విడుదల ఇంకా పదమూడు రోజులు ఉండగానే అడ్వాన్స్ బుకింగ్ మొదలుపెట్టడం ఈ మధ్య కాలంలో ఏ ప్యాన్ ఇండియా సినిమాకు చూడలేదు. రామాయణ పార్ట్ 1 అది చేసి చూపిస్తోంది.
తెలుగు వెర్షన్ తో సహా అన్ని భాషల టికెట్ల అమ్మకాలు బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్స్ వేదికగా మొదలైపోయాయి. అప్పుడే ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఎస్విసి తరఫున దిల్ రాజు ఏపీ, తెలంగాణ హక్కులు కొన్న సంగతి తెలిసిందే. ఇక్కడ మంచి నిర్ణయం అన్నది దీని గురించి కాదు. టికెట్ రేట్ల విషయంలో అనుసరించిన స్ట్రాటజీ గురించి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో రామాయణకు ఎలాంటి హైక్స్ అడగకుండా విడుదల చేస్తున్నారు. అంటే ఏపీ మల్టీప్లెక్సుల్లో ఈ విజువల్ గ్రాండియర్ ని 177 రూపాయలకు చూసేయొచ్చు. 3డి అయితే ఇంకో పాతిక ఎక్కువ. అదే హైదరాబాద్ లో గరిష్టంగా 200 నుంచి 295 వరకు ఉంటుంది. ఒకవేళ దిల్ రాజు అనుమతులు కనక తీసుకుని ఉంటే వీటి మీద అదనంగా ఇంకో 50 నుంచి 75 రూపాయల భారం పడేది. హైప్ కోణంలో చూసుకుంటే దిల్ రాజు తీసుకున్నది తెలివైన డెసిషన్. ఎందుకో చూద్దాం.
రామాయణ లాంటి ఎపిక్ మూవీస్ కి ఫుట్ ఫాల్స్ ఎక్కువగా ఉంటాయి. వీలైనంత ప్రేక్షకులను థియేటర్ కు వచ్చేలా చేయాలంటే ధరలు పెంచారనే ఫీలింగ్ వాళ్లలో కలిగించకూడదు. పెద్ది, టాక్సిక్, ప్యారడైజ్ ఈ తప్పు చేసి తగిన మూల్యాన్ని చెల్లించాయి. అందుకే రామాయణ విషయంలో దిల్ రాజు ఎలాంటి పర్మిషన్లు అడిగే అవసరం రాకుండా రెగ్యులర్ రేట్లు, షోలతో ముందుకు వెళ్తున్నారు. దీని వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ మద్దతు తక్కువ సమయంలో ఎక్కువ శాతం దక్కుతుంది.
రన్బీర్ కపూర్, సాయి పల్లవి, యష్, సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలు పోషించిన రామాయణ పార్ట్ 1 విడుదలయ్యే నాటికి హైప్ లో అమాంతం మార్పు వస్తుందని టీమ్ భావిస్తోంది. ఢిల్లీ నుంచి చెన్నై దాకా అన్ని చోట్ల ఈవెంట్లు చేస్తూ ఫ్యాన్స్, మీడియాని కలుసుకుంటున్నారు. తెరమీద ఇంతవరకు ఎవరూ చూపించని స్థాయిలో రాముడి గాథని తెరకెక్కించానని దర్శకుడు నితేశ్ తివారి చాలా సందర్భాలలో చెప్పారు. ఆయన నమ్మకం నిజమైతే బ్లాక్ బస్టర్ పడుతుంది.

