Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
MLA PA  : ఉద్యోగాల పేరుతో రూ.6 కోట్ల దందా.. భద్రాచలం ఎమ్మెల్యే పీఏ పరారీ!

MLA PA : ఉద్యోగాల పేరుతో రూ.6 కోట్ల దందా.. భద్రాచలం ఎమ్మెల్యే పీఏ పరారీ!

EhaTV 1 week ago

ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను నమ్మబలికి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భద్రాచలం ఎమ్మెల్యే పీఏ పరారయ్యాడు.

ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో గురువారం పలువురు బాధితులు పోలీసులను, ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావును కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే సుమారు రూ.6 కోట్ల మేర వసూళ్లు జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లు సమాచారం. ఏపీలోనూ బాధితులు ఉన్నట్లు తెలుస్తుండటంతో ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అధికార పార్టీలో పలుకుబడి ఉందంటూ నమ్మబలికి..

ఎమ్మెల్యే భారాస తరఫున గెలిచి అనంతరం కాంగ్రెస్‌లో చేరిన నేపథ్యంలో ప్రభుత్వంలో తనకు ప్రత్యేక పలుకుబడి ఉందని పీఏ నిరుద్యోగులకు చెప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మణుగూరు, బూర్గంపాడు, అశ్వాపురం తదితర ప్రాంతాల్లోని సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురిని నమ్మించినట్లు సమాచారం. ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరి నుంచి రూ.10 లక్షలకు పైగా వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొందరు నాయకులు సైతం ఈ మోసానికి బాధితులైనట్లు తెలుస్తోంది.

రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు..

ఓ ఆటోవాలా తన బంధువుకు ఉద్యోగం ఇప్పించేందుకు రూ.10 లక్షలు ఇచ్చినట్లు సమాచారం. ఓ ప్రముఖుడు టెక్నికల్‌ ఇంజినీర్‌ పోస్టు కోసం రూ.30 లక్షలు ఇచ్చినట్లు తెలిసింది. గ్రామ పంచాయతీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి కూడా రూ.10 లక్షలు చెల్లించినట్లు సమాచారం. అదేవిధంగా ఓ మహిళ నుంచి రూ.10 లక్షలు తీసుకున్న పీఏ.. ఆమె ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో కొంత మొత్తాన్ని తిరిగి ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఖమ్మం నుంచి శ్రీకాకుళం వరకు..

పీఏ ఉద్యోగాల పేరుతో తనకు పరిచయమున్న మణుగూరు, పరిసర ప్రాంతాల్లోనే కాకుండా.. తన అత్తవారిల్లు ఉన్న శ్రీకాకుళం ప్రాంతంలోనూ పలువురి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో బాధితుల సంఖ్య, వసూలైన మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం.

ఎమ్మెల్యేను కలిసిన బాధితులు

వ్యవహారం బయటకు రావడంతో బాధితులు గురువారం ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావును కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఉద్యోగాల కోసం డబ్బులు చెల్లించామని, తమను మోసం చేశారని ఆరోపిస్తూ న్యాయం చేయాలని కోరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాధితులు తనను కలిసి విషయం చెప్పారని, వెంటనే పోలీసు ఉన్నతాధికారులకు పరిస్థితిని వివరించినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తన పీఏను సరెండర్‌ చేయాలని అధికారులను కోరినట్లు వెల్లడించారు. ఉద్యోగాల కోసం ఎవరూ ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దని ఎమ్మెల్యే సూచించారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు.

డీఎస్పీ అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసి, పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని తెలిపారు. పీఏ ఎక్కడ ఉన్నాడు? ఎంతమంది నుంచి డబ్బులు తీసుకున్నాడు? ఎంత మొత్తం వసూలు చేశాడు? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగనుంది. ఉద్యోగం ఇప్పిస్తానంటూ డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలపై పూర్తి దర్యాప్తు అనంతరం వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: EhaTV Telugu News