Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దర్శకుడు చనిపోయినా సినిమా బ్రతుకుతోంది

దర్శకుడు చనిపోయినా సినిమా బ్రతుకుతోంది

Gulte.com 1 week ago

ప్రపంచంలో ఏ భాషలో అయినా సినిమా గొప్పదనం ఒకటుంది. మనుషులు భౌతికంగా ఉన్నా లేకపోయినా వాళ్ళను దశాబ్దాల తరబడి గుర్తుంచుకునేలా చేసే శక్తి దీనికి మాత్రమే ఉంది.

అందుకే కెవి రెడ్డితో పరిచయం లేని వాళ్ళు మాయాబజార్ ని కొలుస్తారు. దాసరి నారాయణరావుని కలవని వాళ్ళు ప్రేమాభిషేకంని తన్మయత్వంతో చూస్తారు. కోడి రామకృష్ణని గుర్తు పట్టలేని వాళ్ళు అవకాశం దొరికినప్పుడంతా అమ్మోరు, అంకుశం లాంటి క్లాసిక్స్ ని పదే పదే చూస్తుంటారు.

ఈ వారం విడుదల కాబోతున్న కేజేక్యూ దర్శకుడు కేకే ఆ సినిమా షూటింగ్ పూర్తి కాకముందే దురదృష్టవశాత్తు కాలం చేసిన సంగతి తెలిసిందే. మిగిలిన భాగాన్ని కేకే ఆలోచనలకు అనుగుణంగా టీమ్ పూర్తి చేసి థియేటర్లకు తీసుకొస్తోంది. దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి, శ్రీకాంత్ ఓదెల తమ్ముడు శశి ఓదెల హీరోలుగా నటించిన ఈ క్రైమ్ కం గ్యాంగ్ స్టర్ డ్రామాలో యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది. నేర ప్రపంచంలో మునిగి తేలిన ఇద్దరు ప్రాణ స్నేహితుల కథగా కేజేక్యూని తెరకెక్కించారు.

ప్రమోషన్లు, ఈవెంట్లు చేసిన ప్రతి సందర్భంలోనూ కేజేక్యూలో నటించిన వాళ్ళు, పని చేసిన వాళ్ళు చాలా ఎమోషనల్ అవుతున్నారు. సానుభూతితో సినిమా చూడొద్దని, మంచి కథతో తీసిన ఒక నిజాయితీ ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తే అదే కేకేకి ఇచ్చిన నివాళి అవుతుందని అంటున్నారు. అయితే ఈ మూవీకి కొరియన్ కనకరాజు రూపంలో కొంచెం టఫ్ కాంపిటీషన్ ఉంది. జానర్లు వేరే అయినప్పటికీ బజ్ పరంగా దాన్ని తట్టుకోవాలంటే కేజేక్యూకి యూనానిమస్ టాక్ రావాలి.

ప్రేక్షకులు సింపతీ కోణంలో చూసినా చూడకపోయినా ఫైనల్ గా మాట్లాడాల్సింది కంటెంటే. స్వయంగా సందీప్ రెడ్డి వంగా ప్రమోషన్స్ కు వచ్చి తనకు తెలిసిన విషయాలు పంచుకోవడం చూస్తుంటే కేకే పడిన కష్టం కనిపిస్తోంది. స్టార్ క్యాస్టింగ్ లేకుండా, పేరున్న సంగీత దర్శకుడిని పెట్టుకోకుండా పరిమిత బడ్జెట్ లో ఇద్దరు అప్ కమింగ్ యాక్టర్స్ తో కేకే చేసిన ప్రయత్నం మంచి ఫలితం ఇస్తే మటుకు నిజమైన నివాళిగా నిలిచిపోతుంది. కేడి ఫ్లాప్ రూపంలో గతంలో తగిలిన గాయం మానిపోతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu