Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Meenakshi Natarajan : పంజాబ్‌కు మీనాక్షి.. తెలంగాణకు వీడ్కోలు?

Meenakshi Natarajan : పంజాబ్‌కు మీనాక్షి.. తెలంగాణకు వీడ్కోలు?

EhaTV 2 weeks ago

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయా? తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ బాధ్యతల నుంచి మీనాక్షీ నటరాజన్‌ తప్పుకోనున్నారన్న ప్రచారం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

రాష్ట్రంలో 'సర్‌' ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆమె తెలంగాణ నుంచి వెళ్లే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.మరోవైపు మీనాక్షీ నటరాజన్‌కు త్వరలోనే పంజాబ్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌గా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించాలని ఏఐసీసీ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పంజాబ్‌ రాజకీయాలపై కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రత్యేకంగా దృష్టి సారించిన నేపథ్యంలో.. ఆమెకు అక్కడ కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకుంది.

తెలంగాణ కాంగ్రెస్‌పై అసంతృప్తి?

మీనాక్షీ నటరాజన్‌ కొంతకాలంగా తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాలపై అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో తనకు రాజ్యసభ అవకాశం దక్కకుండా కొందరు రాష్ట్ర నేతలు అడ్డుకున్నారన్న అసంతృప్తి ఆమెకు ఉన్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో తెలంగాణలో కొనసాగడం తనకు ఇష్టం లేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి మీనాక్షీ నటరాజన్‌ స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ అంశంపై పార్టీ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

పంజాబ్‌పై ఏఐసీసీ ఫోకస్‌

మరోవైపు పంజాబ్‌ కాంగ్రెస్‌ పరిస్థితులపై ఏఐసీసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ముగ్గురు సభ్యులతో పరిశీలకుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం.ఈ బృందంలో మీనాక్షీ నటరాజన్‌, అజయ్‌ మాకెన్‌, భజన్‌లాల్‌ జాతవ్‌ ఉన్నారు. ఇప్పటికే పంజాబ్‌ రాజకీయ పరిస్థితులపై జరుగుతున్న సమీక్షల్లో మీనాక్షీ నటరాజన్‌ చురుగ్గా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.

'సర్‌' తర్వాత కీలక మార్పు?

తెలంగాణలో 'సర్‌' ప్రక్రియ పూర్తయిన వెంటనే మీనాక్షీ నటరాజన్‌ పంజాబ్‌ రాజకీయాల్లో మరింత కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆమెను పంజాబ్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌గా పూర్తి స్థాయిలో నియమించే అంశంపై అధిష్ఠానం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.అయితే తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ బాధ్యతల నుంచి ఆమె నిజంగానే తప్పుకుంటారా? పంజాబ్‌కు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తారా? అన్నదానిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. దీంతో తెలంగాణ, పంజాబ్‌ కాంగ్రెస్‌ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో చోటుచేసుకోబోయే పరిణామాలపై ఆసక్తి నెలకొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: EhaTV Telugu News