భర్తతో ఉన్న విభేదాలను పరిష్కరించుకోవాలనే ఆశతో పోలీసులను ఆశ్రయించిన ఓ వివాహితకు చేదు అనుభవం ఎదురైంది. సమస్యను పరిష్కరిస్తానని నమ్మించిన ఓ ఇన్‌స్పెక్టర్ ఆమెను మోసం చేశాడనే ఆరోపణలు ఖమ్మంలో కలకలం రేపుతున్నాయి.
ఖమ్మం నగరంలోని వీడీఓస్ కాలనీకి చెందిన 43 ఏళ్ల మహిళకు భర్తతో విభేదాలు ఏర్పడటంతో మూడేళ్ల క్రితం మహిళా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. ఆ సమయంలో అక్కడ ఎస్‌హెచ్‌ఓ ఇన్‌ఛార్జిగా పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్ రాజు, తన సమస్యను పరిష్కరిస్తానని చెప్పి ఆమెకు దగ్గరయ్యాడని ఫిర్యాదులో పేర్కొంది.
వివాహం చేసుకుంటానని నమ్మబలికి కొంతకాలం సహజీవనం చేసిన అనంతరం పెళ్లికి నిరాకరించాడని బాధితురాలు ఆరోపించింది. అంతేకాకుండా గర్భం దాల్చిన సమయంలో అబార్షన్ చేయించాడని, ఆర్థికంగా కూడా మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు మే 7న ఖమ్మం రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ రాజుపై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేశారు. కేసు నమోదైన విషయం తెలిసిన తర్వాత ఆయన సెలవుపై వెళ్లినట్లు సమాచారం. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో ఇన్‌స్పెక్టర్ రాజును ఐజీ కార్యాలయానికి అటాచ్ చేసినట్లు ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి తెలిపారు. కేసుపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు..

