చిన్న సినిమాల్లో విషయం ఉంటే ఆదరణ దక్కి తీరుతుంది. ఈ విషయంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. సీతాకోకచిలుక నుంచి లిటిల్ హార్ట్స్ దాకా ఈ విషయం కొన్ని వందల సార్లు ఋజువయ్యింది.
అయితే కంటెంట్ ఉంటేనే ఇది సాధ్యమవుతుందనే వాస్తవాన్ని మర్చిపోకూడదు. అందులోనూ ఒక పెద్ద డైనోసర్ లాంటి సినిమా పోటీలో ఉన్నప్పుడు ఆచితూచి అడుగులు వేయాలి. లేదంటే క్రష్ అయిపోవడం ఖాయం. మొన్న శుక్రవారం విడుదలైన అనుమాన పక్షి ఇదే ఋజువు చేస్తోంది.
సినిమా బండితో పాపులారిటీ తెచ్చుకున్న రాగ్ మయూర్ హీరోగా రూపొందిన ఎంటర్ టైనర్ ఈ మూవీ. అసలు పాయింట్ ఇది కాదు. డీజే టిల్లు లాంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చిన విమల్ కృష్ణ దర్శకత్వం వహించడం అంతో ఇంతో జనం దృష్టిలో పడేలా చేసింది. పైగా ప్యారడైజ్ మీద విపరీతమైన హైప్ ఉందని తెలిసి కూడా కేవలం ఒక రోజు గ్యాప్ లో దాంతో తలపడటం చూసి జనాలు ఆశ్చర్యపోయారు. కట్ చేస్తే సెప్టెంబర్ 25 అనుమాన పక్షి వచ్చిన సంగతే పబ్లిక్ కి అంతగా తెలియకుండా పోయింది.
ప్రతి విషయాన్ని అనుమానంతో చూసే యువకుడు సన్నీ అనుకోకుండా కాశ్మీర్ వెళ్లాల్సి వస్తుంది. అక్కడో అమ్మాయిని ప్రేమిస్తాడు. హఠాత్తుగా ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఒకడు హత్యకు గురవుతాడు. ఈలోగా వైజాగ్ నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ వాసు సతీసమేతంగా హాలిడే వెకేషన్ కోసం కాశ్మీర్ వస్తాడు. శవం కనిపించకుండా హీరో పడే పాట్లు, అసలు మర్డర్ ఎవరు చేశారో అంతుచిక్కని వైనం చుట్టూ స్టోరీ రాసుకున్నారు విమల్ కృష్ణ. కథాపరంగా ఎలాంటి కొత్తదనం ఉండదు.
ఆర్టిస్టులు ఎందరు ఉన్నా కథాకథనాల్లో బలం లేకపోతే ఏమవుతుందో చెప్పడానికి అనుమాన పక్షి మంచి ఉదాహరణగా నిలుస్తుంది. హీరోకో అవలక్షణం పెట్టేసి దాని చుట్టూ క్రైమ్ కామెడీ అల్లడానికి చూసిన దర్శకుడు కనీస స్థాయిలో మెప్పించలేకపోయాడు. మళయాళం నుంచి వచ్చిన హీరోయిన్ మెరైన్ ఫిలిప్ కు నిరాశ తప్పలేదు. నిన్న ఆదివారమే అయినా చాలా చోట్ల కనీస ఆక్యుపెన్సీలు నమోదు చేయలేకపోయిన అనుమాన పక్షి ఎలాంటి అనుమానం రాకుండానే అంతర్ధానమయ్యేలా ఉంది.

