Saturday, 14 Sep, 5.30 am ఈనాడు

మెదక్
విటమిన్‌ ఏదీ?

ఏడాదిగా నిలిచిన పంపిణీ
74 వేల మంది బాలలపై ప్రభావం
న్యూస్‌టుడే, పెద్దశంకరంపేట

చి న్నారులకు తాగించే విటమిన్‌-ఏ ద్రావణం అందుబాటులో లేకుండా పోయింది. ఈ ద్రావణం చిన్నారులకు ఆరు నెలలకోసారి అందించకపోతే వారి కంటి చూపు, ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ అంశంపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రత్యేక దృష్టి సారించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐదేళ్ల లోపు చిన్నారుల తల్లిదండ్రులు ఏ విటమిన్‌ ఎప్పుడోస్తుందా అని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. మెదక్‌ జిల్లాలోని 20 మండలాల పరిధిలో జిల్లా ఆస్పత్రి ఒకటి, మూడు ప్రాంతీయ, 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. పది నెలల వయసు నుంచి ఐదేళ్ల లోపు చిన్నారులకు ప్రతి ఆరు నెలలకోసారి నిర్ణీత మోతాదులో విటమిన్‌ ఏ ద్రావణం తాగిస్తారు.

ఏడాది క్రితం ఉన్నా..
సర్కారు వైద్యశాలల్లో ద్రావణాన్ని అందుబాటులో ఉంచి ఐదేళ్లలోపు చిన్నారులకు కాలపరిమితి ప్రకారం తాగించేవారు. గ్రామాల్లోనూ ప్రతి బుధవారం నిర్వహించే ఇమ్యునైజేషన్‌ కార్యక్రమం ద్వారా ఏఎన్‌ఎంలు క్రమం తప్పకుండా అందిస్తూ వచ్చారు. ఈక్రమంలో గతేడాది నుంచి విటమిన్‌ ఏ సరఫరా ఆగిపోయింది. దీంతో జిల్లా వ్యాప్తంగా నమోదై ఉన్న 74 వేల మంది ఐదేళ్లలోపు బాలల పరిస్థితిపై వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రతి సమావేశాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బాధ్యులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళుతున్నప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ఈక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు ప్రాంతీయ ఆస్పత్రులకు చిన్నారులను తీసుకెళ్తున్న తల్లిదండ్రులకు తీవ్ర నిరాశ ఎదురవుతోంది. ద్రావణం సరఫరా కావడం లేదని ఆరోగ్య సిబ్బంది సమాధానం చెప్పడం పరిపాటిగా మారిందని వారు వాపోతున్నారు. ఎప్పుడు సరఫరా అవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం..
- సుమిత్ర, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారిణి
విటమిన్‌ ఏ ద్రావణం ఏడాది నుంచి సరఫరా నిలిచిపోయిన మాట వాస్తవమే. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ నుంచి జిల్లాలకు పంపిణీ కావాల్సి ఉంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులతో జరిగిన సమావేశాల్లో వారి దృష్టికి తీసుకెళ్లాం. దీనిపై అనుశీలన చేస్తూనే ఉన్నాం. ద్రావణం రాగానే ప్రత్యేక ఏర్పాట్లు చేసి చిన్నారులకు అందించేలా చర్యలు తీసుకుంటాం.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top