Tuesday, 03 Mar, 6.15 am ఈనాడు

హైదరాబాద్
వివాహ వార్షికోత్సవం రోజే పుత్రశోకం

యువకుడి బలవన్మరణం

సైదాబాద్‌, న్యూస్‌టుడే: తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం రోజు అంతా ఆనందంగా ఉన్నారు.. ఇంతలో వారి కుమారుడు బలవన్మరణానికి పాల్పడడంతో ఆ ఇంట విషాదం అలుముకుంది. ఈ సంఘటన సైదాబాద్‌ పోలీస్‌ ఠాణా పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. సైదాబాద్‌లోని పూసలబస్తీకి చెందిన యువకుడు(19) ఇంటర్మీడియట్‌ చదివాడు. ఇంటర్‌లో కొన్ని సబ్జెక్టుల్లో తప్పడంతో ఈ ఏడాది మళ్లీ రాసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు. ఈనెల 1న ఆదివారం యువకుడి తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం కావడంతో ఉదయం నుంచి అందరూ సంతోషంగా గడిపారు. రాత్రి వారు ఉంటున్న భవనం కింది పోర్షన్‌లో ఓ విందు కార్యక్రమం ఉండడంతో యువకుడి తల్లిదండ్రులు, అతని సోదరి ఆ కార్యక్రమానికి వెళ్లారు. ఇంట్లో ఒక్కడే ఉన్న యువకుడు ఇనుపమెట్లకు చీరతో ఉరివేసుకున్నాడు. పైకి వచ్చిన తల్లిదండ్రులు కుమారుడిని చూసి కుప్పకూలిపోయారు. వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయాడని వైద్యులు చెప్పారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top