Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'చనిపోకపోతే ప్రేమ విషయం మీ ఇంట్లో చెప్పేస్తా'

'చనిపోకపోతే ప్రేమ విషయం మీ ఇంట్లో చెప్పేస్తా'

Gulte.com 1 day ago

మానవ జీవన యానంలో ఎప్పటికప్పుడు కొత్త పోకడలు, కొంగొత్త మోసాలు, సభ్య సమాజాన్ని నివ్వెరపరిచే నయా వేధింపులు… ఇలా ఒక్కటేమిటి నిత్యం ఎక్కడో ఒక చోట ఈ తరహా సరికొత్త ఘటనలు నమోదు అవుతున్నాయి.

ఈ తరహా ఘటనల్లో ఓ సారి మగాడు చనిపోతుంటే… మరోసారి ఆడవారు బలైపోతున్నారు. వెరసి ఆడ, మగల మధ్య స్నేహం, ప్రేమల్లో దారుణాతి దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి ఓ కొత్త ఘటనలో మగాడు మృగాడిగా మారిపోగా… అభం శుభం తెలియని యువతి అతడి వేధింపులకు ప్రాణాలు వదిలేసింది.

ఏపీలోని విజయనగరం జిల్లా గరివిడి మండలం తొండంగ్రి గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే… గ్రామానికి చెందిన రాము నాయుడుకు అప్పటికే వివాహం అయ్యింది. అయినా అతగాడి ఆడాళ్ల వేట ఆగలేదు. గ్రామానికి చెందిన అవివాహిత అఖిలతో మాట కలిపాడు. స్నేహం మొదలెట్టాడు. ఆ స్నేహాన్ని కాస్తా ప్రేమ దాకా తీసుకెళ్లాడు. కొంతకాలం పాటు వీరి ప్రేమ అలాగే కొనసాగింది.

ఈ ప్రేమ ఎంతగా ముదిరినా… పెళ్లైన రాము నాయుడిని అఖిల పెళ్లి చేసుకోలేదు కదా. అందుకే ఆమె కుటుంబ సబ్యులు ఆమెకు ఇంకో వ్యక్తితో పెళ్లి నిశ్చయం చేశారు. గురువారం ఈ పెళ్లికి సంబందించిన నిశ్చితార్థం జరగాల్సి ఉంది. అఖిల మరో యువకుడిని పెళ్లి చేసుకుంటోందన్న విషయం తెలిసినంతనే రాము నాయుడులోని మృగాడు నిద్ర మేల్కొన్నాడు. పెళ్లైన తనను ప్రేమించి… ఇంకో యువకుడిని ఎలా పెళ్లి చేసుకుంటుందంటూ అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు.

అంతే తనను ప్రేమించి ఇంకెవరితోనో పెళ్లి ఎలా చేసుకుంటావని అతడు అఖిలను నిలదీశాడు. తనను కాదని ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఒప్పుకునేది లేదని తేల్చేశాడు. ఇప్పటికే పెళ్లి చేసుకున్న నిన్ను తాను ఎలా పెళ్లి చేసుకోవాలంటూ అఖిల కూడా అడగ్గా… అయితే చనిపో అంటూ అతడు ఓ దారుణమైన నియమాన్ని ఆమె ముందు పెట్టాడు. తన మాట ప్రకారం చనిపోకపోతే… మన విషయం అందరికీ చెప్పి నిశ్చితార్థాన్ని రద్దు చేయిస్తానని బెదిరించాడు. అదే జరిగితే… తన కుటుంబ పరువు బజారున పడుతుందని భయపడ్డ అఖిల.. రాము నాయుడు చెప్పినట్టుగా పురుగుల మందు తాగేసింది.

సమాచారం అందుకున్న అఖిల కుటుంబ సభ్యులు ఆమె హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె తీసుకున్న పురుగుల మందు మోతాదు పరిమితికి మించినది కావడంతో చికిత్స తీసుకుంటూనే ఆమె బుధవారం మరణించింది. ఈ క్రమంలో అసలేం జరిగిందన్న విషయాన్ని తెలుసుకున్న అఖిల కుటుంబం రాము నాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. మరి యువతి ప్రాణాన్ని, ఆమె కుటుంబ పరువును బజారున పడేసిన రాము నాయుడిపై చట్టం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న విషయం తేలాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu