మంత్రి కొండా సురేఖ అటాక్ మోడ్‌లోకి వెళ్లారు. ఆమె నేరుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేశారు. ఇప్పుడు సురేఖ వ్యవహారంలో కాసేపట్లో నిర్ణయం రాబోతుంది..
ఆమెను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయబోతున్నారా? లేక ఆమె చేతే రాజీనామా చేయించబోతున్నారా? అనే వార్తలను ఈరోజు ఉదయం నుంచి చూస్తున్నాం.ఇలాంటి వార్తల నడుమ కొండా సురేఖ కొద్దిసేపటి క్రితం చిట్‌చాట్‌లో మాట్లాడిన మాటలను పరిశీలిస్తే.. ఇక ఆమె డైరెక్ట్ అటాక్‌కు దిగినట్టుగా కనిపిస్తోంది. నేరుగా ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆమె చిట్‌చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు.ఆమె చేసిన వ్యాఖ్యలు ఏమిటో చూద్దాం. ఆ తర్వాత ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారు? వాటి వెనుక ఏం ఉంది? అనే అంశాలను విశ్లేషిద్దాం.
కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను చూస్తే.. "ముఖ్యమంత్రి క్రమశిక్షణ తప్పినట్లు కాదా? పదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ఏ రకంగా చెబుతారు? పదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని తనకు తాను ప్రకటించుకోవడం క్రమశిక్షణ ఉల్లంఘన కిందకు రాదా?" అని ప్రశ్నించారు.
అంతేకాదు.. "నాకు తెలియకుండా నా మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఓఎస్డీని తొలగించడం నన్ను అవమానించడం కాదా? నా ఓఎస్డీపై కేసు నమోదు చేయించడం నన్ను అవమానించడం కాదా? ఇది పార్టీ క్రమశిక్షణ కిందకు రాదా?" అని ప్రశ్నించారు.
ఒక మంత్రికి సంబంధించిన ఓఎస్డీని తొలగించి, ఆయనపై కేసు పెట్టడం.. ముఖ్యమంత్రికి సంబంధించిన కొంతమంది సన్నిహితులు, ప్రముఖులను బెదిరించి, గన్ చూపించి భయపెట్టడం వంటి వ్యవహారాలన్నింటినీ గతంలో తాము బయటపెట్టినప్పుడు వాటిపై మాత్రం మౌనంగా ఉండి.. ఇప్పుడు తన కూతురు మాట్లాడిన అంశాలను తెరపైకి తీసుకొచ్చి తనపై చర్యలు తీసుకోవాలని కోరడం ఏమిటని ఆమె ప్రశ్నించారు.
"నా కూతురు మాట్లాడిన మాటలతో నాకు ఎలా సంబంధం ఉంటుంది? నా కూతురు మాట్లాడిన మాటలకు నన్ను మంత్రివర్గం నుంచి ఏ రకంగా బర్తరఫ్ చేయాలని కోరతారు?" అని ఆమె ప్రశ్నించారు.
అంతేకాదు.."నా కూతురు ఆ రకంగా మాట్లాడడానికి కారణం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎందుకు కాకూడదు? ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎన్నికలకు రెండున్నరేళ్ల ముందు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటిస్తారా? నియోజకవర్గాలకు వెళ్లిన సందర్భంగా, ఎన్నికల సమయం కూడా కానప్పుడు అక్కడికి వెళ్లి పీసీసీ అధ్యక్షుడు ఇప్పటికే ఉండగా.. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడం క్రమశిక్షణారాహిత్యం కిందకు రాదా?" అని ప్రశ్నించారు.
