Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ధోని రికార్డుకు బ్రేక్

ధోని రికార్డుకు బ్రేక్

Gulte.com 4 days ago

ఇండియన్ క్రికెట్లోనే ఐపీఎల్‌లో అద్భుతమైన రికార్డులున్న క్రికెటర్లలో మహేంద్ర సింగ్ ధోని ఒకడు. అతడి సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా ఐదుసార్లు విజేతగా నిలిచింది.

కొన్నేళ్ల నుంచి ఫామ్ అంత గొప్పగా లేకపోయినప్పటికీ.. ఒక్కో సీజన్‌ను పొడిగించుకుంటూ ఐపీఎల్‌లో కొనసాగుతూ వచ్చాడు మహి.

2008లో ఐపీఎల్ ఆరంభమైనప్పటి నుంచి ప్రతి సీజన్లోనూ ఆడుతున్న అతి కొద్దిమంది క్రికెటర్లలో ధోని ఒకడు. ఈ జాబితాలో ధోని కాకుండా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, మనీష్ పాండే మాత్రమే ఉన్నారు.

కోహ్లి మొదట్నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోనే ఉండగా.. డెక్కన్ ఛార్జర్స్‌ జట్టుతో మొదలుపెట్టి, తర్వాత ముంబయి ఇండియన్స్‌కు మారిన రోహిత్, అదే జట్టుతో కొనసాగుతున్నాడు. మనీష్ పాండే బెంగళూరుతో మొదలుపెట్టి వేర్వేరు ఫ్రాంఛైజీలకు ఆడి, ఇప్పుడు కోల్‌కతాతో కొనసాగుతున్నాడు.

మొదట్నుంచి చెన్నైకే ఆడుతున్న ధోని.. మధ్యలో ఆ ఫ్రాంఛైజీపై నిషేధం పడ్డ రెండేళ్లు మాత్రం పుణె సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

కొన్నేళ్ల ముందే ధోని రిటైరవుతాడని వార్తలు వచ్చాయి కానీ.. అవేవీ నిజం కాలేదు. గత సీజన్లోనూ పూర్తి స్థాయిలో లీగ్‌లో ఆడాడు. ఈసారి కూడా ఆడి ఐపీఎల్ నుంచి రిటైరవుతాడని ఆశిస్తే.. అతను బరిలోకే దిగలేదు. మొదట్లో గాయం వల్ల రెండు వారాలు దూరమన్నారు. కానీ లీగ్ చివరి దశకు వచ్చినప్పటికీ మహి ఒక్క మ్యాచ్‌లోనూ ఆడలేదు.

గురువారం చెన్నై.. గుజరాత్‌తో తన చివరి లీగ్ మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరుగుతుంటే.. ధోని తన సొంత నగరం రాంచీకి వెళ్లిపోయాడు. చెన్నై ప్లేఆఫ్స్‌కు వెళ్లడం సందేహంగానే ఉంది. ఒకవేళ వెళ్లినా ధోని ఆడతాడని గ్యారెంటీ లేదు.

కాబట్టి ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ధోని ఆడనట్లే భావిస్తున్నారు. ఐపీఎల్ ఆరంభమైనప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి సీజన్ ఆడుతున్న ఆటగాళ్ల జాబితాలో ఇక ధోని ఉండడు.

కోహ్లి, రోహిత్, పాండే మాత్రమే ఆ లిస్టులో కొనసాగనున్నారు. ధోని రికార్డుకు 2025లోనే తెరపడినట్లవుతుంది. ఇక మహి రిటైర్మెంట్ గురించి ప్రకటన ఎప్పుడొస్తుందన్నదే చూడాలి. ఐపీఎల్ హంగామా ముగిశాక అయినా అతను ఈ ప్రకటన చేస్తాడా.. లేక అభిమానులను ఇలాగే అయోమయంలోనే ఉంచుతాడా అన్నది చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu