Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Magunta Srinivasulu Reddy : బాబు నమ్మట్లేదనా..

Magunta Srinivasulu Reddy : బాబు నమ్మట్లేదనా..

EhaTV 6 days ago

లో.. నమస్తే.మాగుంట శ్రీనివాసులరెడ్డి ఒంగోలు ఎంపీ. ఆయన సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నారు.

ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో ఎంపీగా ఉండి.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు.మాగుంట కుటుంబం నాలుగైదు దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతూ వస్తోంది. రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న కుటుంబంగా వారికి పేరుంది. వివాదరహితమైన కుటుంబంగా కూడా గుర్తింపు ఉంది. ఎక్కడా పెద్దగా వివాదాల్లోకి వెళ్లిన పరిస్థితి కనిపించదు. పార్టీలు మారిన సందర్భాల్లో కూడా ఆయన కొత్తగా చేరిన పార్టీలు కానీ, ఆయన వదిలి వచ్చిన పార్టీలు కానీ.. ఆయనపై పెద్దగా విమర్శలు చేసిన సందర్భాలను మనం చూడలేదు.ఎలాంటి వివాదాలు లేని వ్యక్తిగా, నోటిని అదుపులో పెట్టుకునే వ్యక్తిగా, మెచ్యూర్డ్ పాలిటిక్స్ చేసే వ్యక్తిగా, జిల్లా రాజకీయాల్లో పెద్దమనిషిగా మాగుంట శ్రీనివాసులరెడ్డికి పేరుంది.అటువంటి మాగుంట శ్రీనివాసులరెడ్డి నిన్న వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

ఏం మాట్లాడారు ఆయన?

'జగన్‌మోహన్‌రెడ్డి మా కులపోడని, మా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని భావించి గత ఎన్నికల్లో ఓట్లు వేశాం. కానీ ఆయన మూర్ఖుడు' అనే తరహాలో మాగుంట శ్రీనివాసులరెడ్డి వ్యాఖ్యలు చేశారు.మాగుంట శ్రీనివాసులరెడ్డి నోటి నుంచి ఇలాంటి మాటలు రావడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 'మూర్ఖుడు', 'వాడు', 'వీడు' వంటి పదాలు పెద్దగా అభ్యంతరకరమైన భాష కాకపోవచ్చు. కొంతమంది నాయకులు మాట్లాడే భాషను చూస్తే ఇవి చాలా సాధారణమైన పదాలుగానే కనిపించవచ్చు.కానీ ఆ మాటలు మాగుంట శ్రీనివాసులరెడ్డి నోటి నుంచి రావడంతో వాటికి ఎక్కువ ప్రాధాన్యత వచ్చింది.అంత పెద్దమనిషి ఇలాంటి భాష ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అసలు ఆయనకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ముఖ్యంగా గతంలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీగా ఉన్నారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వరకు కూడా ఆయన వైసీపీ ఎంపీగానే ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీ టికెట్ రాదని నిర్ణయం జరిగిన తర్వాత.. ఆ పార్టీని వీడి బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ టికెట్ తీసుకున్నారు.

వెలిగొండ ప్రాజెక్టును గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేసిన సమయంలో మాగుంట శ్రీనివాసులరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు.అంతకుముందు కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ప్రారంభించిన సమయంలో కూడా మాగుంట శ్రీనివాసులరెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు.ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ హయాంలో 2014 నుంచి 2019 వరకు వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు జరుగుతున్న సమయంలో ఆయన టీడీపీలో ఉన్నారు.ఇన్ని సందర్భాల్లోనూ మాగుంట శ్రీనివాసులరెడ్డి మరొక నాయకుడిపై ఈ తరహా వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన సందర్భాన్ని మనం చూడలేదు.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వెలిగొండ ప్రాజెక్టును పూర్తిగా కాకుండా.. ఏదో ప్రారంభోత్సవం చేశామంటే చేశామన్నట్టుగా చేశారని మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇప్పుడు వ్యాఖ్యానించారు.అయితే, ఆ కార్యక్రమంలో తాను కూడా పాల్గొన్నారు కదా? జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా భాగస్వామ్యం తీసుకున్నారు కదా?

అప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ఆయన కూడా మద్దతుగా ఉన్నట్టే కదా?

అప్పుడు ఆయన పార్టీలోనే ఉన్నారు. ఇప్పుడు వచ్చి అదే నాయకుడిపై ఈ స్థాయిలో విమర్శలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? పైగా వ్యక్తిగత స్థాయిలో వ్యాఖ్యలు చేసే వరకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అనేది ప్రశ్న.

