Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Hyderabad Woman : అమ్మ క్షేమంగా తిరిగొస్తే.. అదే నా బర్త్‌డే గిఫ్ట్‌!

Hyderabad Woman : అమ్మ క్షేమంగా తిరిగొస్తే.. అదే నా బర్త్‌డే గిఫ్ట్‌!

EhaTV 2 weeks ago

హైదరాబాద్‌: ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సుహాసినిరెడ్డి కందిమల్ల (44) కుటుంబంతో కలిసి విదేశాల్లో ఉంటున్నా.. సొంతింటి గృహప్రవేశం కోసం ఇటీవల హైదరాబాద్‌కు వచ్చారు.

ఎల్బీనగర్‌లోని చంద్రపురికాలనీలో కొత్తగా కొనుగోలు చేసిన ఇంట్లో ఈ నెల 23న గృహప్రవేశం నిర్వహించారు. అయితే అదే రోజు దిల్లీ మీదుగా కాఠ్‌మాండూకు వెళ్లిన ఆమె.. అక్కడి నుంచి ఆస్ట్రేలియాకు చెందిన స్నేహితురాలితో కలిసి విహారయాత్రకు వెళ్లారు. హైదరాబాద్‌ ఎన్టీఆర్‌నగర్‌ డివిజన్‌లోని వాస్తుకాలనీకి చెందిన మహేందర్‌రెడ్డి, ప్రేమలతల కుమార్తె సుహాసినిరెడ్డి కందిమల్ల భర్త సంజీవరెడ్డి, కుమారులు శ్రీహాన్‌, సమయ్‌లతో కలిసి ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఆమె.. ఈషా ఫౌండేషన్‌లోనూ సభ్యురాలిగా ఉన్నారు.

కొత్త ఇంటి గృహప్రవేశం కోసం ఈ నెల 19న చిన్న కుమారుడు సమయ్‌తో కలిసి ఆమె హైదరాబాద్‌కు వచ్చారు. 23న ఉదయం కుటుంబ సభ్యుల సమక్షంలో గృహప్రవేశం నిర్వహించారు. అనంతరం కుమారుడు సమయ్‌ను హైదరాబాద్‌లోనే ఉంచి.. అదే రోజు దిల్లీకి, అక్కడి నుంచి నేపాల్‌ రాజధాని కాఠ్‌మాండూకు బయలుదేరారు.

ఆస్ట్రేలియాలోని ఆమె స్నేహితురాలు నేరుగా కాఠ్‌మాండూకు చేరుకోవడంతో.. ఇద్దరూ కలిసి నేపాల్‌లో విహారయాత్రకు వెళ్లారు. చివరిసారిగా మంగళవారం సాయంత్రం సుహాసిని తన తండ్రితో ఫోన్‌లో మాట్లాడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత ఆమె నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కుటుంబంలో ఆందోళన నెలకొంది.

'అమ్మ తిరిగొస్తే అదే పెద్ద బహుమతి'

సుహాసిని చిన్న కుమారుడు సమయ్‌ పుట్టినరోజు సెప్టెంబరు 14న. ప్రతి పుట్టినరోజుకూ తన తల్లి తనకు ప్రత్యేకమైన బహుమతి ఇస్తుందని సమయ్‌ గుర్తుచేసుకున్నాడు. అయితే ఈసారి మాత్రం తన తల్లి క్షేమంగా తిరిగి ఇంటికి రావడమే తనకు అత్యంత పెద్ద బహుమతి అని చెప్పడం కుటుంబ సభ్యులను కలచివేసింది. గృహప్రవేశం కోసం సంతోషంగా హైదరాబాద్‌కు వచ్చిన సుహాసిని.. కుమారుడితో కొద్దిరోజులు గడిపిన అనంతరం పర్యటనకు వెళ్లారు. ప్రస్తుతం ఆమె ఆచూకీపై కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆమె సురక్షితంగా తిరిగి రావాలని కుటుంబ సభ్యులు, బంధువులు ఆకాంక్షిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: EhaTV Telugu News