తెలుగు సినీ పరిశ్రమను పైరసీ భూతం మరోసారి కలవరపెడుతోంది. సినిమా విడుదలైన రోజే పైరసీకి గురికావడం చిత్ర పరిశ్రమలో ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఆకాశంలో ఒక తార సినిమాతో పాటు మరో మూడు చిత్రాలు కూడా పైరసీ బారినపడ్డాయి.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వివరాల్లోకి వెళ్తే.. 'ఆకాశంలో ఒక తార', 'రణబాలి', 'ఆదర్శ కుటుంబం', 'కల్ట్' సినిమాలను కొందరు దుండగులు థియేటర్లలో రహస్యంగా చిత్రీకరించినట్లు గుర్తించారు. కర్నూలులోని సిటీ స్క్వేర్ మాల్ థియేటర్‌లో ఈ సినిమాలను మొబైల్ ఫోన్లు లేదా ఇతర పరికరాలతో రికార్డు చేసినట్లు అనుమానిస్తున్నారు. అనంతరం ఆయా చిత్రాల పైరసీ కాపీలను go2.india4moviee.click అనే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసినట్లు గుర్తించారు.
ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్.. సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేసింది. థియేటర్లలో రహస్యంగా సినిమాలను చిత్రీకరించి, వాటిని ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పైరసీ వెనుక ఎవరున్నారు? సినిమాలను థియేటర్లలో చిత్రీకరించిన వ్యక్తులు ఎవరు? వెబ్‌సైట్‌లో కాపీలను అప్‌లోడ్ చేసింది ఎవరు? అనే కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
తెలుగు సినీ పరిశ్రమను పైరసీ భూతం మరోసారి కలవరపెడుతోంది. సినిమా విడుదలైన రోజే పైరసీకి గురికావడం చిత్ర పరిశ్రమలో ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఆకాశంలో ఒక తార సినిమాతో పాటు మరో మూడు చిత్రాలు కూడా పైరసీ బారినపడ్డాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

