Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భావోద్వేగాల ఆటలో 'పెద్ది' విధ్వంసం

భావోద్వేగాల ఆటలో 'పెద్ది' విధ్వంసం

Gulte.com 1 week ago

మెగా ఫ్యాన్స్ కళ్ళలో ఒత్తులు, ఫ్లడ్ లైట్లు వేసుకుని ఎదురు చూస్తున్న పెద్ది ట్రైలర్ వచ్చేసింది. ముంబైలో జరిగిన ఈవెంట్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్ తో పాటు ఇతర క్యాస్ట్ అండ్ క్రూ హాజరు కాగా మీడియా ముందు ఆవిష్కరించారు.

జూన్ 4 సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో అందరి కళ్ళు ఈ వీడియో మీదే ఉన్నాయి. ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్న అంచనాలని మరింత పెంచేందుకు ఇదే కీలకం కానుంది. ఈసారి స్టోరీ దాచకుండా చెప్పేశారు.

విజయనగరంలోని ఒక కొండప్రాంతం కింద ఉండే ఊరు పెద్ది (రామ్ చరణ్)ది. క్రికెట్, రన్నింగ్ రేస్, కుస్తీ ఆట ఏదైనా సరే గెలవడం తప్ప ఓడటం తెలియని మొండోడు. జనాన్ని కూలీలుగా మార్చి బానిసల్లా చూసే పెద్దోళ్లను ఎదిరించే పరిస్థితి పెద్దికి వస్తుంది. దీని వల్ల పోలీసులు ఊరి మీద పడి భీభత్సం చేస్తారు. దీంతో పెద్దికి ఢిల్లీ వెళ్లే కఠిన సవాల్ ఎదురవుతుంది. అసలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా చేసిన ప్రయాణంలో పెద్ది ఏమేం చేశాడో తెలియాలంటే ఇంకో పదిహేను రోజులు ఆగాలి.

రామ్ చరణ్ రియల్ స్టామినాని బుచ్చిబాబు రెట్టింపు స్థాయిలో పిండేసుకున్నారు. ఎమోషన్స్, యాక్షన్, ఫైట్స్ దేనికవే విపరీతమైన హైప్ పెంచేలా ఉన్నాయి. 1980 వాతావరణాన్ని పునః సృష్టించిన తీరు అద్భుతంగా ఉంది. జాన్వీ కపూర్ గ్లామర్ షోని బాగా వాడేశారు. శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యెందు, బోమన్ ఇరానీ తదితరులను రెండు మూడు షాట్స్ లో పరిచయం చేశారు. సింపుల్ గా చెప్పాలంటే పెద్ది పూర్తిగా రామ్ చరణ్ వన్ మ్యాన్ షోలాగా సాగిపోయింది.

టెక్నికల్ గా మాట్లాడుకుంటే పెద్దికి ఏఅర్ రెహమాన్ సంగీతం, రత్నవేలు ఛాయాగ్రహణం ఎంత పెద్ద దన్నుగా నిలబడనున్నాయో మూడు నిమిషాల కంటెంట్ లో స్పష్టంగా బయట పడింది. ముఖ్యంగా యాభై సంవత్సరాల వెనుకటి వింటేజ్ వైబ్స్ మళ్ళీ రీ క్రియేట్ చేయడం, దానికి తగ్గ బీజీఎమ్ కుదరడం పెద్ద ప్లస్ అయ్యాయి. దర్శకుడు బుచ్చిబాబు తన మీద పెట్టుకున్న నమ్మకానికి గ్యారెంటీ కార్డులా ఈ ట్రైలర్ ఉపయోగపడటంతో ఇక జూన్ 4 ఎలాంటి రికార్డులు బద్దలవుతాయో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu