Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
3 రోజులుగా పార్టీ ఆపీస్ లోనే మాజీ ఎంపీ

3 రోజులుగా పార్టీ ఆపీస్ లోనే మాజీ ఎంపీ

Gulte.com 2 weeks ago

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయం వద్ద శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను బీఆర్ఎస్ కార్యకర్తల నిరసనల మధ్య పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.

ఈ సందర్భంగా బాల్క సుమన్ ను ఎక్కించిన పోలీసు వాహనాన్ని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే యత్నం చేశాయి.

ఫలితంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే…గడచిన మూడు రోజులుగా బీఆర్ఎస్ కార్యాలయం వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు సుమన్ ఏకంగా మూడు రోజులుగా బీఆర్ఎస్ కార్యాలయంలోనే ఉండిపోయారు.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన బాల్క సుమన్.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత. పెద్దపల్లి ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత చెన్నూరు ఎమ్మెల్యేగానూ ఆయన ఓ పర్యాయం ఎమ్మెల్యేగా గెలిచారు. 2023 ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు.

బీఆర్ఎస్ కూడా అదికార పక్షం నుంచి విపక్షంగా మారిపోయింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ తరఫున గట్టిగా వాయిస్ వినిపిస్తున్న సుమన్… తాజాగా సింగరేణికి సంబంధించి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయగా… ఆ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన తెలంగాణ సర్కారు ఆయనపై కేసు నమోదు చేసింది.

సుమన్ పై నాంపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాగానే… అరెస్టు నుంచి తప్పించుకునే దిశగా సుమన్ తనదైన శైలి ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించారు. ఈ క్రమంలో ఎక్కడ ఉన్నా తనకు రక్షణ దొరకదన్న భావనతో సుమన్ నేరుగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ చేరుకున్నారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో సుమన్ ఆఫీస్ లోపలే ఉండపోగా… బయటకు రాగానే ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు అక్కడే తిష్ట వేశారు. ఈ తరహా హైడ్రామా ఏకంగా మూడు రోజుల పాటు కొనసాగింది. ఎంతకీ పోలీసులు అక్కడి నుంచి వెళ్లకపోవడంతో సుమన్.. మూడు రోజుల పాటు పార్టీ కార్యాలయంలోనే ఉండిపోవడం గమనార్హం.

బీఆర్ఎస్ ఆఫీస్ లోనే ఉన్న సుమన్.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై ఇప్పటిదాకా కోర్టులో విచారణ జరగలేదు. ఈ క్రమంలో ఇక బయటకు రాక తప్పదన్న భావనతో సుమన్ శనివారం బీఆర్ఎస్ ఆఫీస్ బయటకు వచ్చారు. అప్పటికే అక్కడకు చేరుకున్న మీడియాతో ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తనను ఉద్దేశపూర్వకంగానే అరెస్టు చేస్తోందని ఆరోపించారు. చట్టంపై తనకు గౌరవం ఉందని, అందుకే విచారణాధికారులకు సహకరిస్తానని ప్రకటించారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు సుమన్ ను నాంపల్లి పీఎస్ కు తరలించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu