Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బీజేపీ మంత్రికి మూకుమ్మడి సెగ

బీజేపీ మంత్రికి మూకుమ్మడి సెగ

Gulte.com 4 days ago

బీజేపీ సీనియర్ నేత, ఏపీ కేబినెట్ లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా కొనసాగుతున్న సత్యకుమార్ కు ఇప్పుడు సొంత పార్టీకి చెందిన నేతల నుంచే సవాల్ లు వినిపిస్తున్న వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది.

సత్యకుమార్ కు దమ్ముంటే రాజీనామా చేయాలని, పార్టీ తరఫున పోటీ చేస్తావో, లేదంటే సొంతంగానే పోటీ చేస్తావో చేయమని… ఎలా పోటీ చేసినా ఓడించి తీరతానని బీజేపీకి చెందిన ధర్మవరం స్థానిక నేత సుదర్శన్ రెడ్డి సవాల్ విసిరారు.

సొంత పార్టీ అని కూడా చూడకుండా తమపైనే దాడులకు దిగుతారా? అంటూ ఆయన సత్యకుమార్ పై ఒంటికాలిపై లేచారు. టీడీపీ, కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన మంత్రికి వ్యతిరేకంగా మూకుమ్మడి నిరసనకు దిగారు.

ఇలా తన సొంత పార్టీకి చెందిన ఓ స్థానిక నేత ధర్మవరం ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రి సత్యకుమార్ పై ఈ తరహాలో బహిరంగంగా సవాల్ విసరడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఈ తరహా పరిణామాలకు దారి తీసిన విషయంలోకి వెళితే… ధర్మవరానికి చెందిన అంజన్ రెడ్డి అనే హైకోర్టు న్యాయవాదిపై సత్యకుమార్ అనుచరులు దాడికి పాల్పడ్డారట.

ఈ విషయం తెలుసుకున్న సుదర్శన్ రెడ్డి… బీజేపీ శ్రేణులతో పాటు టీడీపీ, కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మరీ ధర్మవరంలో నిరసనకు దిగారు. కూటమి మంత్రిపై ఇలా వైసీపి మినహా అన్ని పార్టీలకు చెందిన నేతలు మూకుమ్మడి నిరసనకు దిగిన వైనం కలకలం రేపుతోంది.

ధర్మవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సత్యకుమార్…అసలు స్థానికుడే కాదని సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. అయినా పార్టీ ప్రతిపాదించిన మేరకు స్థానికేతరుడైనా సత్యకుమార్ ను గెలిపించామన్న సుదర్శన్ రెడ్డి… గెలిచాక మంత్రి గారీ అరాచకాలను సహించడం కష్టంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నియోజకవర్గంలో సత్యకుమార్ అనుచరులు భూకబ్జాలకు పాల్పడుతున్నారని, సత్యకుమార్ నియోజకవర్గ వ్యాప్తంగా వసూళ్లకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. తాను చేసిన ఆరోపణలు అక్షర సత్యమని కూడా ఆయన పేర్కొన్నారు. తన ఆరోపణలు సత్యదూరమని సత్యకుమార్ భావిస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేయాలని సుదర్శన్ రెడ్డి సవాల్ విసిరారు. మరి సుదర్శన్ రెడ్డి సవాల్ కు సత్యకుమార్ ఎలాంటి బదులిస్తారన్న విషయంపై ఆసక్తికర చర్చకు తెర లేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu