Saturday, 08 May, 7.07 am ఈనాడు

జాతీయ- అంతర్జాతీయ వార్తలు
వందశాతం వ్యాక్సినేషన్‌.. అందరికీ ఒకటే ధర

కేంద్రానికి మార్గదర్శకాలు ఇవ్వండి
సుప్రీంలో బెంగాల్‌ సర్కారు పిటిషన్‌

దిల్లీ: రాజకీయ పోరులో భాజపాపై పైచేయి సాధించి పశ్చిమబెంగాల్‌లో వరుసగా మూడోసారి అధికారం చేజిక్కించుకున్న మమత సర్కారు కొవిడ్‌ వ్యాక్సినేషను విధానంపై సుప్రీంకోర్టులో పిటిషను దాఖలు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా శుక్రవారం కీలకమైన తొలి అడుగు వేసింది. కేంద్రం ప్రారంభించిన మూడోదశ వ్యాక్సినేషన్‌ను తక్షణం రద్దు చేసి, దేశంలో వందశాతం టీకాల సమీకరణ ద్వారా అందరికీ వ్యాక్సిన్‌ అందేలా మార్గదర్శకాలు జారీ చేయాలని కోరింది. టీకాల ధరల్లో వ్యత్యాసాలను అరికట్టి, దేశవ్యాప్తంగా ఒక్కో డోసు రూ.150తో అందించేలా చూడాలని కూడా అభ్యర్థించింది. ఈ పిటిషన్‌ను విషయ ప్రాధాన్యం దృష్ట్యా సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. స్వదేశీ, విదేశీ టీకా ఉత్పత్తిదారుల నుంచి ఒకే టెండరు ద్వారా యుద్ధప్రాతిపదికన వ్యాక్సిన్‌ డోసుల సేకరణ జరపాలని మమత సర్కారు కోరింది. పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వానికి కేంద్రం హామీ ఇచ్చిన వ్యాక్సిన్‌ డోసులను సకాలంలో సరఫరా చేయలేకపోయిందని, టీకాల కొరతే ఈ పరిస్థితికి కారణమని పేర్కొంది. ఈ పరిస్థితుల కారణంగానే ముందే ప్రకటించిన మూడోదశ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని పలు రాష్ట్రాలు వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని కూడా తెలిపింది. ఘోర విపత్తుగా ఇది మారకముందే కేంద్ర ప్రభుత్వానికి తగు ఆదేశాలు జారీ చేయాలని, సార్వత్రిక టీకాల కార్యక్రమం ఒక్కటే ఈ దశలో శరణ్యమంటూ మమత సర్కారు పిటిషను ద్వారా కోర్టు దృష్టికి తెచ్చింది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top