అధ్యాపకులు తనను పదేపదే అవమానించారని మనస్తాపానికి గురైన ఓ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నార్సింగి పోలీసుస్టేషన్ పరిధిలోని పుప్పాలగూడ సెక్రటేరియట్ కాలనీలో కలకలం రేపింది.
మృతురాలు రాసినట్లు చెబుతున్న లేఖలో పరీక్షల సందర్భంగా తనను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని అవమానించారని పేర్కొనడంతో ఈ ఘటనకు ప్రాధాన్యం ఏర్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నార్సింగి పోలీసుల కథనం ప్రకారం.. పుప్పాలగూడ సెక్రటేరియట్ కాలనీలో నివసిస్తున్న సతీష్, మాధవి దంపతుల కుమార్తె శ్రేయ (20) ఇబ్రహీంబాగ్‌లోని వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది.
సోమవారం రాత్రి కుటుంబ సభ్యులు కలిసి శ్రేయ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అనంతరం తండ్రి కింద అంతస్తులో, తల్లి, పిల్లలు పైఅంతస్తులో నిద్రించారు. తెల్లవారుఝామున 2 గంటల సమయంలో తల్లి లేచి చూడగా శ్రేయ తన పక్కనే ఉండగా, ఉదయం 6 గంటలకు కనిపించకపోవడంతో వెతికారు. పైఅంతస్తులోని గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతున్న ఆమెను గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పరీక్షల సమయంలో అవమానించారనే ఆవేదన
గత నెలలో జరిగిన రెండో సెమిస్టర్ పరీక్ష సందర్భంగా శ్రేయ పొరపాటున సెల్‌ఫోన్‌ను పరీక్ష హాలులోకి తీసుకెళ్లగా ఇన్విజిలేటర్‌కు పట్టుబడినట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం అధికారులు చర్యలు తీసుకున్నారు. అనంతరం జరిగిన మరో పరీక్షలో కూడా ఆమె ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేస్తూ అధ్యాపకులు మందలించినట్లు సమాచారం.
శ్రేయ రాసినట్లు చెబుతున్న లేఖలో, పరీక్ష రాస్తున్న సమయంలో ఓ అధ్యాపకుడు తనను ఉద్దేశించి అవమానకర వ్యాఖ్యలు చేశారని, మరో అధ్యాపకుడు కూడా తాను ఇతర విద్యార్థిని చూసి రాసానంటూ ఆరోపించారని పేర్కొంది. పరీక్షల సమయాలు వేర్వేరుగా ఉన్నప్పుడు అలాంటి ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించింది. ఈసారి పరీక్షలకు బాగా సిద్ధమై మంచి మార్కులు సాధిస్తానని భావించినా, తనను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని లేఖలో రాసినట్లు పోలీసులు తెలిపారు.
అలాగే, అధ్యాపకుల వ్యాఖ్యల కారణంగా తోటి విద్యార్థులు కూడా తనకు దూరమయ్యారని, ఎప్పుడూ ప్రతికూల వ్యాఖ్యలే వినాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. తన తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని సోదరుడికి సూచిస్తూ, బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరింది. చివరగా క్షమాపణలు చెబుతూ, తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్న పరిస్థితిలో ఇదే సరైన నిర్ణయంగా భావిస్తున్నానని పేర్కొన్నట్లు సమాచారం. శ్రేయ తండ్రి సతీష్ ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లేఖలో పేర్కొన్న అంశాలు, కళాశాల అధ్యాపకుల పాత్ర తదితర అంశాలపై విచారణ కొనసాగుతోంది.