ఇప్పటికే అనేకమంది మంత్రులపై అవినీతి ఆరోపణలు, రకరకాల ఆరోపణలు ఉన్నాయని.. ఆ ఆరోపణలన్నింటినీ ఎందుకు పట్టించుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి వ్యవహారశైలిపై ప్రభుత్వంలోని కీలకమైన మంత్రులకు, పార్టీకి సంబంధించిన నేతలకు అసంతృప్తి ఉందని.. ఆ అసంతృప్తికి కారణం ఏమిటో అధిష్ఠానం ఎందుకు తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదని ప్రశ్నించారు.
ఈ అంశాలన్నింటినీ లిఖితపూర్వకంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముందు ఉంచినట్లు కొండా సురేఖ తెలిపారు. అధిష్ఠానం ముందు లిఖితపూర్వకంగా ఇచ్చిన అంశాలనే ఆమె ఇప్పుడు మీడియా ముందు చిట్‌చాట్‌లో ప్రస్తావించారు.
ఎందుకు అటాక్ మోడ్‌లోకి వెళ్లారు?
కొండా సురేఖ అటాక్ మోడ్‌లోకి ఎందుకు వెళ్లారు? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.నిజానికి కొండా సురేఖ ముఖ్యమంత్రితో రాజీ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రితో రాజీకి సంబంధించిన ప్రయత్నాన్ని రాఖీ పండుగ రోజే చూశాం. ఆమె ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. రాఖీ కట్టారు. ఆ తర్వాత బయటకు వచ్చి ముఖ్యమంత్రి గురించి మంచి మాటలు మాట్లాడారు."మా ముఖ్యమంత్రికి ప్రతి ఏటా రాఖీ కడుతున్నాను"** అని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అద్భుతంగా పరిపాలన చేస్తున్నారని కూడా ఆమె వ్యాఖ్యానించారు.అంటే.. ఆమె రాజీకి సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు అప్పుడే కనిపించాయి. కానీ ముఖ్యమంత్రి మాత్రం చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారు.ఎట్టి పరిస్థితుల్లోనూ కొండా సురేఖపై చర్యలు తీసుకోవాల్సిందేనని.. అలా తీసుకోకపోవడం ముఖ్యమంత్రి స్థానాన్ని బలహీనపరచడమే అవుతుందని ఆయన భావిస్తున్నట్టు ప్రచారం జరిగింది.ముఖ్యమంత్రిపై వ్యక్తిగతంగా ఒక మంత్రి కూతురు ఆ తరహా వ్యాఖ్యలు చేసినప్పుడు అధిష్ఠానం సీరియస్‌గా తీసుకోకపోతే.. భవిష్యత్తులో మరింత మంది ముఖ్యమంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి అవకాశం ఇచ్చినట్టవుతుందని రేవంత్‌రెడ్డి వర్గం భావిస్తున్నట్టు తెలుస్తోంది.అందుకే ముఖ్యమంత్రి స్థానాన్ని గౌరవించేలా, ముఖ్యమంత్రి స్థానాన్ని పటిష్ఠం చేసేలా అధిష్ఠానం నిర్ణయం తీసుకోవాలని రేవంత్‌రెడ్డి కోరుకుంటూ వచ్చారని సమాచారం.
