కుటుంబ కలహాలు, అనుమానాలు చివరకు ఓ మహిళ ప్రాణాన్ని బలితీశాయి. గాంధీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసుల వివరాల ప్రకారం.. ఆటో డ్రైవర్‌గా పనిచేసే రాజు, దేబోరా (25) 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. బహదూర్‌పురా కిషన్‌బాగ్‌లోని ఎంఎన్ గూడెంలో నివాసం ఉంటూ ఇద్దరు కుమారులతో జీవనం సాగిస్తున్నారు. దేబోరా కవాడిగూడలోని ఓ స్పా సెంటర్‌లో బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది.
కొంతకాలం సాఫీగా సాగిన వీరి దాంపత్య జీవితం తర్వాత విభేదాలతో దూరమైంది. కుటుంబ పెద్దలు పలుమార్లు సర్దిచెప్పినా పరిస్థితి మారలేదు. దీంతో ఇద్దరూ వేర్వేరుగా నివసించడం ప్రారంభించారు. భర్త వేధింపులు పెరుగుతున్నాయని ఆరోపిస్తూ దేబోరా అత్తాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు ఫ్యామిలీ కోర్టులో విడాకుల కేసు కూడా దాఖలు చేసింది. ఈ విషయాలపై రాజు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం.
మంగళవారం ఉదయం విధులకు వెళ్లిన దేబోరాను రాజు వెంబడించాడు. కవాడిగూడలోని స్పా సెంటర్‌కు చేరుకున్న తర్వాత లిఫ్టులోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. నాలుగో అంతస్తుకు చేరుకున్న వెంటనే రాజు వెంట తెచ్చుకున్న కత్తితో దేబోరాపై దాడి చేశాడు. శరీరంలోని పలు భాగాల్లో కత్తిపోట్లు తగలడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. తీవ్ర రక్తస్రావంతో దేబోరా ప్రాణాలు కోల్పోయింది. దాడి అనంతరం రాజు అత్తాపూర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

