వైసీపీ హయాంలో పథకాలను అమలు చేశారు. జగన్ చెప్పిన లెక్క ప్రకారం.. 2.5 లక్షల కోట్ల రూపాయలను ప్రజలకు పంచారు. తద్వారా.. డబ్బులైతే.. ప్రజలకు చేరాయి కానీ..
జగన్ వారి హృదయాల్లోకి చేరలేక పోయారన్న వాదన ఉంది. దీనికి కారణం.. బటన్!. కార్యక్రమం ఎలాంటిదైనా.. కేవలం తాడేపల్లికే పరిమితం కావడం.. లబ్ధిదారులనే తన వద్దకు పిలిపించుకోవడం.. జగన్ చేసిన కామన్ కార్యక్రమం. దీంతో జగన్ బటన్ ముఖ్యమంత్రిగా మిగిలిపోయారు.
ఆయన సొమ్ములు ఇవ్వలేదని ఎవరూ అనరు. సామాజిక పింఛన్ల నుంచి సంక్షేమ పథకాల దాకా.. జగన్ చాలానే సొమ్ములు ప్రజలకు ఇచ్చినా.. ఆ మేరకు ఆయనకు రావాల్సిన గ్రాఫ్ రాకుండా పోయింది. దీనికి కారణం.. బటన్ ముఖ్యమంత్రిగా ఆయన పేరు తెచ్చుకోవడమే. తద్వారా అప్పట్లో ఆయన చాలా గొప్పగా చేశానని భావించి ఉండొచ్చు. కానీ, క్షేత్రస్థాయిలో ఎన్నికల సమయానికి రివర్స్ అయింది. ప్రత్యర్థులు చేసిన బటన్ ప్రచారం దెబ్బ కొట్టింది.
కాగా.. నేడు అవే పథకాలను.. అదే సొమ్మును సీఎం చంద్రబాబు కూడా పంపిణీ చేస్తున్నారు. సామాజిక వర్గాలు, కుల వృత్తుల వారీగా కూడా.. సంక్షేమాన్ని అమలు చేస్తున్నారు. అయితే.. గతానికి ఇప్పటికి ఉన్న తేడా.. నాడు బటన్ పనిచేస్తే.. నేడు బాబు పనిచేస్తున్నారు. కేవలం డబ్బులు పంపిణీ చేయడమే కాదు.. లబ్ధిదారుల హృదయాల్లోనూ చోటు దక్కించుకుంటున్నారు. మా సీఎం.. మా చంద్రబాబు అని అనిపించుకుంటున్నారు. ఇది ఇప్పటికి ప్రశంసగా అనిపించొచ్చు.
కానీ, లాంగ్ స్టాండింగ్‌లో చూసుకుంటే.. ఎన్నికల సమయానికి ఇదే ఓట్ల రూపంలో రాల్చేస్తుంది. కేవలం డబ్బులు పంపిణీ చేయడమే కాదు.. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. వారి ఇళ్లలో టీ, కాఫీలతో పాటు.. తాజాగా భోజనం కూడా చేశారు. ఇవి చాలా వ్యూహాత్మకంగా నాయకుడికి.. ముఖ్యంగా సీఎంలకు ప్రజల్లో సానుకూల కోణాన్ని పెంచుతాయి. దీనికి గాను సీఎం చంద్రబాబు వెచ్చించిన సమయం కేవలం ఒక గంట మాత్రమే..కానీ.. అనేక గంటల మేలు ఆయనకు జరుగుతుందనడంలో సందేహం లేదు.

