా చేరువైందని చెప్పొచ్ఛు కొందరు సిబ్బంది క్షేత్రస్థాయిలోనూ కార్మికులు, వ్యవసాయ కూలీలకు ఆధార్‌ నమోదు చేసి టీకాలివ్వడంతో వ్యాక్సినేషన్‌ సులభతరంగా మారింది.

3.50 లక్షలు దాటిన మొదటిడోసు..

జిల్లాలో వ్యాక్సినేషన్‌ మొదటిడోసు 57 శాతం, రెండోడోసు 20 శాతం నమోదైంది. 3,56,802 మంది తొలిడోసు తీసుకోగా 1,25,921 మంది రెండో డోసు టీకా తీసుకున్నారు. 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల వయస్సు వారి సంఖ్య 1,18,000 దాటింది. 45 నుంచి 59 ఏళ్ల వయస్సవారి టీకాల సంఖ్య లక్షకు చేరువైంది. 5 రోజుల స్పెషల్‌డ్రైవ్‌లో టీకాల సంఖ్య 75 వేలకుపైనే ఉంది. మరో రెండు నెలల్లో వందశాతం టీకాల నమోదు పూర్తి చేయాలని వైద్యశాఖ లక్ష్యంగా చేసుకుంది. ఇందుకు అనుగుణంగా వ్యాక్సిన్‌ నిలువలు కూడా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

ఆలస్యంగా రెండోడోసు..

జిల్లాలో రెండోడోసు టీకాల నమోదు ఇంకా ఆలస్యంగానే కొనసాగుతోంది. కోవీషీల్డ్‌కు ప్రభుత్వం 84 రోజుల గడువు విధించడంతో ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. కొవాగ్జిన్‌ తక్కువ మంది తీసుకోవడంతో వారంతా రెండోడోసు టీకాలు వేసుకోగా కోవీషీల్డ్‌ తీసుకున్నవారు నిరీక్షించాల్సి వస్తోంది. మరోవైపు కొవిడ్‌ బారినపడిన వారు సైతం 3 నెలలు ఆగాల్సి రావడంతో రెండోడోసు జాప్యం జరుగుతోంది. వైద్యశాఖ నిర్ణీత కాలపరిమితిని తగ్గించే ప్రయత్నం చేస్తుందని వైద్యశాఖ వర్గాలు చెబుతున్నాయి.

ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలి

- పి.శ్రీధర్‌, జిల్లా వైద్యాధికారి

జిల్లాలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలి. ఇంటి వద్ద వైద్య సిబ్బంది సర్వే చేపట్టారు. కుటుంబ సభ్యులు వివరాలు అందజేయాల్సి ఉంటుంది. జిల్లాలో వ్యాక్సిన్‌కు ఎలాంటి కొరత లేదు. ఎంపిక చేసిన కేంద్రాల్లో ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంది. జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్‌కు అన్ని చర్యలు తీసుకుంటున్నాం.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top