ఢిల్లీకి వెళ్లిన తర్వాతే కొత్త మలుపు
కొండా సురేఖపై చర్యలకు సంబంధించి రాజీకి ముఖ్యమంత్రి సిద్ధంగా లేరనే సంకేతాలు అందిన తర్వాత.. ఢిల్లీ నుంచి ఆమెకు పిలుపు వచ్చింది.దీంతో ఢిల్లీకి వెళ్లి.. రాష్ట్రంలో జరుగుతున్న మొత్తం వ్యవహారాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాలని కొండా సురేఖ భావించినట్టు తెలుస్తోంది.అందులో భాగంగానే పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముందు తన వాదనను బలంగా వినిపించారు. ఆమె వినిపించిన వాదనకు ఇప్పుడు పార్టీకి సంబంధించిన కీలక నేతలు కూడా స్పందించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
"పదేళ్లు సీఎంగా ఉంటాను" అనే వ్యాఖ్యపై ప్రశ్న
కొండా సురేఖ లేవనెత్తిన ప్రధాన ప్రశ్నల్లో ఒకటి.. "ముఖ్యమంత్రి తనకు తాను పదేళ్లు సీఎంగా ఉంటానని ఎలా ప్రకటించుకుంటారు?"అనేది.కాంగ్రెస్ పార్టీలో ఒక రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకుని, అధిష్ఠానం పరిశీలకులను పంపించి వారి అభిప్రాయాలను తెలుసుకుని ఆ తర్వాత ముఖ్యమంత్రిని ఎంపిక చేసే సంప్రదాయం ఉంది.అలాంటిది ఉండగా.. వచ్చే ఎన్నికల్లో కూడా తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ప్రస్తుత ముఖ్యమంత్రి ఓపెన్‌గా ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ కోణంలో క్రమశిక్షణారాహిత్యమేనా? అనే ప్రశ్నను కొండా సురేఖ అధిష్ఠానం ముందుకు తీసుకెళ్లారు.అదే సమయంలో తన కూతురు మాట్లాడిన మాటలకు తనను ఎలా బాధ్యురాలిని చేస్తారని ఆమె ప్రశ్నిస్తున్నారు.
ఓఎస్డీ వ్యవహారంపైనా ప్రశ్నలు
తన ఓఎస్డీ విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై కూడా అధిష్ఠానం ఆలోచించాల్సిన అవసరం ఉందని కొండా సురేఖ చెబుతున్నారు.ఓఎస్డీని తొలగించడం, ఆయనపై కేసులు నమోదు చేయడం వంటి అంశాలపై అధిష్ఠానం విచారణ జరిపించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె వాదన.అంతేకాదు.. "నేను బీసీ మంత్రిని కాబట్టే నాపై చర్యలు తీసుకుంటున్నారా?" అనే ప్రశ్నను కూడా ఆమె తెరపైకి తీసుకొచ్చారు.మిగతా మంత్రులపై ఆరోపణలు వచ్చిన సందర్భాల్లో ఎందుకు ఇంత వేగంగా చర్యలు తీసుకోలేదని, కనీసం వారిని పిలిపించి మాట్లాడే ప్రయత్నం కూడా ఎందుకు చేయలేదని ఆమె ప్రశ్నిస్తున్నారు.
బీసీ ప్రాతినిధ్యం అంశం
కొండా సురేఖ కేవలం ఒక బీసీ మంత్రి మాత్రమే కాదు.. తెలంగాణలో కీలకమైన రెండు సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిగా ఆమెను చూడాలని ఆమె వర్గం భావిస్తోంది.ఆమె పద్మశాలి సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆమె భర్త కొండా మురళి మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందినవారు.తెలంగాణలో ఈ రెండు సామాజిక వర్గాలకు గణనీయమైన ఓటు బ్యాంక్ ఉంది. ఇప్పటికే తెలంగాణలో బీసీలకు తగినంత ప్రాతినిధ్యం లేదనే చర్చ జరుగుతోంది.ఇలాంటి సమయంలో ఇటీవల పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ కూడా మంత్రివర్గంలో బీసీల ప్రాతినిధ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందని బహిరంగంగా వ్యాఖ్యానించారు.అలాంటి పరిస్థితుల్లో రెండు కీలక సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కొండా సురేఖను కేబినెట్ నుంచి తొలగించడం పార్టీ ప్రయోజనాల పరంగా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందనే అంశాన్ని ఆమె అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.
కూతురు వ్యాఖ్యలే ఇప్పుడు కీలకమా?
