Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
200 కోట్ల పల్లకి - ఇరుముడి పరుగు ఎక్కడికి

200 కోట్ల పల్లకి - ఇరుముడి పరుగు ఎక్కడికి

Gulte.com 2 weeks ago

టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలో కొన్ని సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అంచనాలకు అతీతంగా, లెక్కలకు అందకుండా అవి చేసే అద్భుతాల గురించి ఎప్పుడు విన్నా అబ్బురంగా ఉంటుంది.

పాతిక సంవత్సరాల క్రితం నువ్వే కావాలి వచ్చినప్పుడు అది రెండు వందల రోజులు ఆడుతుందని, స్టార్ హీరోల వల్ల మాత్రమే సాధ్యమయ్యే రికార్డులు బద్దలు కొడుతుందని ఎవరూ ఊహించలేదు. అయినా చరిత్ర సృష్టించింది. ప్యాన్ ఇండియా ట్రెండ్ లో ఇలాంటివి మనకు చాలా అరుదైపోయాయి.

గత నెల విడుదలైన ఇరుముడి మరోసారి గతాన్ని గుర్తు చేస్తోంది. ఇరవై రోజులు కాకుండానే సగర్వంగా రెండు వందల కోట్ల క్లబ్బులో అడుగు పెట్టి విజయ కేతనం ఎగరేసింది. చాలా చోట్ల చిన్న సెంటర్లలో ఒక సినిమా వారం ఆడితే గొప్పనుకునే టైంలో, పదమూడు రోజులకు కూడా ఇంకా మంచి ఆక్యుపెన్సీలు నమోదు చేయడం చూసి బయ్యర్లకు నోట మాట రావడం లేదు. రూపాయికి అయిదు రూపాయల లాభం గురించి వినడమే కానీ ఈ మధ్య కాలంలో అది చేసి చూపించింది ఇరుముడినే.

ఇప్పటికీ పలు చోట్ల జనం తండోప తండాలుగా వస్తున్నారు. కొన్ని థియేటర్లలో షోలు లేవంటే గొడవలు జరిగాయి. మక్తల్ లో ఏకంగా ఆడియన్స్ ధర్నా చేసే దాకా వెళ్ళింది. టాక్సిక్ సైతం దీని తాకిడి తట్టుకోలేక తన సింగల్ స్క్రీన్లను వెనక్కు ఇవ్వాల్సి వచ్చింది. పిల్లా పీచు చిన్నా పెద్దా అందరూ బండ్లు కట్టుకుని, వాహనాలు వేసుకుని మరీ ఇరుముడికి వెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నో వైరలయ్యాయి. ఇవన్నీ ఫ్యూచర్ లో కథలుగా చెప్పుకునే జ్ఞాపకాలే.

ఇక్కడితో ఇరుముడి పరుగు అయిపోలేదు. ఇంకో వీకెండ్ రవితేజకు స్వాగతం చెబుతోంది. కొత్త రిలీజులు బోలెడు ఉన్నా సరే సెలవు వస్తే చాలు ఫ్యామిలీలు ఇరుముడికి వెళ్లిపోతున్నాయి. చూడని వాళ్ళు ఓటిటి వరకు ఆగడం లేదు. ఒకసారి థియేటర్ ఎక్స్ పీరియన్స్ కావాలని గంపగుత్తగా టికెట్లు కొనేసుకుంటున్నారు. చూస్తుంటే 250 కోట్ల వరకు ఇరుముడి అలిసిపోయేలా లేదు. రవితేజ, శివ నిర్వాణ, మైత్రి నిర్మాతలు, జివి ప్రకాష్ కుమార్ మొదలైనవాళ్ళకు ఈ సక్సెస్ ఇచ్చిన కిక్కు వెయ్యి ఏనుగుల బలంతో సమానం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu