Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తరాలకు తరగని అప్పులు చేశారు

తరాలకు తరగని అప్పులు చేశారు

For Money 2 weeks ago

2027 మార్చి నెలాఖరుకు కేంద్ర ప్రభుత్వం అప్పు రూ. 218 లక్షల కోట్లకు చేరుతుందని తాజా బడ్జెట్‌లో ప్రకటించారు. ఒక్క వడ్దీల కోసమే ఏటా రూ. 14 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది కేంద్రం.

మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో కేంద్ర రుణ భారం రూ. 50 లక్షల కోట్లు. అంటే దాదాపు మూడురెట్లకు పైగా పెరిగిందన్నమాట. మన దేశ ఏడాది సంపద అంటే జీడీపీలో 56 శాతానికి సరిపడా అప్పులు చేశారు.

ఇటీవల పశ్చిమాసియా యుద్ధం కారణంగా క్రూడ్‌ ధరలు పెరిగాయని కేంద్రం అంటోంది. కాని మన్మోహన్‌ సింగ్‌ హయంలో బ్యారెల్‌ క్రూడ్‌ ధర 120 డాలర్లను దాటింది. అలాగే మోదీ హయాంలో కూడా. అపుడు లేని సమస్య ఇపుడు ఎందుకు వస్తోంది?

మోదీ ప్రభుత్వానికి దూరదృష్టి లేకపోవడంతో డాలర్ల కొరత తీవ్రమై…. డాలర్‌తో రూపాయి విలువ ఆల్‌టైమ్‌ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఒకదశలో క్రూడ్‌ కొనేందుకు, వడ్డీలు చెల్లించేందుకు డబ్బులు లేవా అన్నంత స్థాయిలో రూపాయి పడిపోయింది. ఆర్బీఐ తరచూ రూపాయిని కాపాడేందుకు డాలర్లను అమ్మింది.

అయితే అమ్మేందుకు సరిపడా డాలర్లు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. చివరికి ఫార్వర్డ్‌ కాంట్రాక్ట్‌ల రూపంలో డాలర్లు చెల్లించినా సరిపోలేదు. మున్ముందు మరింత గడ్డు పరిస్థితి ఉందని గ్రహించిన కేంద్రం ఇపుడు విదేశాల్లో ఉన్న ఎన్నారైల నుంచి అప్పు తీసుకోవడం ప్రారంభించింది. గత కొన్నేళ్ళుగా ఎన్నారైలు నిధులు పంపడం తగ్గించారు.

అమెరికాతో పాటు గల్ఫ్‌ దేశాల నుంచి డాలర్ల వరద తగ్గడంతో ఎన్నారైల నుంచి డాలర్ల కోసం డిపాజిట్ల వల చేసింది. భారీ వడ్డీతో డాలర్ల డిపాజిట్లను ఆహ్వానించింది. FCNR (B) కింద డిపాజిట్లు వసూలు చేయమని బ్యాంకులపై ఒత్తిడి తెచ్చింది. స్పెషల్‌ స్కీమ్‌ ప్రారంభించింది.

జూన్‌ /వ తేదీన ప్రారంభమైన ఈ స్కీమ్‌ కింద బ్యాంకులు ఏకంగా 6.5 శాతం వడ్డీ ఆఫర్‌ చేశాయి. వాస్తవానికి ఈ డిపాజిట్లపై వడ్దీ 3.5 శాతం నుంచి 4 శాతం దాకా ఉంటుంది. కాని 6.5 శాతం వడ్డీని ఆఫర్‌ చేయడంతో పాటు … వడ్డీపై పన్నులు ఉండని చెప్పింది. (దేశీయంగా మన ప్రజలు కట్టే ఎఫ్‌డీలపై వచ్చే వడ్డీపై మాత్రం పన్నులు వసూలు చేస్తోంది) ఈ లెక్కన ఎన్నారైలకు వడ్డీ ఏడు శాతం పైనే గిట్టుబాటు అవుతుంది.

ఈ డిపాజిట్లపై రుణాలు ఇచ్చేందుకు కూడా ఆర్బీఐ అనుమతించింది. అలాగే భారత దేశంలో వచ్చే వడ్డీని విదేశాలకు తీసుకెళ్ళేందుకు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ రుణాల విషయంలో నష్టం వస్తే తాను హెడ్జింగ్‌ చేసి సాయం చేస్తానని బ్యాంకులకు ఆర్బీఐ హామి కూడా ఇచ్చింది. దీంతో భారీ ఎత్తున డాలర్లను సేకరించాయి బ్యాంకులు.

ప్రస్తుతానికి డాలర్ల కొరత తీరింది. స్పెషల్‌ స్కీమును గడువుకు ముందే ఆగస్టు 31వ తేదీతో ముగిసింది. ఈ స్కీమ్‌ కింద 13,600 కోట్ల డాలర్లు సమీకరించినట్లు ఆర్బీఐ ప్రకటించింది. అంటే ఆ మేరకు కొత్త అప్పు చేసిందన్నమాట.

ఇప్పటికే చేసిన రుణాలు, ఇపుడు కొత్తగా విదేశీ రుణాలపై వడ్డీ భారం ఎంత పడుతుందో? ఇపుడైనా రూపాయి గట్టిగా నిలబడుతుందా అంటే చెప్పలేని స్థితి. మున్ముందు పరిస్థితి బాగుంటుందనే నమ్మకం ఆర్థికవేత్తల్లో కన్పించడం లేదు. గత ఏడాది జీడీపీ డేటాను తగ్గించి… ఈ ఏడాది జీడీపీ భారీగా పెరిగినట్లు కలరింగ్‌ ఇచ్చింది కేంద్రం.

దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో జీడీపీని తగ్గించిన మాట నిజమేనని కేంద్ర ప్రభుత్వం బహిరంగంగా అంగీకరించింది. కాకపోతే అంతర్జాతీయ పద్ధతులకు అనుగుణంగా చేసినట్లు చెప్పుకొచ్చింది. ఇపుడు తమ ఎగుమతులను కాపాడుకునేందుకు ఐటీ కంపెనీలు నానా తంటాలు పడుతున్నాయి. ఎందుకంటే ఐటీ ఎగుమతులు తగ్గితే మనకు డాలర్ల ప్రవాహం తగ్గుతుంది.

మరోవైపు చైనా నుంచి భారీ ఎత్తున దిగుమతులు వస్తున్నాయి. వాటికీ డాలర్లు కావాలి. ఇపుడు కొత్తగా తెచ్చిన డాలర్లు ఎన్నాళ్ళు రూపాయిని కాపాడుతాయో చూడాలి. ఎందుకంటే నిన్న కూడా రూపాయిని స్థిరంగా ఉంచేందుకు ఓపెన్‌ మార్కెట్‌లో డాలర్లను ఆర్బీఐ అమ్మింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: For Money