Friday, 25 May, 3.26 am ఈనాడు

కర్నూలు
వేదవతి జలాశయాల సర్వేకు పచ్చజెండా


రూ.2.65 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వుల జారీ
80 వేల ఎకరాలకు సాగునీరు.. తీరనున్న తాగునీటి సమస్య
కర్నూలు జలమండలి, న్యూస్‌టుడే
సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్య జాబితాలో చేర్చుతున్న రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో అదనపు ఆయకట్టుకు నీరు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే గుండ్రేవుల, ఆర్డీఎస్‌, 68 చెరువుల ప్రాజెక్టు, వేదవతి జలాశయం, పులకుర్తి ఎత్తిపోతల పథకాలను ప్రాధాన్య ప్రాజెక్టుల్లో చేర్చడంతోపాటు.. గుండ్రేవుల, ఆర్డీఎస్‌ల పూర్తిస్థాయి నివేదికలు(డీపీఆర్‌) ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. వీటితోపాటు.. వేదవతి నదిపై(హగరి) జలాశయాలు నిర్మించి.. జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందించే బృహత్తర ప్రాజెక్టు ఎప్పటినుంచో పెండింగులో ఉంది. ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం వేదవతి నదిపై జలాశయాలు నిర్మించేందుకు అవసరమైన పరిశోధన, సర్వే పనులు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. ఈమేరకు జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ గురువారం(జీవో నెం.372) అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. సర్వే, పరిశోధనకు రూ.2.65 కోట్ల నిధులు విడుదల చేశారు.

హోళగుంద మండలం గూళ్యం సమీపంలోని వేదవతి నది(హగరి)పై గూళ్యం సమీపంలో ఒక జలాశయం, మొలగవల్లి గ్రామం వద్ద మరో జలాశయం నిర్మించి.. వేదవతి నుంచి నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా పంపింగ్‌ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే లక్ష ఎకరాలకు సాగునీరు అందడంతోపాటు తాగునీటికి కూడా ఇబ్బందులు తీరనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇపుడు సర్వే, పరిశోధనకు అనుమతి ఇస్తూ.. రూ.2.65 కోట్లు విడుదల చేయడంతో పశ్చిమప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేదవతి నది నుంచి నీటిని ఎత్తిపోసేందుకు

ఏవైనా అవరోధాలు ఎదురైతే.. ప్రత్యామ్నాయంగా హంద్రీనీవా ప్రధాన కాల్వ నుంచి ఆ రెండు జలాశయాలకు(4 టీఎంసీ సామర్థ్యంతో) నీటిని పంపింగ్‌ చేసేందుకు అవసరమైన సర్వే చేపట్టాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. హంద్రీనీవా కాల్వలో నీరు ప్రవహించే సమయంలో 120 రోజులపాటు నీటిని పంపింగ్‌ చేయనున్నారు. ఇప్పటికే పశ్చిమప్రాంతంలోని 68 చెరువులకు కృష్ణా జలాలు నింపేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీటికి నిధులు రూ.252 కోట్లు విడుదల చేయడంతో టెండర్ల ప్రక్రియ కూడా కొనసాగుతోంది.

Dailyhunt
Top