మరో అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించాలి.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాగుంట శ్రీనివాసులరెడ్డి కుటుంబం పేరు కూడా వినిపించింది. ఆయన కుమారుడు అరెస్ట్ అయి కొంతకాలం జైలు జీవితం కూడా గడిపి వచ్చారు.2021 నుంచి 2024 వరకు ఢిల్లీ మద్యం కుంభకోణం విషయంలో తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా సంస్థలు మాగుంట శ్రీనివాసులరెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాయి. మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ ఉన్నారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.ఇప్పుడు అదే కేసు విషయంలో మాగుంట కుటుంబం అప్రూవర్‌గా మారిన అంశం కూడా రాజకీయంగా చర్చకు వచ్చింది. అయితే, ఈ కేసులో ఆయనపై తుది న్యాయపరమైన నిర్ణయం వెలువడిందా లేదా అనేది వేరే అంశం.అప్పుడు లిక్కర్ కేసులో నిందితుడిగా తెలుగుదేశం పార్టీ విమర్శించిన వ్యక్తే.. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వెళ్లి ఎంపీగా గెలిచారు.ఇప్పుడు గెలిచిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై ఈ స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.ఇంతటి తీవ్ర వ్యాఖ్యలు చేయడం వెనుక కారణం ఏంటి? అనేది ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.ఇక్కడ ఒక ప్రశ్న సహజంగానే వస్తుంది.

తెలుగుదేశం పార్టీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని పూర్తిగా నమ్మడం లేదా?

'మాగుంట శ్రీనివాసులరెడ్డి మనతోనే ఉంటారు' అనే భరోసాకు టీడీపీ నాయకత్వం ఇంకా రాలేదా?మాగుంట శ్రీనివాసులరెడ్డిని టీడీపీ నాయకత్వం పూర్తిగా సొంతం చేసుకునే ప్రయత్నం చేయలేకపోతుందా?లేకపోతే.. రేపో మాపో ఆయన మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారేమో, బీజేపీలోకి వెళ్తారేమో, జనసేనలోకి వెళ్తారేమో అనే అనుమానం టీడీపీ నాయకత్వంలో ఉందా?అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు రాజకీయంగా వినిపిస్తున్నాయి.

మాగుంట శ్రీనివాసులరెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలించినా, తాజాగా ఆయన మాట్లాడిన మాటలను చూసినా, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రాజకీయ వాతావరణాన్ని గమనించినా.. ఆయన ఈ స్థాయిలో భాష ఉపయోగించడం వెనుక తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని సంతృప్తిపరిచే ఉద్దేశం ఉందా? అనే అనుమానం కలుగుతోంది.'నేను మీతోనే ఉన్నాను. నాకు జగన్‌మోహన్‌రెడ్డితో ఎలాంటి సంబంధం లేదు. నేను మళ్లీ జగన్‌మోహన్‌రెడ్డి గడప తొక్కను' అనే సందేశాన్ని టీడీపీ నాయకత్వానికి ఇవ్వడానికి ఆయన వెలిగొండ సభను ఒక వేదికగా ఉపయోగించుకున్నారా? అనే చర్చ జరుగుతోంది.తనపై టీడీపీ నాయకత్వానికి ఎలాంటి అనుమానాలు ఉండకూడదనే ఉద్దేశంతో.. 'నేను జగన్‌మోహన్‌రెడ్డిని ఎన్ని మాటలైనా అనగలను' అని నిరూపించుకునే ప్రయత్నంలో మాగుంట శ్రీనివాసులరెడ్డి శ్రుతిమించి నోరు జారారా? అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.అయితే, ఈ వ్యాఖ్యలు ఆయనను తెలుగుదేశం పార్టీకి ఎంత దగ్గర చేశాయో తెలియదు. కానీ ఒంగోలు జిల్లా ప్రజలకు మాత్రం ఆయన దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందనే చర్చ జరుగుతోంది.

ఎందుకంటే ఇన్నేళ్లుగా వివాదరహితమైన రాజకీయ నాయకుడిగా, పెద్దమనిషిగా, మెచ్యూర్డ్ పొలిటీషియన్‌గా ఉన్న మాగుంట శ్రీనివాసులరెడ్డి.. తన స్థాయికి భిన్నంగా కనిపించే భాషను ఉపయోగించడం ద్వారా తన రాజకీయ విలువను, విశ్వసనీయతను తానే దెబ్బతీసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.రాజకీయంగా విమర్శలు చేయడం వేరు. విధానాలను ప్రశ్నించడం వేరు. కానీ వ్యక్తిగత స్థాయిలో, గతంలో కలిసి పనిచేసిన నాయకుడిపై ఈ స్థాయిలో భాష ఉపయోగించడం మాత్రం మాగుంట శ్రీనివాసులరెడ్డి రాజకీయ ఇమేజ్‌కు ఎంతవరకు ఉపయోగపడుతుందనేది రాబోయే రోజుల్లోనే తేలాల్సి ఉంది.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: EhaTV Telugu News