ఫరీదాబాద్: హర్యానాలోని ఫరీదాబాద్‌లో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయురాలు.. పాఠశాల ఆవరణలోనే కిరాతక హత్యకు గురైంది.
ముసుగు ధరించి వచ్చిన యువకుడు ఆమెపై అత్యంత దారుణంగా కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డు కావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.
ఫరీదాబాద్‌లోని సిక్రోనా గ్రామంలో ఉన్న సరస్వతి సీనియర్ సెకండరీ స్కూల్‌లో 29 ఏళ్ల సంధ్య టీచర్‌గా పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం ఎప్పటిలాగే పాఠశాలకు వచ్చిన ఆమెను కలవాలని ఓ యువకుడు గేటు వద్దకు వచ్చినట్లు స్కూల్ సిబ్బంది తెలిపారు. ఈ విషయాన్ని సంధ్యకు తెలియజేయడంతో ఆమె బయటకు వెళ్లింది.
అప్పటికే ముసుగు ధరించి అక్కడ వేచి ఉన్న నిందితుడు ఒక్కసారిగా సంధ్యపై దాడికి దిగాడు. సీసీటీవీ దృశ్యాల ప్రకారం.. ముందుగా ఆమెను బలవంతంగా పట్టుకుని లాగిన నిందితుడు, అనంతరం విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ముఖం, మెడ, ఛాతి, పొట్ట భాగాలను లక్ష్యంగా చేసుకుని అర నిమిషం వ్యవధిలోనే దాదాపు 20 నుంచి 30 సార్లు కత్తితో పొడిచినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
సంధ్య కేకలు విని స్కూల్ నిర్వాహకుడు తేజ్‌పాల్ అక్కడికి చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే నిందితుడు ఆయనపై కూడా కత్తితో దాడికి యత్నించడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అనంతరం సంధ్యపై మరోసారి దాడి చేసి బైక్‌పై పరారయ్యాడు.
తీవ్రంగా గాయపడిన సంధ్యను వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో పాఠశాలలో విషాద వాతావరణం నెలకొంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
రెండు గంటల్లోనే నిందితుడి అరెస్ట్
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాల ఆధారంగా కేవలం రెండు గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని 21 ఏళ్ల అమిత్‌గా గుర్తించారు. విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.
వేధింపుల కేసుపై ప్రతీకారమే కారణమా?
ప్రాథమిక దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమిత్‌కు సంధ్యతో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. అయితే సంధ్య ఆసక్తి చూపకపోయినా, అమిత్ ఆమెను తరచూ వెంటాడుతూ వేధించేవాడని విచారణలో తేలింది.
వేధింపులు ఎక్కువ కావడంతో ఇటీవల సంధ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా, అమిత్‌పై కేసు నమోదైంది. అనంతరం బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతో సంధ్య ఫిర్యాదును ఉపసంహరించుకున్నట్లు సమాచారం. అయితే అదే విషయాన్ని మనసులో పెట్టుకున్న అమిత్ ప్రతీకారంతో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
విచారణ కొనసాగుతోంది
హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచి పోలీస్ కస్టడీకి తీసుకునే ప్రక్రియ కొనసాగుతోంది. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

