Sunday, 09 May, 5.01 pm ఈనాడు

తాజా వార్తలు
Top Ten New @ 5 PM

1. DRDO 2-DG: త్వరలో అందుబాటులోకి 2డీజీ

కరోనాపై పోరుకు కొత్త ఔషధం 2-డియాక్సీ డి-గ్లూకోజ్‌ (2డీజీ) అభివృద్ధి చేసినట్లు డీఆర్‌డీవో ఛైర్మన్‌ సతీశ్‌రెడ్డి తెలిపారు. 2డీజీ ఔషధం కొవిడ్‌పై సమర్థంగా పని చేస్తోందన్నారు. ఈ ఔషధానికి డీఆర్‌డీవో పేటెంట్‌ కూడా పొందినట్లు ఆయన వివరించారు. ఈ మందు అత్యవసర వినియోగానికి డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) అనుమతి ఇచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ఈటీవీ ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. త్వరలో ప్రజలకు అందుబాటులోకి 2డీజీ ఔషధం వస్తుందని సతీశ్‌రెడ్డి తెలిపారు.

2. Mothersday: జగన్‌, కేసీఆర్‌ విషెస్‌

అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. ''స్వచ్ఛమైన ప్రేమకు ప్రతిరూపం అమ్మ.. ఆప్యాయత, అనురాగాలకు చిరునామా అమ్మ.. మహోన్నతమైన మాతృమూర్తులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు'' అని కేసీఆర్‌ ఫేస్‌బుక్‌ ద్వారా తెలిపారు.

Mothers Day: తారలు.. తల్లిచాటు బిడ్డలు

3. Sana: పాక్‌లో హిందూ మహిళ చరిత్ర

పాకిస్థాన్‌ చరిత్రలోనే తొలిసారి ఓ హిందూ యువతి ఆ దేశ అత్యున్నత సర్వీసు అయిన పాకిస్థాన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌ (పీఏఎస్‌)కు ఎంపికైంది. సింధ్‌ ప్రావిన్స్‌లోని షికార్‌పుర్‌కు చెందిన ఎంబీబీఎస్‌ వైద్యురాలు సనా రామ్‌చంద్‌ ఈ ఘనత సాధించారు. పాక్‌ ప్రభుత్వం నిర్వహించిన సెంట్రల్‌ సుపీరియర్‌ సర్వీసెస్‌ (సీఎస్‌ఎస్‌) పరీక్షలను మొత్తం 18,533 మంది రాశారు. ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల అనంతరం 221 మందితో తుది జాబితా విడుదల చేశారు. అందులో సనా రామ్‌చంద్‌ పేరు కూడా ఉంది. ఇది మన దేశంలో ఐఏఎస్‌తో సమానం.

4. కొవిడ్‌ ఔషధాలు, ఆక్సిజన్‌పై పన్ను మినహాయించండి!

దేశంలో కరోనా సంక్షోభానికి కారణమంటూ కేంద్ర ప్రభుత్వం తీరుపై విరుచుకుపడుతున్న పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజాగా ప్రధానమంత్రికి మరో లేఖ రాశారు. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న వేళ దిగుమతి చేసుకుంటున్న ఔషధాలు, వివిధ వైద్య పరికరాలపై పన్నులను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్‌తోపాటు దేశవ్యాప్తంగా ఆరోగ్య మౌలికసదుపాయాలను బలోపేతం చేయడంతోపాటు, కొవిడ్‌ ఔషధాలు, ఆక్సిజన్‌ సరఫరాను పెంచాలని మమతా బెనర్జీ కోరారు.

5. Corona: విలయానికి కొత్త రకాలే కారణం కాదు

భారత్‌లో విస్తరిస్తున్న కరోనా రకానికి వేగంగా, ఎక్కువగా వ్యాపించే గుణం ఉందని.. వ్యాక్సిన్‌తో ఏర్పడే రోగనిరోధకతను సైతం ఇది తప్పించుకునే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌ వెల్లడించారు. గత అక్టోబర్‌లో గుర్తించిన బి.1.617 రకమే భారత్‌లో ప్రస్తుత కరోనా విలయానికి కారణమని తెలిపారు. అలాగే, భారత్‌లో కరోనా ఉద్ధృతికి వైరస్‌ కొత్త రకాలు ఒక్కటే కారణం కాదని స్వామినాథన్‌ అభిప్రాయపడ్డారు.

6. Deloitte: దూసుకెళ్తున్న రిలయన్స్‌ రిటైల్‌

ముఖేష్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ రిటైల్‌ అరుదైన ఘనత సాధించింది. 2021లో ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా ఎదుగుతున్న రిటైలర్‌ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ఈ విషయం డెలాయిట్‌ నిర్వహించిన గ్లోబల్‌ రిటైల్‌ పవర్‌ హౌసెస్‌ సర్వేలో తేలింది. ఇక ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద రిటైల్స్‌లో 53వ స్థానంలో నిలిచింది. గతంలో 56వ స్థానంలో ఉండగా ఈ సారి మూడు స్థానాలను మెరుగుపర్చుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్‌ దిగ్గజంగా అమెరికాకు చెందిన వాల్‌మార్ట్‌ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. అమెజాన్‌ రెండో స్థానంలో ఉంది.

7. Corona: కరోనాపై పోరాటానికి CSK చేయూత

దేశంలో కరోనా వైరస్‌ రెండో దశ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఇటీవల రోజుకు నాలుగు లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దాదాపు నాలుగు వేల మంది నిత్యం ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా ఆక్సిజన్‌ కొరత ఎక్కువగా ఉండటంతో ఈ మరణాలు సంభవిస్తున్నాయి. కాగా, తమిళనాడులో వైరస్‌ ఉద్ధృతి అధికంగా ఉండటంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్రాంఛైజీ (సీఎస్‌కే) అక్కడి ప్రభుత్వానికి 450 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను అందజేయడానికి ముందుకు వచ్చింది.

8. CoronaVirus: గోమూత్రంతో మాత్రలు

కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో గుజరాత్‌లోని ఓ గోశాలలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అక్కడి బాధితులకు గోమూత్రంతో తయారు చేసిన మాత్రలను అందిస్తున్నారు. కరోనా ఉద్ధృతి పెరుగుతుండటంతో గ్రామాల్లోనూ కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేసుకోవచ్చని గుజరాత్‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో బనస్కాంత జిల్లాలోని టేతోడా గ్రామంలోని ఓ గోశాలలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. దానికి 'వేదలక్షణ పంచగవ్య ఆయుర్వేద్‌ కొవిడ్‌ ఐసోలేషన్‌ సెంటర్‌'గా నామకరణం చేశారు.

9. UP Lockdown: యూపీలో లాక్‌డౌన్‌ పొడిగింపు!

కరోనా రెండో దశలో రోజువారీ కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ను ఈనెల 17వ తేదీ వరకూ పొడిగించింది. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. తాజా లాక్‌డౌన్‌తో మే 17వ తేదీ ఉదయం 7 గంటల వరకూ ఆ రాష్ట్రంలో కరోనా కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. ఈ కాలంలో అన్ని దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూసే ఉంటాయని అధికారులు చెప్పారు. కొవిడ్‌ వ్యాప్తి గొలుసును తుంచే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

10. చైనా దౌత్యవేత్తలను భయపెట్టిన 'అతడు'..!

'ఇఫ్‌ యు ఆర్ బ్యాడ్‌.. ఐ యామ్‌ యువర్‌ డాడ్‌' అన్న రేంజిలో ఫిలిప్పీన్స్‌ విదేశాంగ శాఖ మంత్రి చైనాపై విరుచుకుపడ్డారు. సాధారణంగా చైనా దౌత్యవేత్తలు ట్విటర్లో ప్రత్యర్థులపై ఇష్టానుసారమైన భాష వాడుతుంటారు. దీంతో వుల్ఫ్‌వారియర్‌ డిప్లొమాట్లుగా వారికి ప్రపంచవ్యాప్తంగా పేరొచ్చింది. కానీ, ఈ సారి సీన్‌ రివర్సైంది. ఫిలిప్పీన్స్‌ విదేశాంగ మంత్రి టియోడోరో లోక్సిన్‌ చైనాపై వాడిన భాష దెబ్బకు వారు కూడా బెంబేలెత్తిపోయారు. ఫిలిప్పీన్స్‌-చైనా మధ్య నెలకొన్న దక్షిణ చైనా సముద్ర వివాదం దీంతో మరింత ముదిరింది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top