గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా అందకపోయినా పేదల సొంతింటి కలను సాకారం చేయడంలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం వెనక్కి తగ్గదని ప్రభుత్వం స్పష్టం చేసింది.గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్నామని, పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎలాంటి నిధులు విడుదల కాలేదని తెలిపింది.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను పలుమార్లు కలిసి తెలంగాణకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారని పేర్కొంది.
రాష్ట్రానికి కేంద్ర మంత్రి వచ్చిన సందర్భంగా రెండు వారాల క్రితం పార్లమెంట్ సభ్యులతో కలిసి తాను కూడా కేంద్ర మంత్రిని కలిసి ఇదే అంశంపై విజ్ఞప్తి చేసినట్లు తెలిపింది. అయినప్పటికీ కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదని వెల్లడించింది.ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులు చివరి బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా పేదల సొంతింటి కలను నెరవేర్చడాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపింది.
15,475 మంది లబ్ధిదారులకు రూ.185 కోట్లు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకున్న 15,475 మంది లబ్ధిదారులకు రూ.185 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మార్చి 31వ తేదీ వరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు చివరి బిల్లుల మొత్తాన్ని గురువారం వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించింది.మిగిలిన లబ్ధిదారులకు కూడా విడతల వారీగా బిల్లులు చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. చివరి బిల్లు ఇంకా అందని లబ్ధిదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది.పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, కేంద్రం నుంచి సహకారం లేకపోయినా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గదని స్పష్టం చేసింది.

