రాష్ట్రంలో పొగాకు రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించనున్నారు.
ఉదయం 10.30 గంటలకు అక్కడికి చేరుకుని కొనుగోళ్ల తీరును పరిశీలించడంతో పాటు రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు.
రైతులు ఎదుర్కొంటున్న సాగు సమస్యలు, గిట్టుబాటు ధరలు, కొనుగోళ్లలో ఎదురవుతున్న ఇబ్బందులు, దళారుల ప్రభావం తదితర అంశాలపై రైతుల నుంచి నేరుగా వివరాలు తెలుసుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పొగాకు రైతులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది.
రెండు సీజన్లలో రూ.3 వేల కోట్లకు పైగా నష్టం
వైఎస్సార్‌సీపీ ఆరోపణల ప్రకారం, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గత రెండు సీజన్లలో పొగాకు రైతులు రూ.3 వేల కోట్లకు పైగా నష్టపోయారని పేర్కొంది. పంట సాగుకు చేసిన పెట్టుబడులు కూడా తిరిగి రాక అనేక మంది రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించింది.
కిలోకు రూ.60-70 వరకు నష్టమంటున్న రైతులు
ఈ సీజన్‌లో పొగాకు ధరలు గణనీయంగా పడిపోవడంతో రైతులు కిలోకు రూ.60 నుంచి రూ.70 వరకు నష్టపోతున్నారని పార్టీ వెల్లడించింది. గత సీజన్‌లో సరాసరి ధర రూ.248.66 ఉండగా, ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన వేలాల్లో సరాసరి ధర రూ.214.19కు పరిమితమైందని తెలిపింది. హై క్వాలిటీ పొగాకుకు రూ.240, మీడియం గ్రేడ్‌కు రూ.190, లో గ్రేడ్‌కు రూ.110 మాత్రమే ధర లభిస్తోందని పేర్కొంది. అలాగే గతంలో ప్రతిరోజూ వేలం వివరాలు రైతులకు అందుబాటులో ఉండేవని, ఇటీవల ఆ సమాచారాన్ని నిలిపివేయడంతో పారదర్శకత దెబ్బతిందని ఆరోపించింది.
రాష్ట్రంలో ప్రస్తుతం పొగాకు కొనుగోళ్లలో దళారుల వ్యవస్థ బలపడిందని వైఎస్సార్‌సీపీ విమర్శించింది. కొనుగోలు కేంద్రాల్లో పోటీ లేకపోవడం వల్ల రైతులు తక్కువ ధరలకు పంటను విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించింది. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయడంతో పాటు రైతు భరోసా కేంద్రాల ద్వారా కనీస మద్దతు ధరల అమలుపై ప్రత్యేక వ్యవస్థను రూపొందించామని వైఎస్సార్‌సీపీ పేర్కొంది. మార్కెట్‌లో ధరలు పడిపోతే అధికారులు వెంటనే జోక్యం చేసుకుని కొనుగోళ్లు చేపట్టే విధానం అమల్లో ఉండేదని, ప్రస్తుతం ఆ వ్యవస్థ లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారని ఆరోపించింది. దేవరపల్లి పర్యటనలో రైతుల సమస్యలను స్వయంగా తెలుసుకున్న అనంతరం ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకువచ్చేందుకు కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

