Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దేవిలో ఇది గొప్ప లక్షణం

దేవిలో ఇది గొప్ప లక్షణం

Gulte.com 2 weeks ago

టీనేజీలోనే తన ప్రతిభను చాటుకుని చాలా వేగంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగాడు దేవిశ్రీ ప్రసాద్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే అతను.. తన మూలాలను ఎప్పుడూ మరిచిపోలేదు.

తనకు జీవితాన్నిచ్చిన తండ్రి సత్యమూర్తి మీద అతనెంత ప్రేమ చూపిస్తాడో ఎన్నో సందర్భాల్లో చూశాం. ఇక తనకు సంగీతంలో ఓనమాలు దిద్దిన మాండలిన్ శ్రీనివాస్ మీద కూడా అమితమైన గౌరవ మర్యాదలు ప్రదర్శిస్తాడు.

మాండలిన్ శ్రీనివాస్ చనిపోయి ఎన్నో ఏళ్లయినా.. సందర్భం వచ్చిన ప్రతిసారీ గురువును స్మరించుకుంటూనే ఉంటాడు. ఏటా ఆయన జయంతికి, వర్ధంతికి ఘనంగా నివాళి అర్పిస్తుంటాడు. అలాగే ఇండస్ట్రీలో తనకు అవకాశాలిచ్చి ప్రోత్సహించిన వారి మీదా దేవికి అమితమైన గౌరవ మర్యాదలు ఉన్నాయి. 18 ఏళ్ల వయసులోనే దేవి ప్రతిభను గుర్తించి 'దేవి' సినిమాకు సంగీత దర్శకుడిగా పెట్టుకుంది సీనియర్ నిర్మాత ఎం.ఎస్.రాజు. తన మీద దేవి గురుభక్తి ఎలాంటిదో స్వయంగా రాజే వెల్లడించారు.

శత్రువు, ఒక్కడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, మనసంతా నువ్వే లాంటి బ్లాక్ బస్టర్లతో ఒకప్పుడు వైభవం చూసిన నిర్మాత ఎం.ఎస్.రాజు. తర్వాత ఫ్లాపులతో వెనుకబడ్డ ఆయన.. ఈ మధ్య దర్శకుడిగా చిన్న సినిమాలు తీస్తున్నారు. తాజాగా ఆయన 'అగధ' అనే సినిమా తీశారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన ఆయన.. దేవి తన మీద చూపించే గౌరవ మర్యాదల గురించి ప్రస్తావించారు. తన ప్రతి పుట్టిన రోజుకూ వీడియో కాల్ చేసి, ఏమీ మాట్లాడకుండా ఆర్కెస్ట్రా టీంతో హ్యాపీ బర్త్ డే మ్యూజిక్ ప్లే చేయించి విష్ చేస్తాడని.. ఇప్పటికీ ఇది కొనసాగుతోందని రాజు వెల్లడించారు.

ఇక 'యల్లమ్మ' సినిమాతో హీరోగా మారుతున్న విషయాన్ని తనకు ఫోన్ చేసి చెప్పిన దేవి.. ఆ సినిమా మొదలయ్యే రోజు తనను కలిసి ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటున్నట్లు చెప్పాడని గుర్తు చేసుకున్నాడు. ఐతే వచ్చి కలవాల్సిన అవసరం లేదని, నా ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయని చెప్పి అతణ్ని బ్లెస్ చేసినట్లు రాజు వెల్లడించారు. ఎప్పుడో పాతికేళ్ల కిందట తొలి అవకాశం ఇచ్చారని.. ఇంకా ఇలా గుర్తుపెట్టుకుని గౌరవించడం దేవికే చెల్లింది. దేవిని మిగతా వాళ్లంతో భిన్నంగా నిలబెట్టేది ఈ కృతజ్ఞతా భావమే. ఇండస్ట్రీలో అందరూ తన నుంచి నేర్చుకోవాల్సిన పాఠమిది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu