Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఢిల్లీలో పసుపు జండా రెపరెప..!

ఢిల్లీలో పసుపు జండా రెపరెప..!

Gulte.com 6 days ago

దేశ రాజధాని ఢిల్లీలో తెలుగోడి ఆత్మ గౌరవానికి తూట్లు పడుతున్నాయని నాడు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం దివంగత నందమూరి తారక రామారావు ఆవేదనకు లోనయ్యారు.

అలాంటి పరిస్థితులను రూపుమాపి.. ఢిల్లీ నడి వీధుల్లో తెలుగోడి పవర్ ఏమిటో చూపాలన్న కసితో సాగిన ఎన్టీఆర్… తెలుగు దేశం పార్టీ (టీడీపీ)పేరిట పార్టీని స్థాపించి సత్తా చాటారు.

ఎన్టీఆర్ చేతుల్లో పురుడు పోసుకున్న టీడీపీ జెండా ఇప్పుడు ఢిల్లీ నడి వీధుల్లో రెపరెపలాడనుంది. అది కూడా ఢిల్లీలోని ఏదో మూల అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే… ఢిల్లీ నగరం నడిమధ్యలో సిటీ ప్రైమ్ లొకేషన్ లో టీడీపీ తన కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు వేగంగా అడుగులు పడుతున్నాయి.

టీడీపీ ఆవిర్భవించి అప్పుడే నాలుగు దశాబ్దాలు గడిచిపోతున్నా… దేశ రాజకీయాల్లో చాలా సార్లు కీలక పార్టీగా పనిచేసినా.. ఇప్పటిదాకా దేశ రాజధాని నగరం ఢిల్లీలో పార్టీకి కార్యాలయం అంటూ లేదు. టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్ ను నిత్యం వినిపిస్తూ వస్తున్న టీడీపీ నేతలు… పార్టీకి ఢిల్లీలో కేంద్ర కార్యాలయం గురించి అంతగా పట్టించుకోలేదనే చెప్పాలి. అయితే తన నలభై ఏళ్ల ప్రస్థానంలో దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతంగా సాగుతున్న టీడీపీకి ఇప్పుడు ఢిల్లీలో కార్యాలయం కావాలని పార్టీ అధిష్ఠానం భావించింది.

అనుకున్న వెంటనే ఆ విషయాన్ని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు వద్ద ప్రతిపాదించింది. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుకు ఊపిరిగా నిలుస్తున్న టీడీపీ అడగడమే ఆలస్యం అన్నట్లుగా కేంద్రం.. ఈ ప్రతిపాదనపై వేగంగా స్పందించింది. టీడీపీ ప్రతిపాదనను త్వరితగతిన పరిశీలించాలంటూ ఢిల్లీ సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది.

వెరసి టీడీపీ ప్రపోజల్ ను తెరచిన ఢిల్లీ సర్కారు… శరవేగంగా దానిపై ఓ నిర్ణయం తీసుకుంది. తాను చేసిన ప్రతిపాదనకు ఢిల్లీ సర్కారు నుంచి వచ్చిన స్పందనకు టీడీపీ ఓకే అనడమే ఆలస్యం క్షణాల్లో టీడీపీ కేంద్ర కార్యాలయ నిర్మాణానికి అవసరమైన స్థలం ఇట్టే దక్కిపోతుంది. ఆపై కళ్లు మూసి తెరిచేలోగానే ఢిల్లీ నడి వీధుల్లో తెలుగోడి ఆత్మ గౌరవాన్ని రెపరెపలాడించేలా టీడీపీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది.

దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్న టీడీపీ.. ఢిల్లీ తన కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తోందని ఆ పార్టీ అధిష్ఠానం కేంద్రానికి ఓ ప్రతిపాదన పంపింది. పార్టీ కార్యాలయం కోసం 2 వేల చదరపు మీటర్ల స్థలం కావాలని కోరింది. కేంద్రం ఆదేశాలతో ఈ ప్రతిపాదనను పరిశీలించిన ఢిల్లీ సర్కారు… దీన్ దయాళ్ మార్గ్ లో బీజేపీ కేంద్ర కార్యాలయం పక్కనే ఖాళీగా ఉన్న 1,200 చదరపు మీటర్ల స్థలాన్ని గుర్తించింది.

ఎలాంటి వివాదాలు లేని ఈ స్థలాన్ని టీడీపీకి తక్షణమే బదలాయించవచ్చని ఢిల్లీ చీఫ్ ఆర్కిటెక్ట్ కేంద్రానికి సిఫారసు చేశారు. ఈ విషయాన్ని టీడీపీకి చేరవేసిన కేంద్రం… తక్షణమే ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరింది. వెరసి తెలుగోడి ఆత్మ గౌరవానికి తూట్లు పడిన అదే ఢిల్లీ నడి వీధుల్లో అదే తెలుగోడి ఆత్మ గౌరవం సగర్వంగా నిలవనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu