గుంటూరు
ఉత్తమ నాటికగా గుర్తు తెలియని శవం

ముగిసిన రాష్ట్ర స్థాయి నాటికల పోటీలు
రామచంద్రపురం, న్యూస్టుడే: రామచంద్రపురం పట్టణంలోని మయూర కళాపరిషత్ ఆధ్వర్యంలో కృత్తివెంటి విద్యా సంస్థల ప్రాంగణంలో బుద్ధవరపు మహదేవుడు కళావేదికపై మూడు రోజుల పాటు నిర్వహించిన 15వ రాష్ట్ర స్థాయి నాటికల పోటీలు సోమవారం అర్ధరాత్రితో ముగిశాయి. ఈ పోటీల న్యాయనిర్ణేత, సినీగేయ రచయిత అదృష్టదీపక్ విజేతలను ప్రకటించారు. పొన్నూరు రసఝరి, నిడుబ్రోలు నట బృందం ప్రదర్శించిన 'గుర్తు తెలియని శవం' నాటిక ఉత్తమ ప్రదర్శనగా, పెదకాకాని గంగోత్రి నటీనటుల బృందం ప్రదర్శించిన 'పచ్చ చందురుడు' ఉత్తమ ద్వితీయ ప్రదర్శనగా, విజయవాడ యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్ నట బృందం ప్రదర్శించిన 'అనగనగా' నాటిక తృతీయ ఉత్తమ ప్రదర్శనగా, హైదరాబాద్ మల్లాది క్రియేషన్స్ వారి 'వెన్నెలొచ్చింది నాటిక ఉత్తమ హాస్య ప్రదర్శనగా ఎంపికైంది. ఉత్తమ నటులుగా 'గుర్తు తెలియని శవం' నాటికలో ఇందుమతి, రామశాస్త్రి, గుడివాడ లహరి, వై.ఎస్.కృష్ణేశ్వరరావు, 'అనగనగా' నాటికలో రుద్ర పాత్రధారి పి.మోహనేశ్వరరావు, 'పచ్చ చందురుడు' నాటికలో వెంకయ్య, లచ్చువమ్మ, పాత్రధారులు నాయుడు గోపి, జ్యోతిరాణి, 'తొక్కతీశారు' నాటికలో రామనాథం పాత్రధారి వరకూటి శివప్రసాద్, 'వెన్నెలొచ్చింది' నాటికలో సుబ్బరామయ్య పాత్రధారి జి.ఎస్.చలపతి, 'రాజీ' నాటికలో కోటేశ్వరరావు పాత్రధారి యు.వి.శేషయ్య ఎంపికయ్యారు. 'పచ్చ చందురుడు' నాటికలో రాఘవులు పాత్రధారి గుమ్మడి నాగేశ్వరరావు, 'అక్క అలుగుడు-చెల్లి సణుగుడు' నాటికలో తాతయ్య, సింగినాథం పాత్రధారులు కె.శివరామప్రసాద్, ఎ.హరిబాబు, 'తొక్కతీశారు' నాటికలో వృద్ధుడు పాత్రధారి టి.పి.నాసరయ్య, 'వెన్నెలొచ్చింది' నాటికలో రాముడు, రామలింగం పాత్రధారులు, తేజోమూర్తుల మురళీధర్, సీహెచ్ అర్జున్, 'రాజీ' నాటికలో కాకి పాత్రధారి మాస్టర్ వై.హేమంత్ కుమార్ ప్రోత్సాహక బహుమతులు అందుకున్నారు. ఉత్తమ దర్శకుడిగా ఆర్.వాసు (అనగనగా నాటిక), ఉత్తమ హాస్య రచయితగా వరికూటి శివప్రసాద్ (తొక్కతీశారు), ఉత్తమ రచయితగా డాక్టర్ బొక్క శ్రీనివాసరావు (పచ్చ చందురుడు), ఉత్తమ సంగీతం, ఉత్తమ ఆహార్యం, ఉత్తమ రంగోద్దీపనలకు విజయవాడ యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్ వారి 'అనగనగా' నాటికకు చెందిన ఎస్.పి.సీతారాములు, ఎం.పరమేష్, పి.మోహన్, పి.డి.ఫణీంద్ర ఎంపికయ్యారు. పరిషత్ అధ్యక్షుడు సత్తి వెంకటరెడ్డి అధ్యక్షత వహించిన బహుమతి ప్రదానోత్సవంలో పరిషత్ డైరెక్టర్లు కె.వి.వి.సత్యనారాయణ, మేడిశెట్టి శేషారావు, గౌరవ సలహాదారు కొత్త కమలాకరచౌదరి, వ్యవస్థాపక కార్యదర్శి శృంగారం వేంకట అప్పలాచార్యర్ విజేతలకు జ్ఞాపికలను, పారితోషికాలను అందజేశారు.
Dailyhunt