తన కూతురు మాట్లాడిన మాటలకు తనను బాధ్యురాలిని చేయడం సరికాదని కొండా సురేఖ వాదిస్తున్నారు.అయితే ఇక్కడ మరో ప్రశ్న కూడా తెరపైకి వస్తోంది. తన కూతురు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని ఇప్పటివరకు కొండా సురేఖ లేదా కొండా మురళి బహిరంగంగా ఎందుకు చెప్పలేదు? అనే ప్రశ్నను ముఖ్యమంత్రి వర్గం అధిష్ఠానం ముందు పెట్టే అవకాశం ఉంది.తన కూతురికి అసంతృప్తి ఉండొచ్చు. నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపికపై అసంతృప్తి ఉండొచ్చు. కానీ అసంతృప్తిని వ్యక్తం చేయడం వేరు.. వ్యక్తిగతంగా ముఖ్యమంత్రిపై దాడి చేయడం వేరు.వ్యక్తిగత వ్యాఖ్యలు చేసినప్పుడు అవి సరైనవి కావని కొండా సురేఖ లేదా కొండా మురళి చెప్పకపోవడం.. అధిష్ఠానం ముందు వారి వాదనను బలహీనపరిచే అవకాశం కూడా ఉంది.
అధిష్ఠానం ముందున్న రెండు మార్గాలు
ఇప్పుడు అసలు ప్రశ్న.. రేవంత్‌రెడ్డికి అధిష్ఠానం అండగా నిలుస్తుందా? కొండా సురేఖపై చర్యలు తీసుకుంటుందా? లేక రేవంత్‌రెడ్డిని కన్విన్స్ చేసి, ఆ తర్వాత కొండా సురేఖతో రాజీకి ప్రయత్నిస్తుందా? అనేది.కొండా సురేఖపై చర్యలు తీసుకోకపోతే.. ముఖ్యమంత్రి నాయకత్వాన్ని అధిష్ఠానమే బలహీనపరిచినట్టవుతుందని రేవంత్‌రెడ్డి వర్గం భావించే అవకాశం ఉంది.అదే సమయంలో కొండా సురేఖపై చర్యలు తీసుకుంటే.. బీసీ సామాజిక వర్గాల్లో ఎలాంటి రాజకీయ ప్రభావం ఉంటుందనే అంశాన్ని కూడా కాంగ్రెస్ అధిష్ఠానం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.అందుకే ఇద్దరి మధ్య రాజీ ఫార్ములాను తెరపైకి తీసుకొచ్చే అవకాశం కూడా లేకపోలేదు.
ఇప్పుడు ఏం జరగబోతోంది?
ఈరోజు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కూడా ఊహించి ఉండకపోవచ్చు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం కూడా ఊహించని స్థాయిలో ఆమె అటాక్ మోడ్‌లోకి వెళ్లినట్టుగా కనిపిస్తోంది."తాడోపేడో తేల్చుకుందాం.. మొత్తం విషయాన్ని అధిష్ఠానం ముందు పెడదాం.. తెలంగాణ సమాజం ముందు పెడదాం.. ఏం జరుగుతుందో చూద్దాం" అనే తరహాలో ఆమె వ్యవహరించినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఆమె కాసేపటి తర్వాత కేసీ వేణుగోపాల్‌తో కూడా సమావేశం కానున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె చేసిన తాజా వ్యాఖ్యల తర్వాత కేసీ వేణుగోపాల్ అపాయింట్‌మెంట్ ఉంటుందా? అది క్యాన్సిల్ అవుతుందా? అపాయింట్‌మెంట్ ఇస్తే ఆయన ముందు కొండా సురేఖ ఏం చెబుతారు? అనే అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.మొత్తంగా చూస్తే.. కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు కేవలం ఒక మంత్రి, ముఖ్యమంత్రి మధ్య వివాదంగా కాకుండా.. తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకత్వం, క్రమశిక్షణ, బీసీ ప్రాతినిధ్యం, అధిష్ఠానం నిర్ణయం వంటి అనేక అంశాలతో ముడిపడిన రాజకీయ సంక్షోభంగా మారుతున్నట్టుగా కనిపిస్తోంది.

