Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Dooradarshini Review in Telugu: దూరదర్శని సినిమా రివ్యూ & రేటింగ్!

Dooradarshini Review in Telugu: దూరదర్శని సినిమా రివ్యూ & రేటింగ్!

FilmyFocus 1 week ago

ప్రతివారం లానే ఈ వారం కూడా కొన్ని చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అందులో 'దూరదర్శని' ఒకటి. ఈరోజే (మే 15న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా.

కేవలం టైటిల్‌తోనే 90’s ఆడియన్స్‌కు ఒక మంచి నోస్టాల్జిక్ ఫీల్ కలిగించారు మేకర్స్. కథ కూడా ఆ తరం వారికి కచ్చితంగా నచ్చుతుందని, అందరినీ అలరిస్తుందని ప్రమోషన్స్‌లో ధీమాగా చెప్పారు. మరి వారి నమ్మకం ఎంతవరకు నిజమైంది? ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు రంజింపజేసింది? తెలుసుకుందాం రండి:

Dooradarshini Movie Review

కథ: హరి (సువిక్షిత్ బొజ్జ) వెనుకబడిన కులానికి చెందిన పేద యువకుడు. తన తండ్రి ఆర్థిక స్తోమతను అర్థం చేసుకున్న హరి, పట్నం వెళ్లి పెద్ద చదువులు చదవడానికి ఇష్టపడడు. ఊర్లోనే ఉన్న ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటూ తల్లిదండ్రులకు అండగా ఉండాలని నిర్ణయించుకుంటాడు.మరోవైపు, హరి అదే ఊరికి చెందిన సంపన్న కుటుంబానికి చెందిన వాణిని (గీతిక రతన్) ప్రేమిస్తాడు. ఆమె కూడా అతడిని ప్రాణంగా ప్రేమిస్తుంది. వాళ్ళ ఇంట్లో టీవీలు లేకపోవడంతో, వీరిద్దరూ వేరే వాళ్ళ ఇంటికి వెళ్లి టీవీ చూస్తుంటారు. ముఖ్యంగా దూరదర్శన్‌లో ప్రసారమయ్యే ‘చిత్రలహరి’ ప్రోగ్రాం అయ్యే వరకు, ఒకరినొకరు చూసుకుంటూ తమ ప్రేమ లోకంలో విహరిస్తుంటారు.అయితే, ఆ టీవీ యజమాని పేక రాజు (భాస్కర్ గొడుగునూర్) ఓ స్త్రీ లోలుడు.

ఊర్లో ఉన్న ఆడవాళ్ళపై అతని కన్ను పడింది అంటే వాళ్ళని అనుభవించకుండా వదలడు. ఒకానొక సమయంలో వాణిపై అతని కన్ను పడుతుంది. ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలని దురాశపడతాడు. అయితే ఆమె హరిని ప్రేమిస్తుందన్న విషయం పేక రాజుకి తెలుస్తుంది. దీంతో హరిపై పగ పెంచుకుంటాడు. కుట్ర పన్ని వాణి అన్నయ్యకి (మేడపాటి విజయ్ కృష్ణారెడ్డి), హరి కుటుంబానికి మధ్య గొడవలు సృష్టిస్తాడు. ఈ గొడవ కాస్తా ఊరిలో కులచిచ్చుగా మారుతుంది.ఈ పరిస్థితుల నడుమ తమ ప్రేమను కాపాడుకోవడం కోసం హరి, వాణి ఊరు వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటారు. మరి అలా వెళ్లిన వారి జీవితాలు ఏమయ్యాయి? కుల వివక్షను, పేక రాజు కుట్రలను దాటి వారు ఎలా ఒకటయ్యారు? అనేదే మిగిలిన కథ.

నటీనటుల పనితీరు: హీరో సువిక్షిత్ బొజ్జ లుక్స్ చాలా నీరసంగా ఉన్నాయి.దానికి తోడు అతని డ్రెస్సింగ్ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేదు. క్లోజప్ షాట్స్ తీయడానికి దర్శకుడు, కెమెరామెన్ కూడా ఇబ్బంది పడ్డారనే విషయం సినిమా చూస్తున్న ప్రేక్షకులకు మొదటి సీన్ నుండే అర్థమైపోతుంది. కనీసం ఒక్క సీన్‌లో కూడా సువిక్షిత్ నటన సిన్సియర్‌గా అనిపించదు. నటనలో అతను ఇంకా చాలా పరిణితి చెందాల్సిన అవసరం ఉంది. సొ ఈ పాత్రకి అతను ఫిట్ అవ్వలేదు అని మనం అర్దం చేసుకోవచ్చు. ఇక హీరోయిన్ గీతిక రతన్ విషయానికొస్తే.. ఒకటి రెండు సీన్లలో తన లుక్స్‌తో మెరిసినా, నటన పరంగా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే, హీరో తండ్రి పాత్ర పోషించిన కిట్టయ్య మరోసారి తన హానెస్ట్ పెర్ఫార్మెన్స్‌తో మెప్పించారు. అలాగే బాలరాజు, భద్రం, జెమినీ సురేష్ వంటి వారు తమ తమ పాత్రల పరిధి మేరకు న్యాయం చేశారు అని చెప్పాలి.

