Monday, 26 Jul, 6.30 am ఈనాడు

తాజా వార్తలు
తొందరపడి పాఠశాలలు తెరవొద్దు

రహస్య బ్యాలెట్‌ ద్వారా అభిప్రాయం తీసుకోండి
వేధింపులు భరించలేక త్వరలో సెలవుపై వెళ్లనున్న ముఖ్య అధికారి
సీఎంకు ఎంపీ రఘురామ లేఖ

ఈనాడు, దిల్లీ: కొవిడ్‌ మూడోదశ పొంచి ఉన్న తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లో తొందరపడి పాఠశాలలు తెరవొద్దని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తన లేఖలో సూచించారు. 300 లోపు కేసులు వస్తున్న దిల్లీలోనే ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నప్పుడు 3వేల కేసులు వచ్చే ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలు తెరవడం మంచిది కాదన్నారు. దీనిపై రహస్య బ్యాలెట్‌ పెట్టి ప్రజాభిప్రాయం కోరాలన్నారు. మీరు 30 ఏళ్లు అధికారంలో ఉండాలి అనుకునేవారు తప్పుడు సలహాలు ఇస్తున్నారని, కానీ 40 ఏళ్లు అధికారంలో ఉండాలని కోరుకుంటున్న తాను నిష్ఠురమైనా నిజాలు చెబుతున్నానని పేర్కొన్నారు. 'తల్లిదండ్రుల దినోత్సవం నాడు పెద్దలు చెప్పిన మాటలు వినండి. మీరు భారతంలో దుర్యోధనుడు కావడం నాకు ఇష్టం లేదు. ఈ అభినవ భారతంలో మీరు ముఖ్యమంత్రి కాబట్టి దుర్యోధనుడితో పోలుస్తున్నాను. ఇప్పుడు కూడా మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి లాంటి మంచి వ్యక్తుల సలహాలను మీరు పెడచెవిన పెడుతున్నారేమో అనిపిస్తోంది. పాఠశాలలు తెరవడం మానుకోండి.

ఇంతమంది అధికారులు కోర్టు మెట్లెక్కిన దాఖలా ఎక్కడా లేదు
రాష్ట్ర హైకోర్టు ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణను అరెస్టు చేసి తీసుకురమ్మని ఆదేశించింది. అంతకుముందు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజాశంకర్‌లకు కోర్టు శిక్ష విధించి రోజంతా హైకోర్టులోనే నిలబడాలని చెప్పింది. ఇలా ఇంకా ఎంతోమంది అధికారులు మానసిక క్షోభకు గురవుతున్నారు. గత 15 ఏళ్లలో ఎన్నడూ, ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎస్‌, డీజీపీలు ఎన్నోసార్లు కోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది. వైకాపా ఎంపీలు సభలో నాపై అనర్హత వేయాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ, బయట పోలవరం, ప్రత్యేక హోదా ప్లకార్డులు ప్రదర్శిస్తున్నట్లు ప్రజలు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. నిజమైన సమస్యల కోసం ఎంపీలను పోరాడాలని చెప్పండి. వేధింపులు తట్టుకోలేక ఒక ఉన్నతాధికారి త్వరలో సెలవు మీద వెళ్లిపోతున్నారు. ఆ అధికారి ఎవరో రెండుమూడు రోజుల్లో చెబుతాను.
రాష్ట్రానికి రైల్వే జోన్‌ రాకపోయినా ఆ బ్రాండ్‌ పేరుతో కొత్త మద్యం వచ్చింది. ప్రతి తాగుబోతుకు ఒక ఆలి, ఆలి మెడలో తాళి ఉన్నంతకాలం మద్యం వ్యాపారానికి ఢోకా ఉండదని ఒక సినిమాలో చెబుతారు. అలా ఆలి మెడలో తాళి ఉన్నంతవరకు మన వ్యాపారం జరుగుతుందని ఎవరు సలహా ఇచ్చారో కానీ ఆ తాళిని తాకట్టు పెట్టే వారిని మన రాష్ట్రంలో 25 ఏళ్లు తాకట్టు పెట్టేశారు' అని తన లేఖలో రఘురామ వ్యాఖ్యానించారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top