విదేశీ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాల విషయంలో దేశంలోనే అత్యధిక ఫిర్యాదులు ఆంధ్రప్రదేశ్ నుంచి నమోదైనట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
గత మూడు సంవత్సరాల్లో ఏపీ నుంచి మొత్తం 1,495 ఫిర్యాదులు నమోదైనట్లు తెలిపింది.ఇక తెలంగాణ నుంచి 339 ఫిర్యాదులు నమోదుకాగా, రాష్ట్రం దేశంలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో కేరళ రెండో స్థానంలో, తమిళనాడు మూడో స్థానంలో ఉన్నట్లు వివరించింది.విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం, నకిలీ రిక్రూట్‌మెంట్ ఏజెంట్లు, తప్పుడు ఉద్యోగ ఆఫర్లు, అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేయడం వంటి కారణాలతో ఉద్యోగార్థులు భారీగా మోసపోతున్నారు.ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారు అధికారికంగా గుర్తింపు పొందిన రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని, ఉద్యోగ ఆఫర్‌లను పూర్తిగా ధృవీకరించుకున్న తర్వాతే డబ్బులు చెల్లించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ సూచించింది.

