తల్లిప్రేమ అంటే ప్రాణం అని చెప్పుకుంటాం. బిడ్డకు చిన్న గాయం అయినా తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. కానీ రాజస్థాన్‌లో జరిగిన ఓ ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది.
కన్నతల్లే తన ఎనిమిది నెలల పసికందుపై అమానుషంగా ప్రవర్తించింది
రాజస్థాన్‌లోని ఖైర్తల్-తిజారా ప్రాంతంలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆడుకుంటూ ఉండాల్సిన ఎనిమిది నెలల చిన్నారి ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాల కోసం పోరాడుతోంది. పోలీసుల వివరాల ప్రకారం.. చిన్నారి తల్లి బలవంతంగా యాసిడ్ తాగించిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో చిన్నారి నోరు, ముక్కు నుంచి రక్తస్రావం కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటన సోమవారం భివాడి ప్రాంతంలో చోటుచేసుకుంది. చిన్నారి తండ్రి మోహిత్ పనికి వెళ్లగా, ఇంట్లో తల్లి-కూతురు మాత్రమే ఉన్నారు. అదే సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చిన్నారి పరిస్థితి విషమించడంతో మొదట ప్రభుత్వ ఆస్పత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోంది.
ఆస్పత్రి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. "తన భార్యే కుమార్తెకు యాసిడ్ తాగించిందని తండ్రి ఫిర్యాదు చేశాడు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది" అని అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ వేద్ ప్రకాశ్ తెలిపారు. ఈ ఘటన వెనుక అసలు కారణాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అమాయక చిన్నారిపై జరిగిన ఈ దారుణం స్థానికంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.