సాంకేతిక నిపుణుల పనితీరు: ఇటీవలే వచ్చిన ‘తిమ్మరాజుపల్లి TV’ సినిమా ఛాయలు ఈ ‘దూరదర్శిని’లో చాలా కనిపిస్తాయి. ఆ సినిమాలో మాదిరిగానే, ఇక్కడ కూడా హీరో హీరోయిన్లు వేరే వాళ్ళ ఇంట్లో టీవీ చూడటానికి వెళ్లి ప్రేమలో పడతారు. కేవలం ప్రారంభమే కాదు, ఆ తర్వాత వచ్చే కాన్ఫ్లిక్ట్ పాయింట్ కూడా చాలా సిమిలర్ గా అనిపిస్తుంది.అంతేకాకుండా అంతకు ముందు వచ్చిన ‘డెకాయిట్’ సినిమా కూడా మనకు గుర్తొస్తుంది. అందులో హీరోయిన్‌పై మోజు పడ్డ వ్యక్తి, హీరో హీరోయిన్లను విడగొట్టడానికి కులం ప్రస్తావన తెచ్చి వాళ్ళ అన్నను రెచ్చగొడతాడు. దాదాపు ఇదే పాయింట్ ‘దూరదర్శిని’లో కూడా ఉండటంతో ప్రేక్షకులకు ఎక్కడా కొత్తదనం అనిపించదు.పోనీ కథనం ఏమైనా బాగుందా అంటే.. ఒక్కో సీన్ చాలా నెమ్మదిగా సాగుతూ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది.

ఫస్టాఫ్ ముగిసేసరికే ప్రేక్షకుల ఓపిక నశించిపోతుంది. ఇక సెకండాఫ్ కూడా అదే మూడ్‌లో నీరసంగా మొదలవుతుంది. ఏ దశలోనూ కథ ఆసక్తికరంగా మారదు. బలవంతంగా చొప్పించిన ఎమోషనల్ సీక్వెన్స్‌లు కథను ఎక్కడికెక్కడికో తీసుకెళ్తుంటాయి. క్లైమాక్స్ లో ఇచ్చే ట్విస్ట్ ఆకట్టుకోకపోగా.. ‘ఇదొక్కటి తక్కువైంది’ అని ప్రేక్షకులు సెటైర్లు వేసుకునేలా ఉంది. కేవలం 2 గంటల 5 నిమిషాల నిడివి ఉన్నప్పటికీ, సినిమా ఇంత సాగతీతగా ఉంటుందని ఎవరూ ఊహించరు. ఇక పాటల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.సినిమాలో ఏమైనా ప్లస్ పాయింట్స్ ఉన్నాయా అంటే, అది సినిమాటోగ్రఫీ మాత్రమే. 90ల నాటి గోదావరి అందాలను, ఆ వాతావరణాన్ని కొన్ని చోట్ల చాలా సహజంగా చూపించారు. దీనికి ప్రొడక్షన్ టీమ్ సపోర్ట్ కూడా తోడై ఉండొచ్చు.

విశ్లేషణ: 90వ దశకం నాటి కథాంశం, గోదావరి నేపథ్యం అనగానే ప్రేక్షకులకు ‘కమిటీ కుర్రోళ్లు’ వంటి రీసెంట్ హిట్స్ గుర్తుకురావడం సహజం. బహుశా ఆ స్థాయి విజయాన్ని అందుకోవాలనే స్ఫూర్తితోనే మేకర్స్ ఈ ‘దూరదర్శని’ చిత్రాన్ని తెరకెక్కించి ఉండవచ్చు. కానీ ‘కమిటీ కుర్రోళ్లు’ పండించిన రూటెడ్ ఎమోషన్స్‌ని గానీ, ఆ మధురమైన నోస్టాల్జిక్ ఫీల్‌ని గానీ అందించడంలో ‘దూరదర్శిని’ దర్శకుడు విఫలమయ్యాడు. సరైన భావోద్వేగాలు పండకపోవడంతో, ‘దూరదర్శని’ ఒక నిష్ఫల ప్రయత్నంగానే మిగిలిపోతుంది.

ఫోకస్ పాయింట్: నోస్టాల్జిక్ ఫీల్‌ మిస్ అయ్యింది

రేటింగ్: 1.5/5

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu