హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం జరిగిన ఘటన కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన ఉడుతల ఉదయ్, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.
అదే కళాశాలలో చదువుతున్న తన సహ విద్యార్థినితో కలిసి ఈ నెల 14న రాత్రి కారులో దిల్‌సుఖ్‌నగర్‌కు వెళ్లాడు.
టీ తాగిన అనంతరం తిరిగి ఇబ్రహీంపట్నంకు వస్తూ మార్గమధ్యలో మద్యం కొనుగోలు చేసిన ఉదయ్, బీడీఎల్ రోడ్డులోని నిర్మానుష్య ప్రాంతానికి కారును తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ విద్యార్థినికీ మద్యం తాగించి, ఆమె మత్తులోకి వెళ్లిన తర్వాత ఇబ్రహీంపట్నంలోని ఓ గదికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఘటనపై బాధితురాలు ఈ నెల 17న పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఉదయ్‌ను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ మహేందర్‌రెడ్డి వెల్లడించారు

