Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డాన్ 3 గొడవ నుంచి బయటపడ్డ రణ్‌వీర్

డాన్ 3 గొడవ నుంచి బయటపడ్డ రణ్‌వీర్

Gulte.com 2 weeks ago

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ కు ఒక పెద్ద ఊరట లభించింది. డాన్ 3 సినిమా వివాదం నేపథ్యంలో ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) విధించిన నాన్ కోఆపరేషన్ ఆదేశాలను ఎత్తివేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు.

బుధవారం ముంబైలో జరిగిన ప్రెస్ మీట్ లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇంపా (IMPPA), సింటా (CINTAA) లాంటి ఇతర సినీ సంఘాలు చేసిన ప్రత్యేక విజ్ఞప్తి మేరకే ఈ బ్యాన్ ను రద్దు చేస్తున్నట్లు FWICE చీఫ్ అడ్వైజర్ అశోక్ పండిట్ స్పష్టం చేశారు.

ఈ గొడవను సామరస్యంగా కూర్చుని పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలకు వారు సూచించారు. అసలు ఈ వివాదం ఎలా మొదలైందంటే, ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన డాన్ 3 సినిమాలో రణ్‌వీర్ సింగ్ హీరోగా ఎంపికయ్యాడు. 2023 ఆగస్టులో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే 2025 డిసెంబర్ లో దురంధర్ సినిమా సూపర్ హిట్ అయిన పదిహేను రోజులకే, రణ్‌వీర్ సడెన్ గా డాన్ 3 ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు.

బడ్జెట్ 300 కోట్ల రూపాయల మేర ఉండాల్సి ఉండగా దానిని సగానికి తగ్గించడం, ఫైనల్ స్క్రిప్ట్ నచ్చకపోవడం లాంటి కారణాలతో ప్రాజెక్ట్ కు గుడ్ బై చెప్పినట్లు సమాచారం. ఆ సమయంలో 2026 జనవరిలో మొదటి షెడ్యూల్ కోసం విదేశాలకు వెళ్లాల్సిన 200 మంది క్రూ మెంబర్స్ ప్రయాణం కూడా క్యాన్సిల్ అయింది. హీరో హఠాత్తుగా తప్పుకోవడంతో డాన్ 3 నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ కు నష్టాలు తప్పలేదు. అప్పటికే ప్రీ ప్రొడక్షన్ కోసం సుమారు 45 కోట్లు ఖర్చు చేశామని, ఆ మొత్తాన్ని పరిహారంగా ఇవ్వాలని నిర్మాతలు డిమాండ్ చేస్తూ గిల్డ్ కు ఫిర్యాదు చేశారు.

అమీర్ ఖాన్, సిద్ధార్థ్ రాయ్ కపూర్ లాంటి పెద్దల సమక్షంలో చర్చలు జరిగినా ఎలాంటి ఫలితం రాలేదు. రణ్‌వీర్ కేవలం 10 కోట్లు ఇస్తానని చెప్పడంతో ఆ చర్చలు విఫలమయ్యాయి. దాంతో నిర్మాతలు FWICE ని ఆశ్రయించడంతో, రణ్‌వీర్ పై వారం రోజుల క్రితం నాన్ కోఆపరేషన్ ఆదేశాలు జారీ అయ్యాయి. సుమారు ఐదు లక్షల మంది సభ్యులున్న FWICE ఇలాంటి బ్యాన్ విధిస్తే నటీనటుల భవిష్యత్తుకు పెద్ద ఇబ్బందే ఎదురవుతుంది. అందుకే ఈ బ్యాన్ విధించిన వారం రోజులకే రణ్‌వీర్ సింగ్ టీమ్ తిరిగి ఫెడరేషన్ కు లీగల్ నోటీసులు పంపింది.

ఒక నటుడికి, నిర్మాణ సంస్థకు మధ్య ఉన్న వ్యవహారంలో జోక్యం చేసుకునే చట్టపరమైన హక్కు ఫెడరేషన్ కు లేదని లాయర్ సంజయ్ వాసుదేవన్ సైతం అభిప్రాయపడ్డారు. అయితే తాము ఎలాంటి ఒత్తిడికి తలొగ్గలేదని, 70 ఏళ్ల చరిత్ర ఉన్న తమ సంస్థకు ఇలాంటి నోటీసులు కొత్తేమీ కాదని FWICE ప్రెసిడెంట్ బి.ఎన్. తివారీ స్పష్టం చేశారు. ఇండస్ట్రీలో ప్రశాంతత కోసమే బ్యాన్ ఎత్తివేసినట్లు వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu