Monday, 14 Jun, 4.40 pm ఈనాడు

తాజా వార్తలు
WTC Final: భారత్‌కు తగిన సమయం దొరికింది.. కానీ!

పరిస్థితులకు అలవాటు పడటమే కీలకం: వెంకటేశ్‌ ప్రసాద్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌ కోసం సన్నద్ధమయ్యేందుకు టీమ్‌ఇండియాకు తగినంత సమయం దొరికిందని, అయితే.. పరిస్థితులకు అలవాటు పడటమే కీలకమని మాజీ పేసర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ పేర్కొన్నాడు. తాజాగా ఆయన పీటీఐతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. తుదిపోరులో రెండు అత్యుత్తమ జట్లు పోటీపడుతున్నాయని చెప్పాడు. అలాగే టీమ్‌ఇండియా తగినంత మంది ఆటగాళ్లతో బలంగా ఉందని చెప్పాడు.

'భారత్‌ ఇప్పుడు బ్యాటింగ్‌ పరంగా చూసినా, బౌలింగ్‌ పరంగా చూసినా అత్యుత్తమంగా కనిపిస్తోంది. 1990, 2000 కాలంలో కేవలం ఇద్దరు మాత్రమే సరైన ఫాస్ట్‌ బౌలర్లు ఉండేవారు. అప్పుడు ముగ్గురు, నలుగురు పేసర్లు ఉండేవాళ్లు కాదు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జట్టులో నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారు. మంచి ఆల్‌రౌండర్లూ ఉన్నారు. టీమ్‌ఇండియా ఎప్పుడూ ప్రపంచశ్రేణి స్పిన్నర్లతో కొనసాగేది. అయితే.. ఇప్పుడు అద్భుతమైన పేస్‌బౌలింగ్‌ను కూడా సొంతం చేసుకుంది. మరోవైపు స్కోరుబోర్డుపై 350 పరుగులు సాధించే బ్యాట్స్‌మెన్‌ కూడా ఉన్నారు. దాంతో భారత్‌ అన్ని విభాగాల్లో పటిష్టంగా మారింది. ఇప్పుడు ఎలాంటి పిచ్‌ మీద ఆడుతున్నామనేది కాదు. టీమ్‌ఇండియా ఆడుతుంది అనేలా ఉండాలి' అని మాజీ పేసర్‌ చెప్పుకొచ్చాడు.

ఇక తుదిపోరులో అశ్విన్‌, జడేజా కచ్చితంగా ఉండాలని, కెప్టెన్‌ కోహ్లీ కూడా వారిద్దర్నీ ఎంచుకుంటాడని వెంకటేశ్‌ విశ్లేషించాడు. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు సరైన కాంబినేషన్ అని పేర్కొన్నాడు. బుమ్రా, షమి, ఇషాంత్‌ సరిపోతారని, ఆ ముగ్గురూ లైన్‌ అండ్‌ లెంగ్త్‌లో మంచి అనుభవం కలిగినవారని మాజీ పేసర్‌ చెప్పాడు. ఇక చివరగా ఈ మ్యాచ్‌ ఐదు రోజులు పూర్తిగా జరగాలని, భారత్‌లో మాదిరి మూడు, నాలుగు రోజుల్లో పూర్తవ్వకూడదన్నాడు. బ్యాట్స్‌మెన్‌ పరిస్థితులకు త్వరగా అలవాటు పడాలని, బౌలర్లు కూడా తమకు అనువైన బౌలింగ్‌ ఎండ్‌ను ఎంచుకోవాలని సూచించాడు. ఈ క్రమంలోనే తుదిపోరుకు ముందు న్యూజిలాండ్‌.. ఇంగ్లాండ్‌తో రెండు టెస్టులు ఆడటం వల్ల వాళ్లకు పరిస్థితులు అనుకూలిస్తాయని తెలిపాడు. అయితే టీమ్‌ఇండియా ప్రాక్టీస్‌కు కూడా తగినంత సమయం దొరికిందని, కానీ పరిస్థితులకు అలవాటు పడటమే కీలకమని వెంకటేశ్‌ తెలిపాడు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top